సాక్షి, హైదరాబాద్: రేపటి(బుధవారం) నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలకు హాజరై రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలను ఆదేశించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో ఆయన సోమవారం రాత్రి ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు.
సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కేసీఆర్ పలు రాజకీయ, పాలనపరమైన అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం. తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని, తద్వారా రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని పార్టీ ఎంపీలకు సుదీర్ఘంగా వివరించినట్లు తెలిసింది. పార్లమెంటులో లోపలా, బయటా చోటు చేసుకునే పరిస్థితులను బట్టి వ్యూహరచన చేసుకోవాలని సూచించారు. సీబీఐ, ఐటీ, ఈడీ సోదాలు, కేసుల విషయంలో విపక్షాలతో కలిసి ఆందోళనలు చేయాలని సూచించారు. ప్రతిపక్షాలు చేసే ఇతర ధర్నాలు, ఆందోళనలకు అంశాల వారీగా టీఆర్‌ఎస్ మద్దతునిస్తుందని తెలిపారు.
అవసరమైతే సమావేశాల బహిష్కరణ!
ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసిన కుట్రలను పార్లమెంటు వేదికగా ఎండగట్టాలని కేసీఆర్ సూచించారు. అవసరమైతే పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలను అడ్డుకున్న తీరుతో పాటు అందులో బీజేపీ పాత్ర, విచారణను అడ్డుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా ఎంపీలకు వివరించారు.
విభజన హామీల అమలులో తెలంగాణ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, నిధుల విడుదలలో చూపుతున్న వివక్షను గణాంకాలతో సహా వివరించారు. గవర్నర్ వ్యవస్థతో పాటు, సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థలను ప్రయోగించడం ద్వారా విపక్ష రాజకీయ పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తున్న తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్రం నుంచి ఎదురవుతున్న సహాయ నిరాకరణను ప్రజలకు వివరించేందుకు ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించిన తర్వాత జాతీయ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు ముమ్మరంగా ఉంటాయని చెప్పినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment