
బుధవారం తన చాంబర్‌లో సైదిరెడ్డితో ప్రమాణం చేయిస్తున్న స్పీకర్ పోచారం
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయన సొంత గడ్డపైనే కేసీఆర్ దెబ్బ ఏంటో రుచి చూపించాం. హుజూర్‌నగర్ అంటే గతంలో ఉత్తమ్ గడ్డ అనే వారు. కానీ ఇప్పుడు ఆ గడ్డపైనే టీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో గెలిచింది’అని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ ఒకటో తేదీన మంత్రి కేటీఆర్ హుజూర్‌నగర్ నియోజకవర్గం పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు.
సైదిరెడ్డి ప్రమాణ స్వీకారం
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో గెలిచిన సైదిరెడ్డి బుధవారం అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్‌లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో సైదిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, మల్లారెడ్డితో పాటు పలువురు నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలతోపాటు శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద సైదిరెడ్డి నివాళి అరి్పంచారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్‌గా జీవన్‌రెడ్డి
శాసనసభ పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్‌గా ఆర్మూరు శాసనసభ్యులు ఆశన్నగారి జీవన్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జీవన్‌రెడ్డిని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌అలీ, జగదీశ్‌రెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డితో పాటు పలువురు శాసనసభ్యులు, పార్టీ నేతలు అభినందించారు. జీవన్‌రెడ్డి అనుచరులు ఆర్మూరు నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున తరలివచ్చారు.