
కారు జోరుకు రికార్డులన్నీ బద్దలే..
సాక్షి, సూర్యాపేట : హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో కారు జోరు చూపించింది. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43,624 ఓట్ల మెజార్టితో టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి టీఆర్‌ఎస్ ఆదిపత్యంలో దూసుకుపోయింది. రౌండ్ రౌండ్‌కు మొజార్టీ పెంచుకుంటూ.. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టింది. ఈ ఉప ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ, బీజేపీ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. ఇదిలా ఉంటే.. హుజూర్‌నగర్‌లో గెలిచి సైదిరెడ్డి రికార్డ్ బ్రేక్ చేశారు.ఆయన సాధించిన మెజార్టీ ఇంతవరకూ హుజూర్‌నగర్ చరిత్రలోనే ఇంతవరకూ ఎవరూ సాధించలేదు.
ఇప్పటి వరకూ హుజూర్‌నగర్‌లో 29,194 ఓట్లు మెజార్టీ ఉంది. అయితే సైదిరెడ్డి ఏకంగా 43,624 ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం.ఈనెల 21న జరిగిన ఉప ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండల్లాలోని 302 పోలింగ్ కేంద్రాల్లో 2,00,754 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలో మొత్తం 28 మంది పోటీ పడ్డారు. టీఆర్‌ఎస్ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరఫున పద్మావతి ఉత్తమ్‌రెడ్డి, బీజేపీ తరఫున రామారావు బరిలోకి దిగిన విషయం తెలిసిందే.