
సాక్షి, సూర్యాపేట : ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జరిగే బహిరంగ సభకు తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రానుండడంతో అందరి దృష్టి హుజూర్‌నగర్ వైపే ఉంది. ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతున్న నేపథ్యంలో.. ఉద్యోగ సంఘాలు కూడా వారికి మద్దతు తెలపడంతో రేపు జరగబోయే సభలో ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన ప్రకటన ఏమైనా ఉంటుందా? అనే అంశం ఆసక్తిగా మారింది. బహిరంగ సభలో కేసీఆర్ ఏమి మాట్లాడబోతున్నారని.. ప్రతిపక్ష పార్టీలు ఎదురు చూస్తున్నాయి.
హుజూర్‌నగర్‌కు వరాల జల్లు కురిపించే అవకాశం ఉన్న తరుణంలో.. సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్మికులను ముందస్తు అరెస్టులు చేస్తే ప్రజల్లో వ్యతిరేకత రావచ్చని టీఆర్‌ఎస్ నేతలు సందిగ్ధంలో ఉన్నారు. మరో వైపు సీపీఐ మద్దతు ఉపసంహరణ నేపథ్యం, టీఆర్‌ఎస్‌పై బీజేపీ చేస్తున్న ఆరోపణలు అన్నింటికి రేపు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
ఇక ఉపఎన్నిక ప్రచార గడువు సమీపిస్తుండడంతో పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తుతున్నాయి. ఉప ఎన్నికల ఇంచార్జీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో.. 70 మంది నేతలతో టీఆర్‌ఎస్ ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకునే దిశగా ప్రచారం చేస్తుంది. ఇప్పటికే కేటీఆర్ రోడ్ షో ముగిసింది. ఎంత మంది బలమైన నేతలు ప్రచారం చేసినా.. కేసీఆర్ ప్రచారంపైనే టీఆర్‌ఎస్ నేతలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.