వెలుగుపల్లిలో రైతు ఆంగోతు హర్జతో మాట్లాడుతున్న కేసీఆర్
రైతులకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ భరోసా
జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటల పరిశీలన
జనగామ/ తుంగతుర్తి/ సూర్యాపేట రూరల్: ‘‘పంట ఎండిపోయిందని అధైర్యపడొద్దు.. ధైర్యంగా ఉండండి.. అధికారులు వచ్చినప్పుడు నష్టం వివరాల ను రాయించుకోండి. మేం అండగా ఉంటాం’’అని రైతులకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. ఎండిన పంట పొలాల పరిశీలనలో భాగంగా.. ఆదివారం జనగా మ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సింగారంతండా, మొండికుంట తండా, సూర్యా పేట మండలం ఎర్కారం గ్రామాల్లో పర్యటించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. ‘‘యాసంగిలో ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎంత పెట్టుబడి పెట్టారు. కరెంటు ఎన్ని గంటలు వస్తోంది. కాలువల ద్వారా నీళ్లొస్తున్నాయా. బోర్లలో నీళ్లు ఉన్నాయా.. రైతుబంధు వచ్చిందా..’’ అని అడిగి తెలుసుకున్నారు.
నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ..
కేసీఆర్‌కు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పొట్టదశకు వచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోయిందంటూ కన్నీళ్లుపెట్టుకున్నారు. జనగామ జిల్లా ధరావత్ తండాలో మహిళా రైతు అముగోతు సత్తెమ్మ మాట్లాడుతూ.. ‘‘సారూ.. ఎనిమిది ఎకరా ల్లో వరి వేసినం. రూ.3 లక్షలకుపైగా పెట్టుబడులు అయినయి. కాలువ నీళ్లు రాక.. రూ.1.80 లక్షలు ఖర్చుచేసి నాలుగు బోర్లు వేయించినం. వాటిలోనూ నీళ్లు సరిగా పడలేదు. పంటంతా ఎండిపోతోంది. ఇక మాకు దిక్కెవరు..’’ అంటూ కన్నీరు పెట్టుకుంది. కుమారుడి పెళ్లి పెట్టుకున్నామని, అప్పులు కూడా పుట్టట్లేదని వాపోయింది. దీంతో ‘‘బిడ్డా బాధపడకు.. మళ్లీ వచ్చేది మనమే. బాధలన్నీ తీరుతయి. అందాక రూ.5లక్షల చెక్కు పంపిస్తా.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెచ్చిస్తరు’’ అని భరోసా ఇచ్చారు.
సాగు నీళ్లు రావడం లేదంటూ..
తర్వాత కేసీఆర్ సూర్యాపేట జిల్లాలోని సింగారం, మొండికుంట తండాల్లో ఎండిపోయిన పొలాలను పరిశీలించారు. రైతులు దయ్యాల వెంకటనారాయ ణ, ధరావత్ సురేశ్, భూక్యా శ్రీను, ఆంగోతు హర్జా, గుగులోతు సుశీలతో మాట్లాడారు. ఈ రెండు తండాల్లో 250 ఎకరాల వరకు వరి వేయగా.. పూర్తిగా ఎండిపోయిందని రైతులు తెలిపారు. గత ఐదారేళ్లు ఎస్సారెస్పీ కాలువ ద్వారా గోదావరి జలా లు రావడంతో.. పంటలు బాగా పండాయన్నారు. ఈ యాసంగి సీజన్ మొదట్లో కాల్వల ద్వారా నీళ్లు వదలడంతో.. వరి వేశామని, కానీ ఇప్పుడు నీళ్లు రాక పంటలన్నీ ఎండిపోయాయని వాపోయారు. రోజులో 16 గంటలే కరెంట్ వస్తోందని.. అదికూడా 16 సార్లు ట్రిప్ అవుతోందని పేర్కొన్నారు. ప్రభు త్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా చూడాలని వేడుకున్నారు. అనంతరం కేసీఆర్ సూర్యాపేట మండలం ఎర్కారం చేరుకున్నారు.
మళ్లీ అప్పుల పాలవుతున్నాం..
ఎర్కారం గ్రామంలో రైతు కొదమగుండ్ల వెంకటయ్య, సరోజనమ్మ పొలాన్ని కేసీఆర్ పరిశీలించారు. ఈ సమయంలో సరోజనమ్మ కేసీఆర్ వద్దకు వచ్చి విలపించింది. ‘‘మీరు సీఎంగా ఉన్నప్పుడు సాగునీళ్లు వచ్చేవి. సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. కాలువ నీళ్లు రావట్లేదు. ఐదెకరాల్లో వరి ఎండింది. మళ్లీ అప్పుల పాలు అవుతున్నాం’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతా
రైతుల గోడు ఆలకించిన కేసీఆర్.. వారికి ధైర్యం చెప్పారు. ఏ రైతును పలకరించినా కన్నీరే వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తానని.. ఎండిన వరి పొలాలకు ఎకరానికి రూ.25 వేలు నష్ట పరిహారం వచ్చేలా చేస్తానని చెప్పారు. ఎన్ని కష్టాలెదురైనా మళ్లీ 24 గంటల కరెంట్‌ను సాధించుకుందామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment