కేసీఆర్‌ సారొస్తుండు! | CM KCR Visits Huzurnagar Today For Winning Of Bye Elections | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ సారొస్తుండు!

Published Sat, Oct 26 2019 10:23 AM | Last Updated on Sat, Oct 26 2019 1:56 PM

CM KCR Visits Huzurnagar Today For Winning Of Bye Elections - Sakshi

సాక్షి, సూర్యాపేట : హుజూర్‌నగర్‌లో శనివారం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ కృతజ్ఞత సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 17న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హుజూర్‌నగర్‌ రావాల్సి ఉండగా వర్షంతో సభ రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఉప ఎన్నికల్లో పార్టీ భారీ విజయం సాధించడంతో కృతజ్ఞత సభ నిర్వహించి నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇవ్వాలని ముఖ్యనేతలు కోరడంతో ముఖ్యమంత్రి ఈ సభకు హాజరవుతున్నారు. అయితే ఈ సభలో సీఎం నియోజకవర్గానికి ఏం వరాలు ఇస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. సాయంత్రం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది.

భారీగా నిర్వహించేందుకు....
ఇటీవల సభ రద్దయిన ప్రాంతంలోనే వేదికను సిద్ధం చేశారు. ఫణిగిరి గుట్టకు వెళ్లే దారిలో సభ నిర్వహిస్తుండడంతో నియోజకవర్గ నలు మూలల నుంచి భారీ జన సమీకరణకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అన్ని మండలాల నుంచి జనసమీకరణకు వాహనాలను కేటాయించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేగా విజయం సాధించిన శానంపూడి సైదిరెడ్డి నేతృత్వంలో సభ ఏర్పాట్లు, జన సమీకరణపై నియోకవర్గ నేతలతో శుక్రవారం సమీక్షించారు. కృతజ్ఞత సభ నియోజకవర్గ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో చేయాలని ముఖ్యనేతలు నిర్ణయించినట్లు సమాచారం. సభ ఏర్పాట్లను మంత్రి, ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో పాటు కలెక్టర్‌ దుగ్యాల అమయ్‌కుమార్, ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌లు పరిశీలించారు. 


సిద్ధమవుతున్న సభా వేదిక

ఈ సమస్యలపై సీఎం ప్రకటన చేస్తారని...
నియోజకవర్గంలోని పలు సమస్యలపై సీఎం ఈ సభా వేదికగా ప్రకటన చేస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. పట్టణ పరిధిలోని ఫణిగిరి గుట్ట సమీపంలో 4వేల ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. వీటికి కొద్దిపాటి నిధులు కేటాయిస్తే పనులు పూర్తి కానున్నాయి. హుజూర్‌నగర్‌ పట్టణంలో ప్రధాన రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న ఆస్పత్రిని 100 పడకలుగా చేయడం, హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయడం, రింగ్‌రోడ్డు పూర్తి చేయడం తదితర డిమాండ్లు ఉన్నాయి. అలాగే ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలు, సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండడంతో కార్మికుల కోసం ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. చింతలపాలెం, మేళ్ల చెరువు మండలాలను కోదాడ కోర్టు నుంచి హుజూర్‌నగర్‌ కోర్టు పరిధిలోకి తేవడం, చింతలపాలెం, మఠంపల్లి మండలంలో టేలాండ్‌ భూములకు కృష్ణానది నుంచి ఎత్తిపోతలతో నీళ్లు తేవాలన్న డిమాండ్లు ఎన్నికల ప్రచారంలో కూడా బాగా జరిగాయి. ఇవన్నింటిపై ముఖ్యమంత్రి సభావేదికపై వరాలు జల్లు కురిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 

సీఎం టూర్‌ ఇలా..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌ నుంచి మధ్యాహ్నం 11 గంటలకు రోడ్డు మార్గంలో బయలు దేరి 1.30 గంటలకు సూర్యాపేటకు చేరుకుంటారు. ఇక్కడ త్రివేణి ఫంక్షన్‌హాల్‌లో ముఖ్యనేతలతో కలిసి భోజనం ముగించుకుని సాయంత్రం 3 గంటలకు హుజూర్‌నగర్‌కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. 4 గంటలకు హుజూర్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.  మరోవైపు సీఎం రాక సందర్భంగా హైదరాబాద్ -విజయవాడ  జాతీయ రహదారిపై కేసీఆర్‌ ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement