
సాక్షి, నల్గొండ: ఓటమి భయంతోనే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. హుజుర్‌నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్‌నగర్ అభివృద్ది కావాలంటే టీఆర్‌ఎస్ గెలవాలని అన్నారు. ఉత్తమ్ స్వార్థ ప్రయోజనాలకు ప్రజలు బలికావొద్దని హితవు పలికారు.
హుజుర్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి స్థానికుడని, ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్థానికేతరుడని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలంతా స్పష్టమైన ఆలోచనతో ఉన్నారని, కాంగ్రెస్‌ను బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ఉత్తమ్ ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు ఎంఎల్‌సీ భానుప్రసాద్, ఉప ఎన్నిక ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.