Bhanu Prasad
-
టీఆర్ఎస్ నుంచి ఇద్దరి పేర్లు ఖరారు.. సీఎం నిర్ణయమే ఫైనల్..
స్థానిక సంస్థల కోటాలో ఈసారి భానుప్రసాద్, ఎల్.రమణ పేర్లు దాదాపుగా ఖరారయ్యాని సమాచారం. వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలిసింది. వాస్తవానికి ఎల్.రమణను మొన్న జరిగిన ఎమ్మెల్యే కోటాలోనే ఎమ్మెల్సీగా పంపుతారని ప్రచారం సాగినా.. ఉమ్మడి జిల్లా నుంచి పాడి కౌశిక్‌రెడ్డి, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి నామినేషన్లు వేశారు. దీంతో మాజీ మంత్రి ఎల్.రమణ వర్గం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. తాజాగా మరోసారి ఎల్.రమణ పేరు అధిష్టానం.. పరిగణనలోకి తీసుకుందని సమాచారం. స్థానిక సంస్థల కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకటి బీసీ, మరొకటి ఓసీలకు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ సమీకరణాల్లో భాగంగానే భానుప్రసాద్ రావు మూడోసారి ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్నారు. బీసీ కోటాలో ఈసారి మాజీ మంత్రి ఎల్.రమణకు అవకాశం ఇచ్చారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. చదవండి: తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక ఉత్తర్వులు.. సాక్షి, కరీంనగర్: మొన్నటి దాకా హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక రణరంగం నడిచిన కరీంనగర్లో రెండువారాలు తిరక్కముందే స్థానిక సంస్థల ఎన్నికల భేరీ మోగింది. జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ ఉప ఎన్నికలో అభ్యర్థుల ఎంపిక, రెబెల్స్, తిరుగుబాటుదారులు, బుజ్జగింపు పర్వాలు ఏ పార్టీలో అణువంతైనా కనిపించలేదు. కానీ.. ప్రస్తుతం నడుస్తున్న స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియలో మాత్రం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీకి స్థానిక ప్రజాప్రతినిధుల ఓట్ల విషయంలో తిరుగులేని బలం ఉన్నప్పటికీ.. బరిలో నిలిచేవారి సంఖ్య పెరుగుతుండటం ఇందుకు కారణం. ఈసారి టీఆర్ఎస్ ఎంపీపీ (సైదాపూర్), రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సారాబుడ్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేశారు. చదవండి: నిప్పులాంటి నిజం! సిలిండర్‌పై ఎక్స్ట్రా వసూళ్లు, మొత్తం లెక్కిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే! రోజురోజుకూ దిగజారిపోతున్న ఎంపీటీసీలకు పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే తాను నామినేషన్ వేశానని చెబుతున్నారు. వాస్తవానికి ఇంతవరకూ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి అభ్యర్థుల ప్రకటనపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. కానీ.. ఈయన మాత్రం తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, వాటిపై స్పష్టమైన హామీ దొరికే వరకు నామినేషన్ వెనక్కి తీసుకోనని ఖరాఖండిగా చెబుతున్నారు. జిల్లా నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్ ఏనాడైనా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలను మండలివేదికగా ప్రస్తావించారా? అని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ఐదుగురి డిమాండ్లు కూడా కాస్త అటూఇటూగా ఇవే కావడం గమనార్హం. బరిలో మరికొందరు... ►ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ►ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. నామినేషన్ల స్వీకరణకు 23వ తేదీ ఆఖరు. ► ఇప్పటిదాకా మొత్తం ఆరుగురు అభ్యర్థులు తొమ్మిదిసెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ►వీరిలో ప్రభాకర్‌రెడ్డి ఒకరు మాత్రమే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ►ఇక మునిగాల విజయలక్ష్మి, మసార్తి రమేశ్, బొమ్మరవేని తిరుపతి, నలమాచు రామకృష్ణ, పురం రాజేశం ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు. ►మంగళవారం నామినేషన్ల స్వీకరణకు ఆఖరు రోజు కావడంతో చివరి రెండురోజుల్లో మరికొందరు నామినేషన్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ►ముఖ్యంగా జగిత్యాల, పెద్దపల్లి నుంచి కొందరు ఇండిపెండెంటుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ►ఇప్పటివరకూ దాదాపు 70 వరకు నామినేషన్ పత్రాలను కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం నుంచి తీసుకెళ్లడమే ఇందుకు నిదర్శనం. ఇందులో కొందరు నాలుగేసి సెట్లు, మరికొందరు ఒకటి, రెండు సెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం. నామినేషన్ దాఖలు చేసేవారిలో బలమైన అభ్యర్థులకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతిచ్చేందుకు సుముఖంగా ఉన్నాయని ఇండిపెండెంట్లు ధీమాతో ఉన్నారు. అయితే.. అన్ని పార్టీల్లో తిరుగుబాట్లు, అలకలు సహజమేనని, ఎవరికైనా పార్టీ ఆదేశాలు శిరోధార్యమని సీనియర్ టీఆర్ఎస్ నేతలు ‘సాక్షి’కి తెలిపారు. సీఎం నిర్ణయమే ఫైనల్.. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని శనివారం కరీంనగర్లో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించారు. కరీంనగర్ నగర పాలక, కొత్తపల్లి పురపాలక సంఘాలకు చెందిన డిప్యూటీ మేయర్, చైర్మన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు, మంత్రి గంగుల పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించే అభ్యర్థికి మద్దతు తెలపాల్సిందిగా సూచించారు. సమావేశంలో పాల్గొన్న పాలకవర్గాల సభ్యులు ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల నియోజకవర్గాలకు మంత్రి గంగుల ఎన్నికల ఇన్చార్జిగా, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు మంత్రి కొప్పుల ఈశ్వరు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. సమావేశంలో కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ వల్లే దేశంలోకి కరోనా
సాక్షి, హైదరాబాద్: కరోనా విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఆశ్చర్యానికి గురిచేశాయని మండలిలో ప్రభుత్వ విప్ టి.భానుప్రసాద్ వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీ య అధ్యక్షుడు నడ్డాకు కరోనా లెక్కలు తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరణాల యావరేజ్ రేటు జాతీయ స్థాయిలో 3.26 శాతం ఉంటే, తెలంగాణలో 2.26 శాతం ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు. ఆదివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎంపీ వెంకటేశ్ నేతతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినా అంతర్జాతీయ రవాణా ఆపకుండా కరోనా దేశంలోకి ప్రవేశించడానికి కారణం బీజేపీయేనని ఆరోపించారు. కరోనా టెస్టుల కోసం రోజుకో దేశం నుంచి కిట్లు తెప్పించి గందరగోళానికి కేంద్రం గురి చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం ఆధీనంలో ఉన్న ఐసీఎంఆర్ ఒకమాట చెప్తే–ఆయుష్ రాష్ట్రాలకు మరో మాట చెబుతోందన్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ చెప్పే వరకు మర్కజ్ వ్యవహారం బయటపడలేదని చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో బీజేపీ నేతలు చెబితే, తరువాత తాము రాష్ట్రానికి ఏమి చేశామో చెబుతామన్నారు. కిషన్, బండిల మాటల్లో పరిపక్వత లేదు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు పరిపక్వత లేనివిగా ఉన్నాయని ఎంపీ వెంకటేశ్ నేత విమర్శించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీకి అండగా ఉన్నామని సీఎం కేసీఆర్ చెప్పారని, బీజేపీ నేతలు మాత్రం రాజకీయాలు మాట్లాడుతున్నారని వారి మైండ్ ఏమైనా పాడైందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. దేశ సరిహద్దుల్లో చైనా, దేశంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఒక్కటేనని ధ్వజమెత్తారు. దేశమంతా కరోనాతో ఇబ్బంది పడుతుంటే బీజేపీ నేతలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని, తెలంగాణలో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేకే వారు కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. -
‘ఉత్తమ్ స్థానికేతరుడు.. చిత్తుగా ఓడించండి’
సాక్షి, నల్గొండ: ఓటమి భయంతోనే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. హుజుర్నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్నగర్ అభివృద్ది కావాలంటే టీఆర్ఎస్ గెలవాలని అన్నారు. ఉత్తమ్ స్వార్థ ప్రయోజనాలకు ప్రజలు బలికావొద్దని హితవు పలికారు. హుజుర్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి స్థానికుడని, ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్థానికేతరుడని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలంతా స్పష్టమైన ఆలోచనతో ఉన్నారని, కాంగ్రెస్‌ను బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ఉత్తమ్ ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు ఎంఎల్సీ భానుప్రసాద్, ఉప ఎన్నిక ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నేతలవి మొసలికన్నీళ్లు
సాక్షి, హైదరాబాద్: పదేళ్లు అధికారంలో ఉండగా ఏనాడూ రైతుల గురించి పట్ట ని కాంగ్రెస్ నేతలు ఇపుడు వారి గురించి మొసలికన్నీళ్లు కారుస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు స్వామినాథన్ కమిటీ సిఫారసులను చెత్తబుట్టలో వేసి, ఇప్పుడు వాటి గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. అధికారంలో ఉండగా రైతుల బతుకులను ఛిన్నాభిన్నం చేసింది కాంగ్రెస్ నేతలేనని దుయ్యబట్టారు. ఆర్మూర్ డిక్లరేషన్ పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చినా వాటిని పెండింగులో పెట్టారన్నారు. -
కాంగ్రెస్‌వి మొసలి కన్నీళ్లు : టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: పదేళ్లు అధికారంలో ఉండగా ఏ నాడూ రైతుల సంక్షేమం గురించి పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇపుడు వారి గురించి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు స్వామినాథన్ కమిటీ సిఫారసులను చెత్తబుట్టలో వేసి వాటి గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉండగా రైతుల బతుకులను చిన్నాభిన్నం చేసింది కాంగ్రెస్ నేతలేనని దుయ్యబట్టారు. ఆర్మూర్ డిక్లరేషన్ పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చినా వాటిని పెండింగులో పెట్టారని ఆరోపించారు. మధుయాష్కీ తాను ఎంపీగా ఉన్నప్పుడు తమ ప్రభుత్వాన్ని ఒప్పించి పసుపు బోర్డును ఎందుకు సాధించలేకపోయారని నిలదీశారు. నిజామాబాద్ ఎంపీ కవిత కృషి వల్లే పసుపు బోర్డు ఏర్పాటుపై కదలిక వచ్చిందని కాంగ్రెస్ నేతలు గ్రహించాలని హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఆర్మూరు డిక్లరేషన్ రైతుల సంక్షేమం కోసం చేసింది కాదని, కాంగ్రెస్ నేతలు తమ పదవుల యావతో చేసుకున్న డిక్లరేషన్ అని వ్యాఖ్యానించారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ను ప్రశంసిస్తూ సీఎం కేసీఆర్‌కు స్వామినాథన్ లేఖ రాశారని, కాంగ్రెస్ నేతలకు స్వామినాథన్ వంటి మేధావుల ప్రశంసలు కనబడడం లేదా అని ప్రశ్నించారు. రైతులకు మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. -
‘జర్నలిస్టుల’పై అల్లం నారాయణతో చర్చిస్తాం
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు జీతాలు ఇవ్వని మీడియా సంస్థలకు ప్రభుత్వ పరంగా ప్రకటనలను నిలిపివేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ అన్నారు. ఈ మేరకు మండలిలో ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది రూ.వందల కోట్ల ప్రకటనలు మీడియా సంస్థలకు ఇస్తున్నప్పటికీ చాలా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు సిబ్బందికి సరిగ్గా జీతాలు ఇవ్వటం లేదని తెలిపారు. ప్రభుత్వం ప్రకటనల డబ్బులు మీడియా సంస్థలకు కాకుండా నేరుగా జర్నలిస్టులకు జీతం కింద ఇవ్వాలని వివరించారు. మరో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు వేతనం విషయంలో భద్రత ఉండాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని అన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సమాధానం ఇస్తూ.. జర్నలిస్టుల కోసం ఇప్పటివరకు రూ.30 కోట్లు ఇచ్చామని, వచ్చే బడ్జెట్లో మరో రూ.30 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో చర్చిస్తామని తుమ్మల అన్నారు. -
వార్డు మెంబర్ కూడా కాంగ్రెస్‌లో చేరడు
-
వార్డు మెంబర్ కూడా కాంగ్రెస్‌లో చేరడు
ఎమ్మెల్సీ భానుప్రసాద్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు ఉంటాయని ఆ పార్టీ నాయకులు చేస్తున్న వాదన హాస్యాస్పదంగా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ అన్నారు. మంత్రులు కాదు కదా, గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ కూడా కాంగ్రెస్‌లో చేరరని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావని, ఆ పార్టీలో ఎవరు చేరుతారన్నారు. టీఆర్ఎస్లో తమ కోవర్టులు ఉన్నారంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క చెప్పడం ఆయనలో కోవర్టు లక్షణాన్ని బయట పెట్టిందని విమర్శించారు. అభివృద్ధి నిరోధక చర్యలు, కోర్టులకు వెళ్లడమే తప్ప కాంగ్రెస్ నేతలకు ఒక్క మంచి పని చేతకాదని ఎద్దేవా చేశారు. రైతు సమన్వయ సమితిల ఏర్పాటు దేశ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని, భూ సర్వేతో ఏళ్ల నాటి పంచాయితీలకు తెరపడుతుందని పేర్కొన్నారు. అవగాహన లేకనే కాంగ్రెస్ నేతలు భూ సర్వేపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. -
సంగీత దర్శకుడు శశిప్రీతమ్పై దాడి
హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు శశిప్రీతమ్పై దాడి జరిగింది. శశిప్రీతమ్ ఎదురింట్లో ఉండే భానుప్రసాద్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. దాడిలో శశిప్రీతమ్ ముఖానికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు ఐపీసీ 341,323,505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం శశిప్రీతమ్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా 2013లో రూరల్ డెవలప్మెంట్ డాక్యుమెంటరీ కాంట్రాక్ట్ విషయంలో భానుప్రసాద్, శశిప్రీతమ్ మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. ఆ కాంట్రాక్టు శశిప్రీతమ్‌కు దక్కడంతో అప్పటి నుంచి వారిద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భానుప్రసాద్ ...శశిప్రీతమ్పై దాడి చేసినట్లు తెలుస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం అయిన శశిప్రీతమ్...పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. -
'భవానీగా ఉంటే.. అదోలా ఉండేది'
- పాఠశాలకు వచ్చిన భానుతో స్నేహితుల ముచ్చట్లు - పూర్వ విద్యార్థికి ఆసరా అందించిన ఉపాధ్యాయులు చిన్నశంకరంపేట: 'అమ్మాయిలా పెరిగినప్పటికీ వారితో స్నేహంగా ఉండాలంటే ఇబ్బం దిగా ఉండేది.. అదే అబ్బాయిలతో చనువుగా ఉండేందుకు ఇష్టపడేవాడిని'అని చిన్నశంకరంపేటకు చెందిన భవాని అలియాస్ భానుప్రసాద్ తెలిపాడు. ఇన్నాళ్లు అమ్మాయిగా పె రిగి.. ఇప్పుడు అబ్బాయిగా మారిన సందర్భంగా భానుప్రసాద్ బుధవారం చిన్నశంకరంపేటలో 'సాక్షి'తో తన అంతరంగాన్ని పం చుకున్నాడు. ఆమె అతడుగా మారిన వైనం వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మదిర గ్రామం భాగిర్తిపల్లికి చెందిన నాగులు, భాగ్యమ్మ దంపతులకు 17 ఏళ్ల క్రి తం బిడ్డపుట్టగా.. శరీరతీరును చూసి పాప గా నిర్ధారించుకున్నారు. భవాని అని పేరు పెట్టి బడికి పంపించారు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఆడపిల్ల లక్షణాలు కరువయ్యాయి. అయితే, నెల రోజుల క్రితం కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. భవానీ అమ్మాయి కాదు అబ్బాయి అని డాక్టర్లు తేల్చారు. జన్యుపరమైన లోపాల కారణంగా అంగం కడుపులోనే ఉండిపోవడంతో ఇన్నాళ్లు అందరూ అమ్మాయిగా భావించారని, శస్త్రచికిత్స చేసి అబ్బాయిగా మార్చాలని చెప్పడంతో భవానీతో పాటు.. బంధువులం తా నిర్ఘాంతపోయారు. దీంతో హైదరాబాద్‌లోని వాసవీ ఆస్పత్రిలో నెల రోజుల క్రితం శస్త్ర చికిత్స చేశారు. తర్వాత భవాని కాస్త భానుప్రసాద్‌గా మారాడు. బుధవారం భానుప్రసాద్ మాట్లాడుతూ ‘అమ్మాయిగా పెరిగినప్పటికీ నా ఇష్టాలన్నీ అబ్బాయిలాగే ఉండేవి. జడ వేసుకున్నా పూలు పెట్టుకునేందుకు ఇష్టపడేవాడిని కాదు. బొట్టు కూడా అంతంత మాత్రమే పెట్టుకునేవాడిని. పదోతరగతికి వచ్చేసరికి అమ్మాయిల కన్నా అబ్బాయిలతోనే స్నేహం చేయాలనిపించేది. తరగతి గదిలో అమ్మాయిల పక్కన కూర్చున్నప్పటికీ వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించేవాడిని. వారితో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు నాలో అలజడి రేగేది’ అని వివరించాడు. అ బ్బాయిలతో స్నేహం చేయడాన్ని ఉపాధ్యాయురాళ్లు తప్పుపడుతూ చీవాట్లు పెట్టేవారన్నాడు. మరిన్ని శస్త్ర చికిత్సలు అవసరమని డాక్టర్లు చెప్పారని, అవసరమైన వైద్య చేయించుకునేందుకు దాతల సాయం కోసం చూస్తున్నానని, దాతలు సహాయం చేయాల ని ఈ సందర్భంగా భవానీప్రసాద్ కోరుతున్నాడు. చీవాట్లు పెట్టేదాన్ని.. అబ్బాయిలతో స్నేహం అంత మంచిదికాదని భవానీని చీవాట్లు పెట్టేదాన్ని. పదోతరగతిలోకి వచ్చేసరికి భవాని అబ్బాయిల డ్రెస్‌లు వేసుకోవడం, వారితో కలసి డ్యాన్స్ చేయడాన్ని నేను తట్టుకోలేకపోయా. చీవాట్లు పెడితే నన్ను కోపంగా చూసేది. ఇప్పుడు చూస్తే అప్పుడు భవాని (భానుప్రసాద్) చేసింది కరెక్టేనని అనిపిస్తుంది. - ఏసుమణి, ఉపాధ్యాయురాలు, జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుల ఆర్థికసాయం భానుప్రసాద్ తాను చదువుకున్న చిన్నశంకరంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు బుధవారం వెళ్లాడు. అక్కడి ఉపాధ్యాయులతో తన అనుభవాన్ని పంచుకున్నాడు. అతని ప రిస్థితిని చూసి చలించిపోయిన ప్రధానోపాధ్యాయురాలు స్వరూపరాణి రూ.3,000, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రూ.1,100 ఆర్థిక సహాయం అందించారు. -
టీఆర్ఎస్లో చేరిన భానుప్రసాదరావు
పెద్దపల్లి : కాంగ్రెస్ ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు బుధవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి పై పోటీచేసి ఓటమి చెందిన భానుప్రసాద్‌రావు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి గులాబీ గూటికి వెళ్లారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సైతం హాజరయ్యారు. భానుప్రసాదరావు అనుచరులుగా ఉన్న ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులను సైతం టీఆర్ఎస్లోకి తీసుకువె ళ్లేందు కు సన్నద్ధం అవుతున్నారు భానుప్రసాద్ వెంట సుల్తానాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పెద్దపల్లి టీఆర్ఎస్లో నేతల సందడి పెద్దపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్లో నేతలకు కొదవలేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రేవతీరా వు, ఇద్దరు, ముగ్గురు రాష్ట్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. పార్టీ నుంచి వెళ్లిన పొలిట్‌బ్యూరో సభ్యుడు సి.సత్యనారాయణరెడ్డి మళ్లీ గులాబీగూటికి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు అక్కడ పెద్దగా గుర్తింపు లభించకపోవడంతో తిరిగి సొంతపార్టీలో చేరితేనే మేలని భావిస్తున్నారు. ఆయన అనుచరుల్లో కొందరు తనతోపాటే కాంగ్రెస్‌లోకి వెళ్లగా... మరికొందరు ఇప్పటికీ టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. ‘గీట్ల’ తనయుడి సమాలోచనలు మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి తనయుడు రాజేందర్‌రెడ్డి గులాబీ పార్టీలో చేరేందుకు తన అనుచరులతో చర్చలు సాగిస్తున్నారు. రెం డు వారాలుగా ఆయన టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోం ది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ము కుందరెడ్డి అనుచరవర్గం మనోహర్‌రెడ్డి శిబిరానికి వెళ్లింది. భానుప్రసాదరావు ముందే చేరడంతో సీఎస్సార్, గీట్ల రాజేందర్‌రెడ్డి తమ ప్రయత్నాలు రద్దు చేసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా వినిపిస్తోంది. -
ఐటీ అభివృద్ధి పేరిట మోసం: భాను ప్రసాద్
చంద్రబాబుపై రిజ్వీ, భాను ప్రసాద్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఐటీ పేరిట తెలంగాణ రైతుల, వక్ఫ్ భూములను కొల్లగొట్టారంటూ పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి ఎంఐఎం సభ్యుడు రిజ్వీ, కాంగ్రెస్ సభ్యుడు భాను ప్రసాద్ విమర్శించారు. శాసనమండలిలో టీ-బిల్లుపై చర్చ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడారు. ఐటీ డెవలప్మెంట్ పేరిట మోసం జరిగిందని వారు నొక్కి చెప్పారు. హైటెక్ సిటీకి అతి సమీపంలోని 200 ఎకరాల అత్యంత విలువైన భూములను సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఎందుకు మినహాయించారో? ఆ భూములు ఎవరి పేరిట ఉన్నాయో చూస్తే దురుద్దేశం ఏమిటో అర్థమవుతుందని టీడీపీ అధినేతను ఉద్దేశించి భానుప్రసాద్ అన్నారు. దీంతో తెలంగాణ, సీమాంధ్ర టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఎవరినీ విమర్శించడం లేదని, తెలంగాణ ప్రాంత రైతుల భూములను కారుచౌకగా తీసుకోవడం వల్ల తమ ప్రాంత రైతులు నష్టపోయారని గుర్తు చేశానన్నారు. టీడీపీ సభ్యుల తీరు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ఐటీ అభివృద్ధి పేరిట హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాల వక్ఫ్ భూములు తీసుకున్నారు. కానీ ఆ భూములతో పలు సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు’’ అని రిజ్వీ విమర్శించారు. ‘‘భౌగోళికంగా తెలంగాణ మధ్యలో ఉన్న హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఎలా కొనసాగిస్తారు? విడిపోవడంవల్ల ఏర్పడే తెలంగాణ, కోస్తాంధ్ర రెండు ప్రాంతాలకు ఉమ్మడి రాజధాని, ఉమ్మడి గవర్నర్ అయినప్పుడు ఇక రాష్ట్రాన్ని విభజించడం ఎందుకు? రాష్ట్రాన్ని యథాతథంగా ఉమ్మడిగా ఉంచవచ్చు కదా!’’ అని అభిప్రాయపడ్డారు. రెండు మూడేళ్లు మాత్రమే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కాంగ్రెస్ సభ్యుడు భూపాల్ రెడ్డి కోరారు. కన్నీళ్లు పెట్టుకున్న రాజకుమారి రాష్ట్ర విభజన బిల్లుపై మాట్లాడటం బాధ కలిగిస్తోందంటూ టీడీపీ సభ్యురాలు నన్నపనేని రాజకుమారి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె రాసిన ‘నన్నపనేని నవరత్నాలు’లోని కవితలు చదివి వినిపించారు. తెలంగాణ కవులు సి.నారాయణరెడ్డి, కాళోజీలకు తన పుస్తకాలు అంకితం ఇచ్చానని చెప్పారు.