చంద్రబాబుపై రిజ్వీ, భాను ప్రసాద్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఐటీ పేరిట తెలంగాణ రైతుల, వక్ఫ్ భూములను కొల్లగొట్టారంటూ పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి ఎంఐఎం సభ్యుడు రిజ్వీ, కాంగ్రెస్ సభ్యుడు భాను ప్రసాద్ విమర్శించారు. శాసనమండలిలో టీ-బిల్లుపై చర్చ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడారు. ఐటీ డెవలప్‌మెంట్ పేరిట మోసం జరిగిందని వారు నొక్కి చెప్పారు. హైటెక్ సిటీకి అతి సమీపంలోని 200 ఎకరాల అత్యంత విలువైన భూములను సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి ఎందుకు మినహాయించారో? ఆ భూములు ఎవరి పేరిట ఉన్నాయో చూస్తే దురుద్దేశం ఏమిటో అర్థమవుతుందని టీడీపీ అధినేతను ఉద్దేశించి భానుప్రసాద్ అన్నారు.
దీంతో తెలంగాణ, సీమాంధ్ర టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఎవరినీ విమర్శించడం లేదని, తెలంగాణ ప్రాంత రైతుల భూములను కారుచౌకగా తీసుకోవడం వల్ల తమ ప్రాంత రైతులు నష్టపోయారని గుర్తు చేశానన్నారు. టీడీపీ సభ్యుల తీరు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ఐటీ అభివృద్ధి పేరిట హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాల వక్ఫ్ భూములు తీసుకున్నారు. కానీ ఆ భూములతో పలు సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు’’ అని రిజ్వీ విమర్శించారు. ‘‘భౌగోళికంగా తెలంగాణ మధ్యలో ఉన్న హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఎలా కొనసాగిస్తారు? విడిపోవడంవల్ల ఏర్పడే తెలంగాణ, కోస్తాంధ్ర రెండు ప్రాంతాలకు ఉమ్మడి రాజధాని, ఉమ్మడి గవర్నర్ అయినప్పుడు ఇక రాష్ట్రాన్ని విభజించడం ఎందుకు? రాష్ట్రాన్ని యథాతథంగా ఉమ్మడిగా ఉంచవచ్చు కదా!’’ అని అభిప్రాయపడ్డారు. రెండు మూడేళ్లు మాత్రమే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కాంగ్రెస్ సభ్యుడు భూపాల్ రెడ్డి కోరారు.
కన్నీళ్లు పెట్టుకున్న రాజకుమారి
రాష్ట్ర విభజన బిల్లుపై మాట్లాడటం బాధ కలిగిస్తోందంటూ టీడీపీ సభ్యురాలు నన్నపనేని రాజకుమారి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె రాసిన ‘నన్నపనేని నవరత్నాలు’లోని కవితలు చదివి వినిపించారు. తెలంగాణ కవులు సి.నారాయణరెడ్డి, కాళోజీలకు తన పుస్తకాలు అంకితం ఇచ్చానని చెప్పారు.
ఐటీ అభివృద్ధి పేరిట మోసం: భాను ప్రసాద్
Published Wed, Jan 22 2014 3:57 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement
Advertisement