Wakf lands
-
వక్ఫ్ భూముల్లో గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వక్ఫ్ భూములను అవసరమైన చోట మైనారిటీ గురుకులాల భవన సముదాయాల నిర్మాణాలకు లీజుకు ఇవ్వాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు పాలకమండలి నిర్ణయించింది. ఈ మేరకు వక్ఫ్ అభివృద్ధి కమిటీకి సిఫార్సు చేసింది. మంగళవారం హైదరాబాద్ హజ్‌హౌస్‌లోని రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో జరిగిన వక్ఫ్ బోర్డు పాలకమండలి సమావేశంలో సుమారు 37 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం చైర్మన్ మహ్మద్ సలీం బోర్డు నిర్ణయాలను విలేకరులకు వెల్లడించారు. వక్ఫ్ బోర్డు ఆదాయ మార్గాల పెంపు కోసం ఆరు ఆస్తుల అభివృద్ధిపై ప్రధాన దృష్టి సారించి చర్చించినట్లు తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, అభివృద్ధి కోసం పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. వక్ఫ్ ఆస్తుల కేసులపై హైకోర్టులో వాదించేందుకు సీనియర్ న్యాయవాదులను నియమిం చాలని నిర్ణయించినట్లు చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆదాయం ఆబ్జెక్టివ్ ఆఫ్ వక్ఫ్ ప్రకారం వినియోగించాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. మసీదుల రోజువారీ వ్యవహారాల నిర్వహణ కోసం 15 పాలకమండళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కొన్ని మసీదుల పాలకమండలి కాలపరిమితి కూడా పొడిగిస్తూ తీర్మానం చేశామన్నారు. బోర్డుకు ఇద్దరు రిటైర్డ్ తహసీల్దార్లను నియమించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ పాలకమండలి సమావేశంలో సభ్యులైన సయ్యద్ షా అక్బర్ నిజామోద్దీన్ హుస్సేని, మీర్జా అన్వర్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
కబ్జాలపై కొరడా
వక్ఫ్ భూముల స్వాధీనానికి రంగం సిద్ధం.. అన్యాక్రాంతమైన భూములపై సర్కార్ నజర్ కబ్జాదారులకు నోటీసుల జారీ.. చర్యలు ముమ్మరం చేసిన రెవెన్యూ అధికారులు తొలుత 500 ఎకరాల స్వాధీనానికి యత్నాలు నిజామాబాద్( బాన్సువాడ) : కోట్లాది రూపాయల విలువ చేసే వక్ఫ్ భూముల పరిరక్షణపై రెవెన్యూ అధికారులు నడుం బిగించారు. అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు ప్రారంభించారు. ఆర్డీఓలు.. కబ్జాదారులకు నోటీసులు ఇవ్వడమేకాకుండా, వాటిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకునే విధంగా ముందుకు సాగుతున్నారు. జిల్లాలో సుమారు 5వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నట్లు అంచనా. వీటిలో 3వేల ఎకరాలు కబ్జాదారుల కబంధ హస్తాల్లో ఉన్నాయి. దర్గాలు,మసీదు ముతవల్లీలకు కేటాయించిన ఈ భూములను విక్రయించుకుంటూ వక్ఫ్‌బోర్డుకు ఎసరుపెట్టారు. వక్ఫ్ భూములను పరిరక్షించడంలో వక్ఫ్‌బోర్డు విఫలమవుతుండడంతో ఇనాం భూములను కలిగి ఉన్న వ్యక్తులు యథేచ్ఛగా వాటిని విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో నూతన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై చర్యలు మొదలుపెట్టింది. అసెంబ్లీ హౌస్ కమిటీ చైర్మన్‌గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ను నియమించింది. వక్ఫ్ ఆస్తుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం కాగా, జిల్లాలోని బాల్కొండ, రేంజల్, నవీపేట, ఎల్లారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్ మండలాల్లో సుమారు 30 మంది కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు నెల రోజులుగా నోటీసులు జారీ చేశారు. ఆ భూములు స్వాధీనం చేసుకుని ఇనాం, సేవ కింద పొందిన భూములను ముతవల్లీలకే కౌలు రూపంలో కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో ఎకరంపై ఏడాదికి రూ 3వేల చొప్పున వసూలు చేయూలని నిర్ణయించారు. ఏపీ గెజిట్‌లో పేర్కొన్న సర్వే నంబర్ల ఆధారంగా అందరికీ నోటీసులు పంపిస్తున్నారు. పలు పట్టణాల్లో వక్ఫ్ ఆస్తులను విక్రయించగా, వాటి పై షాపింగ్ కాంప్లెక్స్‌లు, పాఠశాలలు, ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. వాటిని సైతం స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇష్టారాజ్యంగావిక్రయాలు బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో సుమారు 30 ఎకరాల వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు ఇటీవల బోధన్ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో సుమారు 20 ఎకరాల భూమిని ముతవల్లీలు ఇప్పటికే రైతులకు విక్రయించారు. ప్రస్తుతం నోటీసులు రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా బీర్కూర్ మండలం దుర్కి గ్రామంలో వందలాది ఎకరాల వక్ఫ్‌భూములు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఖాజీలకు ఈ భూములను ఇనాం రూపంలో ప్రభుత్వం అందజేసింది. ఈ భూముల్లో పంటలను సాగు చేసి, వాటి ద్వారా వచ్చే నిధులతో దర్గాల ఖర్చులు, ఖితాబత్ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటిని విక్రయించడానికి వీలు లేదు. అయితే ఇక్కడ ఉన్న వందలాది ఎకరాల భూమిని కొందరు అక్రమార్కులు విక్రయించగా, పలువురు రాజకీయ నాయకులు వీటిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలో పక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేయడంతోపాటు పట్టాలు, పహాణీలు సైతం సృష్టించారు. ఇనాం భూములను విక్రయిస్తున్నారని, వాటికి సంబంధించిన పర్యవేక్షించడంలో వక్ఫ్‌బోర్డు అధికారులు విఫలమవుతున్నారని 2007లోనే గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన అప్పటి కలెక్టర్ దుర్కి గ్రామ శివారులో ఉన్న 61 ఎకరాల ఇనాం భూమిపై విచారణ జరపాలని ఆదేశించారు. ఈ మేరకు సర్వే నంబర్లు 534, 536, 537, 540, 544, 444, 94/1-2, 107/1 నుంచి 15 వరకు, 113/1-2లో ఇనాం భూములున్నాయని వక్ఫ్‌బోర్డు సర్వేలో తేలింది. ఇందులో అప్పటికే సుమారు 40 ఎకరాల భూమిని విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాన్సువాడ పట్టణంలోనూ ప్రధాన రహదారి పక్కనే వక్ఫభూములు ఉండగా, వాటిపైనా నిర్మాణాలు జరిగాయి. అంతేకాకుండా పలువురు అక్రమార్కులు యథేచ్ఛగా ఆ భూముల్లో సాగు చేస్తూ, విక్రయిస్తున్నారు. వక్ఫ్‌బోర్డుకు కనీస రుసుం చెల్లించడం లేదని సమాచారం. -
భూ ఆక్రమణలపై సభా సంఘాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల కబ్జాలతో పాటు సహకార సొసైటీల్లో అక్రమాలు, వక్ఫ్ భూముల అన్యాక్రాంతం తదితర అంశాలపై తెలంగాణ ప్రభుత్వం 3 శాసనసభా సంఘాలను వేసింది. గత బడ్జెట్ సమావేశాల్లో పేర్కొన్న మేరకు 3 నెలల కాలపరిమితితో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిపి ఒక్కో కమిటీని 13 మందితో ఏర్పాటు చేసింది. దేవాదాయ, భూదాన్, సీలింగ్ మిగులు, ఇనాం భూముల వివరాలను సేకరించడంతో పాటు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు, బలహీన వర్గాలకు కేటాయించిన భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వ భూముల కబ్జా, అక్రమ అమ్మకాలపై వేసిన కమిటీ సమాచారం సేకరిస్తుంది. మేడ్చ ల్ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డిని చైర్మన్‌గా నియమించారు. ఇక ప్రభుత్వ భూములు పొందిన జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, వెంకటేశ్వర కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, నందగిరి హిల్స్ హౌసింగ్ సొసైటీలకు ఇచ్చిన భూముల వివరాలు, ఏవైనా అక్రమాలు జరిగాయా అన్న అంశాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ చైర్మన్‌గా ఏర్పాటు చేసిన ‘హౌసింగ్ సొసైటీల’పై వేసిన కమిటీ పరిశీలిస్తుంది. వక్ఫ్ భూ ములు, వాటిల్లో అన్యాక్రాంతమైన, కబ్జాలో ఉన్నవాటి వివరాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చైర్మన్‌గా ఏర్పాటు చేసిన వక్ఫ్ భూముల కమిటీ పరిశీలిస్తుంది. కాగా ఈ కమిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐలకు ప్రాతినిధ్యం లభించ లేదు. -
'రెండు 'బంజారా'భవనాలు నిర్మిస్తాం'
హైదరాబాద్:బంజారాల కోసం బంజారాహిల్స్ లో రెండు బంజారా భవనాలను నిర్మిస్తానమి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్.. బంజారాలకు అండగా ఉంటామన్నారు. వారి కోసం రెండు బంజారా భవనాలనకు నిర్మిస్తామన్నారు. వక్ఫ్ భూములపై సభా సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వక్ఫ్ భూముల పరిరక్షణ చేపడతామన్నారు. వక్ఫ్ ట్రైబ్యునల్ కు న్యాయమూర్తిని నియమిస్తామన్నారు. -
వక్ఫ్ భూములు హాంఫట్
నిజామాబాద్ అర్బన్/సుభాష్‌నగర్: జిల్లాలోని వక్ఫ్ బోర్డు భూములు మాయమవుతున్నాయి. ఏళ్ల తరబడి కబ్జాలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకూ అక్రమ నిర్మాణాలు వెలుస్తుండడంతో వక్ఫ్ బోర్డు భూములు కనిపించకుండా పోతున్నాయి. అధికారుల పరిశీలన లేకపోవడం, ఉన్నవాటిపై విచారణ లేకపోవడంతో ఈ భూముల మనుగడ ప్రశ్నార్థకంగా మా రింది. కబ్జాదారులు దర్జాగా పట్టాలు పొంది, ప్రశ్నించేవారిని మచ్చిక చేసుకుని వాటిని ఆక్రమించుకుంటున్నారు. సుమారు 60 శాతం భూములు ఆమ్రణదారుల చేతిలో ఉన్నాయి. నిజామాబాద్ డివిజన్లో 1,629.27ఎకరాలు, బోధన్ డివిజనలో 3,209 ఎకరాలు, కామారెడ్డి డివిజన్లో 482 ఎకరాలు, మొత్తం 5,319 ఎకరాల వక్ఫ్‌బోర్డుకు చెందిన భూములున్నాయి. ఇందులో సుమారు 3,216 ఎకరాలు కబ్జాకు గురయయ్యాయి. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్రాంతం, ఖలీల్‌వాడి, కోటగల్లీ, కంఠేశ్వర్, గూపన్ పల్లి శివారులో, మరికొన్ని చోట్ల 50 ఎకరాల వరకు భూములు ఆక్రమణలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. కబ్జాదారులు వక్ఫ్ బోర్డు అనుమతి పేరిట ఈ భూములలో కొనసాగుతున్నారు. కొన్ని చోట్ల ఒక్కసారి తీసుకున్న అనుమతితో ఏళ్ల తరబడి నిబంధనలకు విరుద్ధంగా అనుభవిస్తున్నారు. రెంజల్ మండలం నీల, కందకుర్తి, బోధన్ డివిజన్లోని పలు ప్రాంతాలలో వక్ఫ్‌బోర్డు భూములు కబ్జాకు గురయ్యాయి. కౌలాస్, దుర్కి ప్రాంతాలలో సుమారు 1,600 ఎకరాల భూమి కబ్జాలో ఉంది. కామారెడ్డి, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ ప్రాంతాలలో సుమారు నాలుగు వందల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. డిచ్పల్లి, భీంగల్, బాల్కొండ, నవీపేట ప్రాంతాలలో దాదాపు 630 ఎకరాలు కబ్జాలో ఉన్నాయి. మొత్తం వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి 5,319 ఎకరాలలో సర్వే నిర్వహిస్తే మరిన్ని అమ్రాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. 80 శాతం భూములు కబ్జా లో ఉన్నట్లు తేలే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా అధికారులు ఈ కబ్జా భూములపై సర్వే చేపట్టలేదు. కొన్ని చోట్ల ఆ భూములకు కేర్‌టే కర్గా ఉన్న ముతవల్లీలు నిబంధనలకు విరుద్ధంగా లీజులకు ఇస్తున్నారు. కొందరు ఇతరులకు విక్రయించారు. వీటిపై కూడా ఎలాంటి పరిశీలన లేదు. దీంతో భూములు మాయమవుతున్నాయి. సర్వే చేపట్టాలని మైనార్టీ నాయకులు కోరుతున్నా ఫలితం లేకుండా పోతోంది. -
వక్ఫ్ భూముల కోసం రాస్తారోకో
బేల : వక్ఫ్ భూముల కోసం మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలోని అంతరాష్ట్రరోడ్డుపై గురువారం స్థానిక జామా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వక్ఫ్ భూములను తమకు అప్పగించడంలో వక్ఫ్ బోర్డు జిల్లా ఇన్స్పెక్టర్, త హశీల్దార్లు పట్టింపులేనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల కో ఆప్షన్ సభ్యుడు తన్వీర్‌ఖాన్, కమిటీ సభ్యులు మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా స్థానిక జామా మసీదు నిర్వహణను పట్టించుకోని నవాబొద్దీన్ వక్ఫ్ భూములను తన స్వాధీనంలో ఉంచుకున్నాడని ఆరోపించారు. విలువైన ఈ భూములను కమిటీకి అప్పగిస్తానని గతంలో రాత పూర్వకంగా రాసిచ్చి ఆ తర్వాత నిరాకరిస్తున్నాడని పేర్కొన్నారు. కోర్టు ఈ భూములను కమిటీకి అప్పగించాలనీ తీర్పు ఇచ్చినా ఆయన స్పందించడం లేదని పేర్కొన్నారు. వెంటనే ఈ భూములను జామా మసీదు మసాబ్ కమిటీకి అప్పగించాలని, లేని పక్షంలో నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ధర్నా వద్దకు చేరుకున్న త హశీల్దార్, ఆందోళనకారులను సముదాయించారు. సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆందోళ నలో కమిటీ సభ్యులు అబ్ధుల్ సలీం, హపీజ్, మసూద్ హైమద్, బబన్, ముస్తాక్, షకీల్‌ఖాన్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్‌భూముల పరిరక్షణకు ట్రిబ్యునల్: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆక్రమణకు గురైన వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం జ్యుడీషియల్ అధికారాలతో ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సంక్షేమ శాఖలను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు ప్రతిపాదనను సైతం ప్రభుత్వం పరిశీలిస్తోందని అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బదులిచ్చారు. కరీంనగర్‌లోని దిగువ మానేరు వంతెన సమీపంలో మైసూరు బృందావనం తరహాలో గార్డెన్‌ను అభివృద్ధి పరచాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాధానమిచ్చారు. ప్రాజెక్టు తొలి దశ పనుల కోసం రూ.5 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రానికి నివేదిక పంపించామని వెల్లడించారు. మూసీనది నుంచి పిలాయిపల్లి కాల్వ ద్వారా నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఎనిమిది గ్రామాలకు సాగునీటి సరఫరా చేసే ప్రాజెక్టు పనులను 2015 జూన్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రైతు బంధు పథకం కింద గత 8 ఏళ్లలో తెలంగాణలోని 10,416 మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని ఆయన వెల్లడించారు. -
ఐటీ అభివృద్ధి పేరిట మోసం: భాను ప్రసాద్
చంద్రబాబుపై రిజ్వీ, భాను ప్రసాద్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఐటీ పేరిట తెలంగాణ రైతుల, వక్ఫ్ భూములను కొల్లగొట్టారంటూ పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి ఎంఐఎం సభ్యుడు రిజ్వీ, కాంగ్రెస్ సభ్యుడు భాను ప్రసాద్ విమర్శించారు. శాసనమండలిలో టీ-బిల్లుపై చర్చ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడారు. ఐటీ డెవలప్మెంట్ పేరిట మోసం జరిగిందని వారు నొక్కి చెప్పారు. హైటెక్ సిటీకి అతి సమీపంలోని 200 ఎకరాల అత్యంత విలువైన భూములను సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఎందుకు మినహాయించారో? ఆ భూములు ఎవరి పేరిట ఉన్నాయో చూస్తే దురుద్దేశం ఏమిటో అర్థమవుతుందని టీడీపీ అధినేతను ఉద్దేశించి భానుప్రసాద్ అన్నారు. దీంతో తెలంగాణ, సీమాంధ్ర టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఎవరినీ విమర్శించడం లేదని, తెలంగాణ ప్రాంత రైతుల భూములను కారుచౌకగా తీసుకోవడం వల్ల తమ ప్రాంత రైతులు నష్టపోయారని గుర్తు చేశానన్నారు. టీడీపీ సభ్యుల తీరు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ఐటీ అభివృద్ధి పేరిట హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాల వక్ఫ్ భూములు తీసుకున్నారు. కానీ ఆ భూములతో పలు సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు’’ అని రిజ్వీ విమర్శించారు. ‘‘భౌగోళికంగా తెలంగాణ మధ్యలో ఉన్న హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఎలా కొనసాగిస్తారు? విడిపోవడంవల్ల ఏర్పడే తెలంగాణ, కోస్తాంధ్ర రెండు ప్రాంతాలకు ఉమ్మడి రాజధాని, ఉమ్మడి గవర్నర్ అయినప్పుడు ఇక రాష్ట్రాన్ని విభజించడం ఎందుకు? రాష్ట్రాన్ని యథాతథంగా ఉమ్మడిగా ఉంచవచ్చు కదా!’’ అని అభిప్రాయపడ్డారు. రెండు మూడేళ్లు మాత్రమే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కాంగ్రెస్ సభ్యుడు భూపాల్ రెడ్డి కోరారు. కన్నీళ్లు పెట్టుకున్న రాజకుమారి రాష్ట్ర విభజన బిల్లుపై మాట్లాడటం బాధ కలిగిస్తోందంటూ టీడీపీ సభ్యురాలు నన్నపనేని రాజకుమారి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె రాసిన ‘నన్నపనేని నవరత్నాలు’లోని కవితలు చదివి వినిపించారు. తెలంగాణ కవులు సి.నారాయణరెడ్డి, కాళోజీలకు తన పుస్తకాలు అంకితం ఇచ్చానని చెప్పారు.