కబ్జాలపై కొరడా | 'Wakf' land back under the scanner | Sakshi
Sakshi News home page

కబ్జాలపై కొరడా

Published Mon, Aug 10 2015 8:18 AM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

'Wakf' land back under the scanner

  •   వక్ఫ్ భూముల స్వాధీనానికి రంగం సిద్ధం.. అన్యాక్రాంతమైన భూములపై సర్కార్ నజర్
  •   కబ్జాదారులకు నోటీసుల జారీ.. చర్యలు ముమ్మరం చేసిన రెవెన్యూ అధికారులు
  •   తొలుత 500 ఎకరాల స్వాధీనానికి యత్నాలు
  • నిజామాబాద్( బాన్సువాడ) : కోట్లాది రూపాయల విలువ చేసే వక్ఫ్ భూముల పరిరక్షణపై రెవెన్యూ అధికారులు నడుం బిగించారు. అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు ప్రారంభించారు. ఆర్డీఓలు.. కబ్జాదారులకు నోటీసులు ఇవ్వడమేకాకుండా, వాటిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకునే విధంగా ముందుకు సాగుతున్నారు. జిల్లాలో సుమారు 5వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నట్లు అంచనా. వీటిలో 3వేల ఎకరాలు కబ్జాదారుల కబంధ హస్తాల్లో ఉన్నాయి. దర్గాలు,మసీదు ముతవల్లీలకు కేటాయించిన ఈ భూములను విక్రయించుకుంటూ వక్ఫ్‌బోర్డుకు ఎసరుపెట్టారు. వక్ఫ్ భూములను పరిరక్షించడంలో వక్ఫ్‌బోర్డు విఫలమవుతుండడంతో ఇనాం భూములను కలిగి ఉన్న వ్యక్తులు యథేచ్ఛగా వాటిని విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో నూతన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై చర్యలు మొదలుపెట్టింది. అసెంబ్లీ హౌస్ కమిటీ చైర్మన్‌గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ను నియమించింది. వక్ఫ్ ఆస్తుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం కాగా,  జిల్లాలోని బాల్కొండ, రేంజల్, నవీపేట, ఎల్లారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్ మండలాల్లో సుమారు 30 మంది కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు నెల రోజులుగా నోటీసులు జారీ చేశారు. ఆ భూములు స్వాధీనం చేసుకుని ఇనాం, సేవ కింద పొందిన భూములను ముతవల్లీలకే కౌలు రూపంలో కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో ఎకరంపై ఏడాదికి రూ 3వేల చొప్పున వసూలు చేయూలని నిర్ణయించారు.  ఏపీ గెజిట్‌లో పేర్కొన్న సర్వే నంబర్ల ఆధారంగా అందరికీ నోటీసులు పంపిస్తున్నారు. పలు పట్టణాల్లో వక్ఫ్ ఆస్తులను విక్రయించగా, వాటి పై షాపింగ్ కాంప్లెక్స్‌లు, పాఠశాలలు, ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. వాటిని సైతం స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నారు.
     ఇష్టారాజ్యంగావిక్రయాలు
     బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో సుమారు 30 ఎకరాల వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు ఇటీవల బోధన్ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు.  ఇందులో సుమారు 20 ఎకరాల భూమిని ముతవల్లీలు ఇప్పటికే రైతులకు విక్రయించారు. ప్రస్తుతం నోటీసులు రావడంతో  రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా బీర్కూర్ మండలం దుర్కి గ్రామంలో వందలాది ఎకరాల వక్ఫ్‌భూములు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఖాజీలకు ఈ భూములను ఇనాం రూపంలో ప్రభుత్వం అందజేసింది. ఈ భూముల్లో పంటలను సాగు చేసి, వాటి ద్వారా వచ్చే నిధులతో దర్గాల ఖర్చులు, ఖితాబత్ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటిని విక్రయించడానికి వీలు లేదు. అయితే ఇక్కడ ఉన్న వందలాది ఎకరాల భూమిని కొందరు అక్రమార్కులు విక్రయించగా, పలువురు రాజకీయ నాయకులు వీటిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలో పక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేయడంతోపాటు పట్టాలు, పహాణీలు సైతం సృష్టించారు.
     ఇనాం భూములను విక్రయిస్తున్నారని, వాటికి సంబంధించిన పర్యవేక్షించడంలో వక్ఫ్‌బోర్డు అధికారులు విఫలమవుతున్నారని 2007లోనే గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.  స్పందించిన అప్పటి కలెక్టర్ దుర్కి గ్రామ శివారులో ఉన్న 61 ఎకరాల ఇనాం భూమిపై విచారణ జరపాలని ఆదేశించారు. ఈ మేరకు సర్వే నంబర్లు 534, 536, 537, 540, 544, 444, 94/1-2, 107/1 నుంచి 15 వరకు, 113/1-2లో ఇనాం భూములున్నాయని వక్ఫ్‌బోర్డు సర్వేలో తేలింది. ఇందులో అప్పటికే సుమారు 40 ఎకరాల భూమిని విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.
     బాన్సువాడ పట్టణంలోనూ ప్రధాన రహదారి పక్కనే వక్ఫభూములు ఉండగా, వాటిపైనా నిర్మాణాలు జరిగాయి. అంతేకాకుండా పలువురు అక్రమార్కులు యథేచ్ఛగా ఆ భూముల్లో సాగు చేస్తూ, విక్రయిస్తున్నారు. వక్ఫ్‌బోర్డుకు కనీస రుసుం చెల్లించడం లేదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement