సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆక్రమణకు గురైన వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం జ్యుడీషియల్ అధికారాలతో ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సంక్షేమ శాఖలను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు ప్రతిపాదనను సైతం ప్రభుత్వం పరిశీలిస్తోందని అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బదులిచ్చారు. కరీంనగర్‌లోని దిగువ మానేరు వంతెన సమీపంలో మైసూరు బృందావనం తరహాలో గార్డెన్‌ను అభివృద్ధి పరచాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాధానమిచ్చారు.
ప్రాజెక్టు తొలి దశ పనుల కోసం రూ.5 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రానికి నివేదిక పంపించామని వెల్లడించారు. మూసీనది నుంచి పిలాయిపల్లి కాల్వ ద్వారా నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఎనిమిది గ్రామాలకు సాగునీటి సరఫరా చేసే ప్రాజెక్టు పనులను 2015 జూన్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రైతు బంధు పథకం కింద గత 8 ఏళ్లలో తెలంగాణలోని 10,416 మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని ఆయన వెల్లడించారు.