
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వక్ఫ్ భూములను అవసరమైన చోట మైనారిటీ గురుకులాల భవన సముదాయాల నిర్మాణాలకు లీజుకు ఇవ్వాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు పాలకమండలి నిర్ణయించింది. ఈ మేరకు వక్ఫ్ అభివృద్ధి కమిటీకి సిఫార్సు చేసింది. మంగళవారం హైదరాబాద్ హజ్‌హౌస్‌లోని రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో జరిగిన వక్ఫ్ బోర్డు పాలకమండలి సమావేశంలో సుమారు 37 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం చైర్మన్ మహ్మద్ సలీం బోర్డు నిర్ణయాలను విలేకరులకు వెల్లడించారు.
వక్ఫ్ బోర్డు ఆదాయ మార్గాల పెంపు కోసం ఆరు ఆస్తుల అభివృద్ధిపై ప్రధాన దృష్టి సారించి చర్చించినట్లు తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, అభివృద్ధి కోసం పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. వక్ఫ్ ఆస్తుల కేసులపై హైకోర్టులో వాదించేందుకు సీనియర్ న్యాయవాదులను నియమిం చాలని నిర్ణయించినట్లు చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆదాయం ఆబ్జెక్టివ్ ఆఫ్ వక్ఫ్ ప్రకారం వినియోగించాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు.
మసీదుల రోజువారీ వ్యవహారాల నిర్వహణ కోసం 15 పాలకమండళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కొన్ని మసీదుల పాలకమండలి కాలపరిమితి కూడా పొడిగిస్తూ తీర్మానం చేశామన్నారు. బోర్డుకు ఇద్దరు రిటైర్డ్ తహసీల్దార్లను నియమించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ పాలకమండలి సమావేశంలో సభ్యులైన సయ్యద్ షా అక్బర్ నిజామోద్దీన్ హుస్సేని, మీర్జా అన్వర్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment