ఏపీ ఎంసెట్ మెడికల్‌లో తెలంగాణ హవా
టాప్ 10లో ఆరుగురు తెలంగాణ వారే
- 2, 3, 5, 6, 8, 9 ర్యాంకులు కైవసం
- వెబ్‌సైట్‌లో ర్యాంకు కార్డులు
- ఓఎంఆర్ షీట్లపై అభ్యంతరాలకు 26వ తేదీ దాకా అవకాశం
సాక్షి, విజయవాడ బ్యూరో: ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. తొలి పది ర్యాంకుల్లో ఏకంగా ఆరింటిని సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన యర్ల సాత్విక్‌రెడ్డి రెండో ర్యాంకు, అమ్మకోల యజ్ఞప్రియ మూడు, ఇక్రాం ఖాన్ ఐదు, శొంటి సాహితీ సావిత్రి ఆరో ర్యాంకు సాధించారు. వరంగల్ జిల్లాకు చెందిన బలభద్ర గ్రీష్మ మీనన్‌కు 8, నల్లగొండకు చెందిన దారం శివకుమార్‌కు 9వ ర్యాంకు వచ్చాయి.
ఏపీ విద్యార్థుల్లో 85.24 శాతం మంది ఉత్తీర్ణులు కాగా తెలంగాణ విద్యార్థులు 95.48 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. నిజానికి వీటిని ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలతో పాటే విడుదల చేయాల్సి ఉండగా, దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో సీట్లను ‘నీట్’ ద్వారానే చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వాయిదా వేశారు. నీట్‌ను ఏడాదిపాటు వాయిదా వేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్రం నిర్ణయించడంతో శనివారం విడుదల చేశారు. ఏపీ ఎంసెట్‌ను ఏప్రిల్ 29న ఆంధ్రప్రదేశ్‌లోని పలు కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లో కూడా నిర్వహించడం తెలిసిందే. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 98,752 మంది రాయగా 86,494 మంది అర్హత సాధించారు. తెలంగాణ నుంచి 22,589 మంది హాజరవగా 21,569 మంది అర్హత సాధించారు.
వెబ్‌సైట్‌లో ఓఎంఆర్ షీట్లు
విద్యార్థులకు వారి ర్యాంకులను ఎసెమ్మెస్‌ల రూపంలో పంపించారు. వేరే బోర్డుల నుంచి ఎంసెట్‌కు హాజరైన 6,669 మంది విద్యార్థులకు వారి ఇంటర్ మార్కులు వెల్లడి కాకపోవడంతో ఇంకా ర్యాంకులు కేటాయించలేదు. అర్హత సాధించిన విద్యార్థులు ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి, ఏపీ ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ వీఎస్‌ఎస్ కుమార్, కన్వీనర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. ఓఎంఆర్ షీట్లు www.apeamcet.org వెబ్‌సైట్‌లో శనివారం నుంచే అందుబాటులో ఉన్నాయన్నారు. అభ్యంతరాలుంటే 26వ తేదీ దాకా పరిశీలించుకోవచ్చన్నారు. టాపర్లకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ‘నీట్’ తప్పనిసరి కావడంతోఏపీలో అందుకవసరమైన సిలబస్, విధివిధానాల రూపకల్పనకు త్వరలో కమిటీ వేస్తామని చెప్పారు. నీట్ గందరగోళం నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందొద్దనే ఎంసెట్ మెడికల్ ఫలితాలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశామన్నారు. శనివారం తనను కలిసిన ఎంసెట్ మెడిసిన్ టాపర్ మాచాని హేమలతను బాబు అభినందించారు.