'భవానీగా ఉంటే.. అదోలా ఉండేది'
- పాఠశాలకు వచ్చిన భానుతో స్నేహితుల ముచ్చట్లు
- పూర్వ విద్యార్థికి ఆసరా అందించిన ఉపాధ్యాయులు
చిన్నశంకరంపేట: 'అమ్మాయిలా పెరిగినప్పటికీ వారితో స్నేహంగా ఉండాలంటే ఇబ్బం దిగా ఉండేది.. అదే అబ్బాయిలతో చనువుగా ఉండేందుకు ఇష్టపడేవాడిని'అని చిన్నశంకరంపేటకు చెందిన భవాని అలియాస్ భానుప్రసాద్ తెలిపాడు. ఇన్నాళ్లు అమ్మాయిగా పె రిగి.. ఇప్పుడు అబ్బాయిగా మారిన సందర్భంగా భానుప్రసాద్ బుధవారం చిన్నశంకరంపేటలో 'సాక్షి'తో తన అంతరంగాన్ని పం చుకున్నాడు. ఆమె అతడుగా మారిన వైనం వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మదిర గ్రామం భాగిర్తిపల్లికి చెందిన నాగులు, భాగ్యమ్మ దంపతులకు 17 ఏళ్ల క్రి తం బిడ్డపుట్టగా.. శరీరతీరును చూసి పాప గా నిర్ధారించుకున్నారు.
భవాని అని పేరు పెట్టి బడికి పంపించారు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఆడపిల్ల లక్షణాలు కరువయ్యాయి. అయితే, నెల రోజుల క్రితం కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. భవానీ అమ్మాయి కాదు అబ్బాయి అని డాక్టర్లు తేల్చారు. జన్యుపరమైన లోపాల కారణంగా అంగం కడుపులోనే ఉండిపోవడంతో ఇన్నాళ్లు అందరూ అమ్మాయిగా భావించారని, శస్త్రచికిత్స చేసి అబ్బాయిగా మార్చాలని చెప్పడంతో భవానీతో పాటు.. బంధువులం తా నిర్ఘాంతపోయారు.
దీంతో హైదరాబాద్‌లోని వాసవీ ఆస్పత్రిలో నెల రోజుల క్రితం శస్త్ర చికిత్స చేశారు. తర్వాత భవాని కాస్త భానుప్రసాద్‌గా మారాడు. బుధవారం భానుప్రసాద్ మాట్లాడుతూ ‘అమ్మాయిగా పెరిగినప్పటికీ నా ఇష్టాలన్నీ అబ్బాయిలాగే ఉండేవి. జడ వేసుకున్నా పూలు పెట్టుకునేందుకు ఇష్టపడేవాడిని కాదు. బొట్టు కూడా అంతంత మాత్రమే పెట్టుకునేవాడిని.
పదోతరగతికి వచ్చేసరికి అమ్మాయిల కన్నా అబ్బాయిలతోనే స్నేహం చేయాలనిపించేది. తరగతి గదిలో అమ్మాయిల పక్కన కూర్చున్నప్పటికీ వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించేవాడిని. వారితో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు నాలో అలజడి రేగేది’ అని వివరించాడు. అ బ్బాయిలతో స్నేహం చేయడాన్ని ఉపాధ్యాయురాళ్లు తప్పుపడుతూ చీవాట్లు పెట్టేవారన్నాడు. మరిన్ని శస్త్ర చికిత్సలు అవసరమని డాక్టర్లు చెప్పారని, అవసరమైన వైద్య చేయించుకునేందుకు దాతల సాయం కోసం చూస్తున్నానని, దాతలు సహాయం చేయాల ని ఈ సందర్భంగా భవానీప్రసాద్ కోరుతున్నాడు.
చీవాట్లు పెట్టేదాన్ని..
అబ్బాయిలతో స్నేహం అంత మంచిదికాదని భవానీని చీవాట్లు పెట్టేదాన్ని. పదోతరగతిలోకి వచ్చేసరికి భవాని అబ్బాయిల డ్రెస్‌లు వేసుకోవడం, వారితో కలసి డ్యాన్స్ చేయడాన్ని నేను తట్టుకోలేకపోయా. చీవాట్లు పెడితే నన్ను కోపంగా చూసేది. ఇప్పుడు చూస్తే అప్పుడు భవాని (భానుప్రసాద్) చేసింది కరెక్టేనని అనిపిస్తుంది. - ఏసుమణి, ఉపాధ్యాయురాలు, జెడ్పీహెచ్‌ఎస్
ఉపాధ్యాయుల ఆర్థికసాయం
భానుప్రసాద్ తాను చదువుకున్న చిన్నశంకరంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు బుధవారం వెళ్లాడు. అక్కడి ఉపాధ్యాయులతో తన అనుభవాన్ని పంచుకున్నాడు. అతని ప రిస్థితిని చూసి చలించిపోయిన ప్రధానోపాధ్యాయురాలు స్వరూపరాణి రూ.3,000, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రూ.1,100 ఆర్థిక సహాయం అందించారు.