స్థానిక సంస్థల కోటాలో ఈసారి భానుప్రసాద్, ఎల్.రమణ పేర్లు దాదాపుగా ఖరారయ్యాని సమాచారం. వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలిసింది. వాస్తవానికి ఎల్.రమణను మొన్న జరిగిన ఎమ్మెల్యే కోటాలోనే ఎమ్మెల్సీగా పంపుతారని ప్రచారం సాగినా.. ఉమ్మడి జిల్లా నుంచి పాడి కౌశిక్‌రెడ్డి, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి నామినేషన్లు వేశారు. దీంతో మాజీ మంత్రి ఎల్.రమణ వర్గం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.
తాజాగా మరోసారి ఎల్.రమణ పేరు అధిష్టానం.. పరిగణనలోకి తీసుకుందని సమాచారం. స్థానిక సంస్థల కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకటి బీసీ, మరొకటి ఓసీలకు ఇవ్వాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ సమీకరణాల్లో భాగంగానే భానుప్రసాద్ రావు మూడోసారి ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్నారు. బీసీ కోటాలో ఈసారి మాజీ మంత్రి ఎల్.రమణకు అవకాశం ఇచ్చారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
చదవండి: తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక ఉత్తర్వులు..
సాక్షి, కరీంనగర్: మొన్నటి దాకా హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక రణరంగం నడిచిన కరీంనగర్‌లో రెండువారాలు తిరక్కముందే స్థానిక సంస్థల ఎన్నికల భేరీ మోగింది. జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ ఉప ఎన్నికలో అభ్యర్థుల ఎంపిక, రెబెల్స్, తిరుగుబాటుదారులు, బుజ్జగింపు పర్వాలు ఏ పార్టీలో అణువంతైనా కనిపించలేదు. కానీ.. ప్రస్తుతం నడుస్తున్న స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియలో మాత్రం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీకి స్థానిక ప్రజాప్రతినిధుల ఓట్ల విషయంలో తిరుగులేని బలం ఉన్నప్పటికీ.. బరిలో నిలిచేవారి సంఖ్య పెరుగుతుండటం ఇందుకు కారణం. ఈసారి టీఆర్‌ఎస్ ఎంపీపీ (సైదాపూర్), రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సారాబుడ్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేశారు.
చదవండి: నిప్పులాంటి నిజం! సిలిండర్‌పై ఎక్స్‌ట్రా వసూళ్లు, మొత్తం లెక్కిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే!
రోజురోజుకూ దిగజారిపోతున్న ఎంపీటీసీలకు పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే తాను నామినేషన్ వేశానని చెబుతున్నారు. వాస్తవానికి ఇంతవరకూ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి అభ్యర్థుల ప్రకటనపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. కానీ.. ఈయన మాత్రం తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, వాటిపై స్పష్టమైన హామీ దొరికే వరకు నామినేషన్ వెనక్కి తీసుకోనని ఖరాఖండిగా చెబుతున్నారు. జిల్లా నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్ ఏనాడైనా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలను మండలివేదికగా ప్రస్తావించారా? అని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ఐదుగురి డిమాండ్లు కూడా కాస్త అటూఇటూగా ఇవే కావడం గమనార్హం.
బరిలో మరికొందరు...
►ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి.
►ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. నామినేషన్ల స్వీకరణకు 23వ తేదీ ఆఖరు.
► ఇప్పటిదాకా మొత్తం ఆరుగురు అభ్యర్థులు తొమ్మిదిసెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
►వీరిలో ప్రభాకర్‌రెడ్డి ఒకరు మాత్రమే పార్టీ నుంచి బరిలో ఉన్నారు.
►ఇక మునిగాల విజయలక్ష్మి, మసార్తి రమేశ్, బొమ్మరవేని తిరుపతి, నలమాచు రామకృష్ణ, పురం రాజేశం ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు.
►మంగళవారం నామినేషన్ల స్వీకరణకు ఆఖరు రోజు కావడంతో చివరి రెండురోజుల్లో మరికొందరు నామినేషన్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
►ముఖ్యంగా జగిత్యాల, పెద్దపల్లి నుంచి కొందరు ఇండిపెండెంటుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
►ఇప్పటివరకూ దాదాపు 70 వరకు నామినేషన్ పత్రాలను కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం నుంచి తీసుకెళ్లడమే ఇందుకు నిదర్శనం. ఇందులో కొందరు నాలుగేసి సెట్లు, మరికొందరు ఒకటి, రెండు సెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం. నామినేషన్ దాఖలు చేసేవారిలో బలమైన అభ్యర్థులకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతిచ్చేందుకు సుముఖంగా ఉన్నాయని ఇండిపెండెంట్లు ధీమాతో ఉన్నారు. అయితే.. అన్ని పార్టీల్లో తిరుగుబాట్లు, అలకలు సహజమేనని, ఎవరికైనా పార్టీ ఆదేశాలు శిరోధార్యమని సీనియర్ టీఆర్‌ఎస్ నేతలు ‘సాక్షి’కి తెలిపారు.
సీఎం నిర్ణయమే ఫైనల్..
ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని శనివారం కరీంనగర్‌లో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించారు. కరీంనగర్ నగర పాలక, కొత్తపల్లి పురపాలక సంఘాలకు చెందిన డిప్యూటీ మేయర్, చైర్మన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు, మంత్రి గంగుల పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించే అభ్యర్థికి మద్దతు తెలపాల్సిందిగా సూచించారు.
సమావేశంలో పాల్గొన్న పాలకవర్గాల సభ్యులు ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల నియోజకవర్గాలకు మంత్రి గంగుల ఎన్నికల ఇన్‌చార్జిగా, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు మంత్రి కొప్పుల ఈశ్వరు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. సమావేశంలో కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment