local body mlc election
-
AP: ఎమ్మెల్సీలుగా 10 మంది ప్రమాణం
సాక్షి, అమరావతి: శాసన మండలికి నూతనంగా ఎంపికైన 11 మంది సభ్యులలో పది మంది బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో మండలి అధ్యక్షులు కొయ్యే మోషేనురాజు ఎనిమిది మంది సభ్యులతో వేదికపై ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో అనంతపురం స్థానిక సంస్థలకు చెందిన ఎల్లారెడ్డి గారి శివరామిరెడ్డి, గుంటూరు స్థానిక సంస్థలకు చెందిన డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, విజయనగరం స్థానిక సంస్థలకు చెందిన ఇందుకూరి రఘురాజు, విశాఖ స్థానిక సంస్థలకు చెందిన వరుదు కళ్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు(వంశీ కృష్ణ యాదవ్), చిత్తూరు స్థానిక సంస్థలకు చెందిన కృష్ణ రాఘవ జయేంద్ర భరత్, ప్రకాశం స్థానిక సంస్థలకు చెందిన తుమాటి మాధవరావు ఉన్నారు. కృష్ణా జిల్లా స్థానిక సంస్థలకు చెందిన తలశిల రఘురాం, మొండితోక అరుణ కుమార్ కాస్త ఆలస్యంగా రావడంతో మండలిలోని చైర్మన్ చాంబరులో వారి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. తలశిల రఘురాం విజయవాడ రూరల్ గొల్లపూడి నుంచి భారీ ర్యాలీతో ప్రమాణ స్వీకారానికి తరలివచ్చారు. తూర్పు గోదావరి స్థానిక సంస్థల నుంచి శాసన మండలి సభ్యులుగా ఎంపికైన అనంత సత్య ఉదయ భాస్కర్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, శంకర నారాయణ, మేకతోటి సుచరిత, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ నుంచి ఇద్దరి పేర్లు ఖరారు.. సీఎం నిర్ణయమే ఫైనల్..
స్థానిక సంస్థల కోటాలో ఈసారి భానుప్రసాద్, ఎల్.రమణ పేర్లు దాదాపుగా ఖరారయ్యాని సమాచారం. వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలిసింది. వాస్తవానికి ఎల్.రమణను మొన్న జరిగిన ఎమ్మెల్యే కోటాలోనే ఎమ్మెల్సీగా పంపుతారని ప్రచారం సాగినా.. ఉమ్మడి జిల్లా నుంచి పాడి కౌశిక్‌రెడ్డి, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి నామినేషన్లు వేశారు. దీంతో మాజీ మంత్రి ఎల్.రమణ వర్గం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. తాజాగా మరోసారి ఎల్.రమణ పేరు అధిష్టానం.. పరిగణనలోకి తీసుకుందని సమాచారం. స్థానిక సంస్థల కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకటి బీసీ, మరొకటి ఓసీలకు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ సమీకరణాల్లో భాగంగానే భానుప్రసాద్ రావు మూడోసారి ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్నారు. బీసీ కోటాలో ఈసారి మాజీ మంత్రి ఎల్.రమణకు అవకాశం ఇచ్చారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. చదవండి: తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక ఉత్తర్వులు.. సాక్షి, కరీంనగర్: మొన్నటి దాకా హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక రణరంగం నడిచిన కరీంనగర్లో రెండువారాలు తిరక్కముందే స్థానిక సంస్థల ఎన్నికల భేరీ మోగింది. జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ ఉప ఎన్నికలో అభ్యర్థుల ఎంపిక, రెబెల్స్, తిరుగుబాటుదారులు, బుజ్జగింపు పర్వాలు ఏ పార్టీలో అణువంతైనా కనిపించలేదు. కానీ.. ప్రస్తుతం నడుస్తున్న స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియలో మాత్రం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీకి స్థానిక ప్రజాప్రతినిధుల ఓట్ల విషయంలో తిరుగులేని బలం ఉన్నప్పటికీ.. బరిలో నిలిచేవారి సంఖ్య పెరుగుతుండటం ఇందుకు కారణం. ఈసారి టీఆర్ఎస్ ఎంపీపీ (సైదాపూర్), రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సారాబుడ్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేశారు. చదవండి: నిప్పులాంటి నిజం! సిలిండర్‌పై ఎక్స్ట్రా వసూళ్లు, మొత్తం లెక్కిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే! రోజురోజుకూ దిగజారిపోతున్న ఎంపీటీసీలకు పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే తాను నామినేషన్ వేశానని చెబుతున్నారు. వాస్తవానికి ఇంతవరకూ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి అభ్యర్థుల ప్రకటనపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. కానీ.. ఈయన మాత్రం తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, వాటిపై స్పష్టమైన హామీ దొరికే వరకు నామినేషన్ వెనక్కి తీసుకోనని ఖరాఖండిగా చెబుతున్నారు. జిల్లా నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్ ఏనాడైనా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలను మండలివేదికగా ప్రస్తావించారా? అని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ఐదుగురి డిమాండ్లు కూడా కాస్త అటూఇటూగా ఇవే కావడం గమనార్హం. బరిలో మరికొందరు... ►ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ►ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. నామినేషన్ల స్వీకరణకు 23వ తేదీ ఆఖరు. ► ఇప్పటిదాకా మొత్తం ఆరుగురు అభ్యర్థులు తొమ్మిదిసెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ►వీరిలో ప్రభాకర్‌రెడ్డి ఒకరు మాత్రమే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ►ఇక మునిగాల విజయలక్ష్మి, మసార్తి రమేశ్, బొమ్మరవేని తిరుపతి, నలమాచు రామకృష్ణ, పురం రాజేశం ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు. ►మంగళవారం నామినేషన్ల స్వీకరణకు ఆఖరు రోజు కావడంతో చివరి రెండురోజుల్లో మరికొందరు నామినేషన్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ►ముఖ్యంగా జగిత్యాల, పెద్దపల్లి నుంచి కొందరు ఇండిపెండెంటుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ►ఇప్పటివరకూ దాదాపు 70 వరకు నామినేషన్ పత్రాలను కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం నుంచి తీసుకెళ్లడమే ఇందుకు నిదర్శనం. ఇందులో కొందరు నాలుగేసి సెట్లు, మరికొందరు ఒకటి, రెండు సెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం. నామినేషన్ దాఖలు చేసేవారిలో బలమైన అభ్యర్థులకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతిచ్చేందుకు సుముఖంగా ఉన్నాయని ఇండిపెండెంట్లు ధీమాతో ఉన్నారు. అయితే.. అన్ని పార్టీల్లో తిరుగుబాట్లు, అలకలు సహజమేనని, ఎవరికైనా పార్టీ ఆదేశాలు శిరోధార్యమని సీనియర్ టీఆర్ఎస్ నేతలు ‘సాక్షి’కి తెలిపారు. సీఎం నిర్ణయమే ఫైనల్.. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని శనివారం కరీంనగర్లో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించారు. కరీంనగర్ నగర పాలక, కొత్తపల్లి పురపాలక సంఘాలకు చెందిన డిప్యూటీ మేయర్, చైర్మన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు, మంత్రి గంగుల పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించే అభ్యర్థికి మద్దతు తెలపాల్సిందిగా సూచించారు. సమావేశంలో పాల్గొన్న పాలకవర్గాల సభ్యులు ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల నియోజకవర్గాలకు మంత్రి గంగుల ఎన్నికల ఇన్చార్జిగా, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు మంత్రి కొప్పుల ఈశ్వరు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. సమావేశంలో కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. -
అక్టోబర్ 9న ఎమ్మెల్సీ ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్ కారణంగా వాయిదాపడిన నిజామా బాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చేనెల 9న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) వెల్లడించింది. అక్టోబర్ 12న ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొంది. ఈ నియో జకవర్గ పరిధిలో తక్షణం ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని తాజా నోటిఫికేషన్లో పేర్కొంది. ఆర్.భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా అనర్హతకు గురవగా సీఈసీ మార్చి 5న ఉపఎన్నికకు షెడ్యూలు జారీచేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం పోటీలో మిగిలిన అభ్యర్థులను కూడా ఎన్నికల సంఘం ప్రకటిం చింది. ఏప్రిల్ 7న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా..కోవిడ్ కారణంగా తొలుత 60 రోజుల పాటు ఎన్నిక వాయిదావేస్తూ ఎన్నికల సంఘం మార్చి 24న ఉత్తర్వులు జారీచేసింది. తదనంతరం 45 రోజులపాటు పొడిగిస్తూ మే 22న, తిరిగి జూలై 6న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
‘ఎన్నికల ఫలితాలు సంచనాలు సృష్టిస్తాయి’
-
‘ఎన్నికల ఫలితాలు సంచనాలు సృష్టిస్తాయి’
కడప: జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలను సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. కడప నుంచి వైఎస్ వివేకానందరెడ్డితో పాటు అన్ని ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సంచనాలు సృష్టిస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఈనెల 17న ఎన్నికలు జరిగాయి. ఈ నెల 20న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
కాంగ్రెస్-టీడీపీ చెట్టాపట్టాల్!
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేయి - సైకిల్ జోడీ హైదరాబాద్ సుదీర్ఘకాలంగా రాజకీయ శత్రువులుగా కొనసాగిన కాంగ్రెస్, టీడీపీ ఒక్కటయ్యాయి. స్థానిక సంస్థల కోటాలో ఆదివారం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకోవాలని ఒప్పందాలు చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు జరుగుతున్న రెండు సీట్ల కోసం మొదటి, రెండో ప్రాధాన్యతా ఓట్లను పరస్పరం వేసుకోవాలన్న అంగీకారానికి వచ్చాయి. ఈ జిల్లాలోని రెండు స్థానాల్లో టీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులను నిలపగా, కాంగ్రెస్, టీడీపీ ఒక్కో అభ్యర్థిని మాత్రమే పోటీ పెట్టాయి. టీఆర్ఎస్ను ఓడించడానికి ఈ రెండు పార్టీలు పరస్పర అవగాహనకు వచ్చాయి. కాంగ్రెస్ మద్దతుదారులంతా ఆ పార్టీ అభ్యర్థికి తొలి ప్రాధాన్యతా ఓట్లు వేస్తారు. రెండో ప్రాధాన్యతా ఓట్లను టీడీపీకి వేస్తారు. అలాగే టీడీపీ ఓటర్లంతా తొలి ప్రాధాన్యతా ఓట్లను టీడీపీ అభ్యర్థికి, రెండో ప్రాధాన్యతా ఓట్లను కాంగ్రెస్‌కు వేసేలా రెండు పార్టీలు ఒప్పందానికి వచ్చాయి. మహబూబ్‌నగర్‌లోనూ రెండు స్థానాలుండగా, ఒక్కో స్థానం నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్, టీడీపీలు ఇదే తరహాలో ప్రాధాన్యతా ఓట్లను పరస్పరం వేసుకోవాలన్న అంతర్గ ఒప్పందానికి వచ్చినట్టు సమాచారం. ఖమ్మంలో మరో మహాకూటమి ఇకపోతే, ఖమ్మం జిల్లాలో ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థులను పోటీ పెట్టకుండా అక్కడి నుంచి పోటీచేస్తున్న సీపీఐ (పువ్వాడ నాగేశ్వరరావు) కి మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, టీడీపీలు కలిసి తమ ఓటర్లతో సీపీఐ అభ్యర్థికి వేయించడానికి క్యాంపులు కూడా నిర్వహించాయి. అక్కడ సీపీఎం కూడా సీపీఐ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. నల్గొండలో తలోదారి.. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా మారిన నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మిగిలిన పార్టీల ఓటర్లు ఎవరికి తోచిన దారిలో వారు నడుస్తున్నారు. ఇక్కడి నుంచి టీడీపీ పోటీ చేయకపోగా ఆ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు దాదాపు 90లో సగం మంది కాంగ్రెస్ వైపు మరో సగం మంది టీఆర్ఎస్వైపు మళ్లినట్టు తెలుస్తోంది. ఖమ్మంలో మద్దతు ఇస్తున్న కారణంగా సీపీఐ ఈ జిల్లాలో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. సీపీఎం మాత్రం తటస్థ వైఖరితో ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించింది. ఆ ఒక్క ఓటు కీలకమవుతుందా? నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్), తేరా చిన్నపరెడ్డి (టీఆర్ఎస్) మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ ఫలితంపైనే ఉంది. ఎవరు గెలిచినా స్వల్ప ఓట్ల తేడానే ఉంటుందని అంటున్నారు. నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ప్రతినిధులు 1262 (ఓటర్లు) ఉండగా వీరిలో కాంగ్రెస్‌కు చెందిన మేళ్లచెరువు మండలం వెల్లటూరు ఎంపీటీసీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. పోలింగ్‌లో పాల్గొనే అవకాశాలు లేవు. పోటీ ఇంత తీవ్ర స్థాయిలో ఉండటంతో ఆ ఒక్క ఓటు విషయంలో అంతా చర్చించుకుంటున్నారు.