![YSRCP Winning MLC Candidates Takes Oath As MLC Of Local Body - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/8/MLC.jpg.webp?itok=EeBoTLS6)
సాక్షి, అమరావతి: శాసన మండలికి నూతనంగా ఎంపికైన 11 మంది సభ్యులలో పది మంది బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో మండలి అధ్యక్షులు కొయ్యే మోషేనురాజు ఎనిమిది మంది సభ్యులతో వేదికపై ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో అనంతపురం స్థానిక సంస్థలకు చెందిన ఎల్లారెడ్డి గారి శివరామిరెడ్డి, గుంటూరు స్థానిక సంస్థలకు చెందిన డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, విజయనగరం స్థానిక సంస్థలకు చెందిన ఇందుకూరి రఘురాజు, విశాఖ స్థానిక సంస్థలకు చెందిన వరుదు కళ్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు(వంశీ కృష్ణ యాదవ్), చిత్తూరు స్థానిక సంస్థలకు చెందిన కృష్ణ రాఘవ జయేంద్ర భరత్, ప్రకాశం స్థానిక సంస్థలకు చెందిన తుమాటి మాధవరావు ఉన్నారు.
కృష్ణా జిల్లా స్థానిక సంస్థలకు చెందిన తలశిల రఘురాం, మొండితోక అరుణ కుమార్ కాస్త ఆలస్యంగా రావడంతో మండలిలోని చైర్మన్ చాంబరులో వారి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. తలశిల రఘురాం విజయవాడ రూరల్ గొల్లపూడి నుంచి భారీ ర్యాలీతో ప్రమాణ స్వీకారానికి తరలివచ్చారు. తూర్పు గోదావరి స్థానిక సంస్థల నుంచి శాసన మండలి సభ్యులుగా ఎంపికైన అనంత సత్య ఉదయ భాస్కర్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, శంకర నారాయణ, మేకతోటి సుచరిత, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment