
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు.. మహిళలకు ఏం చేశారని ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రశ్నించారు.
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు.. మహిళలకు ఏం చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రశ్నించారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 30 నెలలలో జగన్ ఎన్నో సంక్షేమ పనులు చేశారని.. చంద్రబాబు డ్వాక్రా మహిళలకు అన్యాయం చేస్తే జగన్ న్యాయం చేశారన్నారు. చంద్రబాబు పెట్టిన బకాయిలను జగన్ తీర్చారు. అలాంటి వ్యక్తి జగన్‌పై విమర్శలు చేయటం సిగ్గుచేటు. ఎన్నో పథకాలు సీఎం జగన్ ప్రవేశపెడుతున్నారని చంద్రబాబుకు కడుపుమంట అని సునీత దుయ్యబట్టారు.
చదవండి: సీఎం వైఎస్ జగన్‌పై సినీ ఇండస్ట్రీ పెద్దల ప్రశంసలు
‘‘సీఎం జగన్.. లక్షా 36 వేల మందికి సచివాలయాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు పాలనలో ఎంతో మంది మహిళల తాళిబొట్లు తెగాయి. కాల్ మనీ సెక్స్ రాకెట్‌తో వారి జీవితాలను నాశనం చేశారు. కానీ జగన్ ఇప్పుడు మహిళలకు ఎంతో చేస్తుంటే చంద్రబాబుకు కనిపించటం లేదు. గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకుని ఆయన వ్యవహరిస్తున్నారు. ఇలాగే ఉంటే ఈసారి ఆ 23 సీట్లు కూడా రావని’’ ఎమ్మెల్సీ పోతుల సునీత ఎద్దేవా చేశారు.