సాక్షి, హైదరాబాద్: పదేళ్లు అధికారంలో ఉండగా ఏ నాడూ రైతుల సంక్షేమం గురించి పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇపుడు వారి గురించి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు స్వామినాథన్ కమిటీ సిఫారసులను చెత్తబుట్టలో వేసి వాటి గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉండగా రైతుల బతుకులను చిన్నాభిన్నం చేసింది కాంగ్రెస్ నేతలేనని దుయ్యబట్టారు. ఆర్మూర్ డిక్లరేషన్ పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు.
2009 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చినా వాటిని పెండింగులో పెట్టారని ఆరోపించారు. మధుయాష్కీ తాను ఎంపీగా ఉన్నప్పుడు తమ ప్రభుత్వాన్ని ఒప్పించి పసుపు బోర్డును ఎందుకు సాధించలేకపోయారని నిలదీశారు. నిజామాబాద్ ఎంపీ కవిత కృషి వల్లే పసుపు బోర్డు ఏర్పాటుపై కదలిక వచ్చిందని కాంగ్రెస్ నేతలు గ్రహించాలని హితవు పలికారు.
తెలంగాణలో కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఆర్మూరు డిక్లరేషన్ రైతుల సంక్షేమం కోసం చేసింది కాదని, కాంగ్రెస్ నేతలు తమ పదవుల యావతో చేసుకున్న డిక్లరేషన్ అని వ్యాఖ్యానించారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ను ప్రశంసిస్తూ సీఎం కేసీఆర్‌కు స్వామినాథన్ లేఖ రాశారని, కాంగ్రెస్ నేతలకు స్వామినాథన్ వంటి మేధావుల ప్రశంసలు కనబడడం లేదా అని ప్రశ్నించారు. రైతులకు మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment