crocodile tears
-
ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు మొసలి కన్నీరు మాని పార్లమెంటులో వారి ప్రవర్తనపై దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, ప్రభుత్వం ఎంపీలపై దాడి చేసిందని విపక్షాలు నిరసన ర్యాలీలో విమర్శలు గుప్పించగా దీనికి కౌంటర్‌గా 8 మంది కేంద్ర మంత్రులు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మార్షల్స్‌పై విపక్ష సభ్యులు దురుసుగా ప్రవర్తించారని ప్రత్యారోపణ చేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాకూర్, నఖ్వీ, భూపేంద్ర యాదవ్, అర్జున్ మేఘ్వాల్, వి.మురళీధరన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాహితంపై వారికి చింతలేదు అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ‘దేశ ప్రజలు తమ సమస్యలు పార్లమెంటు సమావేశాల్లో చర్చకు వస్తాయని ఆశించారు. దేశ ప్రజల హితం కానీ, రాజ్యాంగ విలువలపై గానీ వారికి చింత లేదు. విపక్షాలు మొసలి కన్నీరు కార్చడం ఆపి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని పేర్కొన్నారు. ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ‘పార్లమెంటు సమావేశాల ముందు అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడే విపక్షాలు సభను నడవనివ్వమన్న సంకేతాలు ఇచ్చాయి. సభను నడవనివ్వబోమని చెప్పేశారు. మేం చాలా సందర్భాల్లో వారితో మాట్లాడాం. కనీసం మొదటి రోజు మంత్రి మండలిలోని నూతన సభ్యుల పరిచయ కార్యక్రమాన్ని అనుమతించాలని కోరాం. అందుకు కూడా ఒప్పుకోలేదు. రెండు సభల్లో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశాల్లో వారు వారి డిమాండ్లను పెట్టారు. స్వల్పకాలిక చర్చలు జరపాలని కోరారు. ధరల పెరుగుదల, కోవిడ్, వ్యవసాయం తదితర అంశాలపై చర్చకు చైర్మన్ అనుమతించారు. పెగసస్ వంటి అంశాలను పట్టుబట్టుతూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సభాకార్యకలాపాలకు విఘాతం కలిగించారు. ముఖ్యమైన బిల్లులను కూడా చర్చకు అనుమతించలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇలా ఎన్ని చేశారో రికార్డులు చూడొచ్చు.. ఆనాడు ఏపీ విభజన వంటి ముఖ్యమైన బిల్లులు కూడా గందరగోళంలో ఆమోదింపజేసుకున్నారు’ అని దుయ్యబట్టారు. ‘నాలుగో తేదీన ఆరుగురు సభ్యులను సస్పెండ్ చేయగా.. గ్లాసులు పగలగొట్టుకుని లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. అధికారులకు గాయాలయ్యేలా చేశారు. రాజ్యసభలో టేబుల్ ఎక్కి ఆందోళన చేశారు. అది బిల్లుపై చర్చ కూడా కాదు. చర్చకు సిద్ధంగా ఉంటే సభను సోమవారం వరకూ నిర్వహిస్తామని చెప్పాం. కానీ వారు సహకరించకపోగా.. ఇన్సూరెన్స్ బిల్లు, ఓబీసీ బిల్లు ఆమోదింపజేసుకుంటే మంగళవారం నాటి పరిణామాల కంటే తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడేమో మహిళా ఎంపీలపై పురుష మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని రాహుల్ గాంధీ ప్రకటన చేశారు. దేశ ప్రజలు చూస్తున్నారు. వారికి ఏమాత్రం ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేం రాజ్యసభ చైర్మన్‌ను కూడా కోరాం. విపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాం.. ఏపార్టీ అధికారంలో ఉన్నా ఇది పునరావృతం కాకూడదు..’ అని పేర్కొన్నారు. మార్షల్స్‌పై దాడులకు దిగారు: గోయల్ రాజ్యసభలో సభా నాయకుడు పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను మంటగలిపారని మండిపడ్డారు. సభ ఆస్తులను ధ్వంసం చేశారని, మార్షల్స్‌పై దురుసుగా ప్రవర్తించారని, భౌతిక దాడులకు దిగారని, వారి దుష్ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 12 మంది మహిళా మార్షల్స్, 18 మంది పురుష మార్షల్స్.. మొత్తం 30 మంది మార్షల్స్ మాత్రమే ఉన్నారని వివరించారు. విపక్షాలది కేవలం డ్రామా అని, ఓబీసీ బిల్లు విషయంలో కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చర్చను సాగనిచ్చారని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఈ మంత్రులంతా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యని కలిసి సభలో పార్లమెంటరీ సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ దురదృష్టకరమైన రీతిలో ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బయటివారెవరూ లేరు.. ఉభయ పక్షాలు తనతో భేటీ అయిన అనంతరం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అధికారులతో సమావేశం నిర్వహించి మంగళవారం నాటి పరిణామాలను మరోసారి ఆరాతీశారు. బయటివారెవరూ సభలోకి రాలేదని, తొలుత 14 మంది మార్షల్స్ ఉన్నారని, క్రమంగా సభలో పరిస్థితిని బట్టి మార్షల్స్ సంఖ్య 42కు చేరిందని వారు చైర్మన్‌కు నివేదించారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే! పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చోటు చేసుకున్న సంఘటనలు, సభాకార్యకలాపాలకు కొందరు ఎంపీలు విఘాతం కలిగించిన తీరుపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తను సహించకూడదని, తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో చోటుచేసుకున్న దురదృష్టకరమైన సంఘటనలను సమీక్షించేందుకు గురువారం వీరిద్దరూ సమావేశమయ్యారని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. సభాపతులు పదేపదే చేసిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తూ అత్యున్నత చట్టసభ హుం దాతనాన్ని దిగజార్చేలా వ్యవహరించారని వీరిరువూ అభిప్రాయపడ్డట్లు అధికారులు తెలిపారు. గతంలో జరిగిన సంఘటనల ను, తీసుకున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించాలని, భవిష్యత్తు కార్యాచరణకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయని సభాపతులు అభిప్రాయపడ్డారు. -
విపక్షాలది మొసలికన్నీరు
మిర్జాపూర్: రైతులు, వారి సమస్యల విషయంలో కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ మొసలికన్నీరు కారుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వీరు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని, నీటిపారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించి అన్నదాతకు దుర్భరమైన పరిస్థితులను సృష్టించారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ సమీపంలో బాణ్‌సాగర్ కెనాల్ ప్రాజెక్టును ప్రారంభించడంతోపాటు, మిర్జాపూర్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన (మొత్తంగా రూ.4వేల కోట్ల అభివృద్ధి పనులకు) చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పుడు రైతుల సమస్యలపై మొసలికన్నీరు కారుస్తూ.. రాజకీయాలు చేస్తున్న వారంతా అధికారంలో ఉన్నప్పుడు సరైన కనీస మద్దతు ధర ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు. కపటప్రేమను నటిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల రైతుల ఆదాయం రెట్టింపయ్యే రోజులు మరెంతో దూరంలో లేవన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయిన విషయాన్ని మోదీ గుర్తు చేస్తూ.. ‘ఈ బాణ్‌సాగర్ ప్రాజెక్టు ఒకటే కాదు.. రైతు సంక్షేమానికి సంబంధించిన ఎన్నో ప్రాజెక్టులను ఆపడం, పెండింగ్‌లో పెట్టడం, పక్కదారి పట్టించడం వంటి ఎన్నో పనులు చేశారు. ఎప్పుడూ రైతుల సమస్యలపై దృష్టిపెట్టలేదు. వారు చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే.. ఇంత కీలకమైన ప్రాజెక్టు ఎందుకు అటకెక్కింది?’ అని విమర్శించారు. 40 ఏళ్ల క్రితమే చేసుంటే..! ‘వ్యవసాయం, రైతుల పేరుతో గత ప్రభుత్వాలు ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేయడమో, కావాలని ఆలస్యం చేయడమో చేశారు. అసలు వీరు రైతుల గురించి కనీసం కూడా ఆలోచించలేదు. అందుకే ఇన్ని దశాబ్దాలుగా రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రూ.3,500 కోట్ల బాణ్‌సాగర్ ప్రాజెక్టు వల్ల మిర్జాపూర్, అలహాబాద్ ప్రాంతాలతో సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్షన్నర హెక్టార్లలో పంటసాగవుతుంది. 40 ఏళ్ల క్రితమే ఫ్రేమ్‌వర్క్ సిద్ధమైన ఈ ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తయి ఉంటే.. దశాబ్దాల క్రితం నుంచే ఎన్నో రైతు కుటుంబాలు ఆనందంగా ఉండేవి’ అని ప్రధాని పేర్కొన్నారు. యోగి నేతృత్వంలో యూపీ ప్రభుత్వం పూర్వాంచల్‌లో అభివృద్ధిని వేగవంతం చేస్తోందని ప్రశంసించారు. రైతులకు మేలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కనీస మద్దతు ధరను పెంచిందన్నారు. ‘గతంలో కూడా ఎమ్మెస్పీలను ప్రకటించారు. పత్రికలు, చానెళ్లలో ఫొటోలు వేసుకుని భారీగా ప్రచారం చేసుకున్నారు. పని చేశామని గొప్పగా చెప్పుకున్నారు. కానీ రైతుల వద్దనుంచి కొనుగోళ్లు చేయలేదు. దీంతో రైతుల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదు’ అని మోదీ విమర్శించారు. మేక్రాన్‌కూ నచ్చింది! వింధ్యా, భగీరథి పర్వతాల మధ్య ఉన్న ఈ ప్రాంతం చాలా పవిత్రమైనదని.. మొన్నటి మార్చి నెలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ వచ్చినపుడు ఈ ప్రాంత విశిష్టత, వింధ్యావాసినీ మాత ప్రాశస్త్యం తెలుసుకుని ఆశ్చర్యపోయారని కూడా మోదీ పేర్కొన్నారు. నేడు పశ్చిమబెంగాల్‌కు ప్రధాని పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో సోమవారం జరగనున్న రైతు సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. -
కాంగ్రెస్‌వి మొసలి కన్నీళ్లు : టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: పదేళ్లు అధికారంలో ఉండగా ఏ నాడూ రైతుల సంక్షేమం గురించి పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇపుడు వారి గురించి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు స్వామినాథన్ కమిటీ సిఫారసులను చెత్తబుట్టలో వేసి వాటి గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉండగా రైతుల బతుకులను చిన్నాభిన్నం చేసింది కాంగ్రెస్ నేతలేనని దుయ్యబట్టారు. ఆర్మూర్ డిక్లరేషన్ పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చినా వాటిని పెండింగులో పెట్టారని ఆరోపించారు. మధుయాష్కీ తాను ఎంపీగా ఉన్నప్పుడు తమ ప్రభుత్వాన్ని ఒప్పించి పసుపు బోర్డును ఎందుకు సాధించలేకపోయారని నిలదీశారు. నిజామాబాద్ ఎంపీ కవిత కృషి వల్లే పసుపు బోర్డు ఏర్పాటుపై కదలిక వచ్చిందని కాంగ్రెస్ నేతలు గ్రహించాలని హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఆర్మూరు డిక్లరేషన్ రైతుల సంక్షేమం కోసం చేసింది కాదని, కాంగ్రెస్ నేతలు తమ పదవుల యావతో చేసుకున్న డిక్లరేషన్ అని వ్యాఖ్యానించారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ను ప్రశంసిస్తూ సీఎం కేసీఆర్‌కు స్వామినాథన్ లేఖ రాశారని, కాంగ్రెస్ నేతలకు స్వామినాథన్ వంటి మేధావుల ప్రశంసలు కనబడడం లేదా అని ప్రశ్నించారు. రైతులకు మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. -
బీసీలపై కాంగ్రెస్‌వి మొసలి కన్నీళ్లు: కర్నె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెనకబడిన కులాల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ లోతైన అధ్యయనం చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌లో కూర్చుని బీసీలపై మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. ఎంబీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీల కోసం అన్నీ పార్టీలతో కలసి కార్యాచరణ చేపడుతుంటే కాంగ్రెస్ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కనుసన్నల్లో ఉన్న కోదండరాం నిరుద్యోగ యువతను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. -
శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం
నిన్న మొన్నటి వరకు మెత్తటి మనిషిలా కనిపించిన పన్నీర్ సెల్వం గర్జించారు. శశికళ మొసలికన్నీరు ఆపాలని, ఆమెవద్ద ఉన్న ఎమ్మెల్యేలందరినీ బయటకు వదలాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు తనకు ఫోన్లు చేస్తున్నారని, గూండాలు ఉండటం వల్ల తాము బయటకు రాలేకపోతున్నట్లు చెప్పారని ఆయన అన్నారు. వాళ్లను రిసార్టులో బంధించలేదని శశికళ చెబుతున్నారని.. అలా అయితే వాళ్లను ఇంటికి ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర హోం మంత్రి పదవి కూడా చేతిలోనే ఉన్నప్పుడు.. ఆ హోదాతో రిసార్టుకు వెళ్లి ఎమ్మెల్యేలను బయటకు తేవచ్చుగా అని మీడియా ఆయనను ప్రశ్నించగా, ఇప్పటికే రాష్ట్రంలో అసాధారాణ పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటి సమయంలో తాను ఏం చేసినా దానివల్ల అనవసరంగా సమస్యలు వస్తాయని అన్నారు. అందుకే తాను సహనంతో ఊరుకుంటున్నట్లు చెప్పారు. తమిళ సినిమాల్లో కమెడియన్ వడివేలు తనకు తానే పోలీసు జీపు ఎక్కి.. తనను జైలుకు తీసుకెళ్తున్నారని చెప్పినట్లు శశికళ తనను తాను సింహం అని చెప్పుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. 75 రోజుల పాటు జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు బయట తామంతా అక్కడే ఉత్కంఠతో వేచి చూశామని, అప్పుడు అమ్మ పక్కనే ఉన్న శశికళ ఒక్కరోజైనా బయటకు వచ్చి జయలలిత ఆరోగ్యం గురించి ఒక్క మాటైనా చెప్పారా అని ప్రశ్నించారు. 16 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారి తనను ముఖ్యమంత్రిగా చేసినప్పటి నుంచి తాను శశికళ చేతుల్లో చిత్రహింసకు గురయ్యానని అన్నారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె మేనల్లుడు దీపక్, మేనకోడలు దీపా జయకుమార్‌లను కనీసం లోపలకు రానివ్వలేదని, జయలలిత మరణించినప్పుడు కూడా దీప అర్ధరాత్రి నుంచి తెల్లవారు జామున 6.30 వరకు వేదనిలయం వద్దే వేచి చూసినా.. కనీసం అమ్మ మృతదేహాన్ని కూడా చూడనివ్వలేదని పన్నీర్ సెల్వం మండిపడ్డారు.