శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం
నిన్న మొన్నటి వరకు మెత్తటి మనిషిలా కనిపించిన పన్నీర్ సెల్వం గర్జించారు. శశికళ మొసలికన్నీరు ఆపాలని, ఆమెవద్ద ఉన్న ఎమ్మెల్యేలందరినీ బయటకు వదలాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు తనకు ఫోన్లు చేస్తున్నారని, గూండాలు ఉండటం వల్ల తాము బయటకు రాలేకపోతున్నట్లు చెప్పారని ఆయన అన్నారు. వాళ్లను రిసార్టులో బంధించలేదని శశికళ చెబుతున్నారని.. అలా అయితే వాళ్లను ఇంటికి ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్ర హోం మంత్రి పదవి కూడా చేతిలోనే ఉన్నప్పుడు.. ఆ హోదాతో రిసార్టుకు వెళ్లి ఎమ్మెల్యేలను బయటకు తేవచ్చుగా అని మీడియా ఆయనను ప్రశ్నించగా, ఇప్పటికే రాష్ట్రంలో అసాధారాణ పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటి సమయంలో తాను ఏం చేసినా దానివల్ల అనవసరంగా సమస్యలు వస్తాయని అన్నారు. అందుకే తాను సహనంతో ఊరుకుంటున్నట్లు చెప్పారు. తమిళ సినిమాల్లో కమెడియన్ వడివేలు తనకు తానే పోలీసు జీపు ఎక్కి.. తనను జైలుకు తీసుకెళ్తున్నారని చెప్పినట్లు శశికళ తనను తాను సింహం అని చెప్పుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. 75 రోజుల పాటు జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు బయట తామంతా అక్కడే ఉత్కంఠతో వేచి చూశామని, అప్పుడు అమ్మ పక్కనే ఉన్న శశికళ ఒక్కరోజైనా బయటకు వచ్చి జయలలిత ఆరోగ్యం గురించి ఒక్క మాటైనా చెప్పారా అని ప్రశ్నించారు. 16 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారి తనను ముఖ్యమంత్రిగా చేసినప్పటి నుంచి తాను శశికళ చేతుల్లో చిత్రహింసకు గురయ్యానని అన్నారు.
జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె మేనల్లుడు దీపక్, మేనకోడలు దీపా జయకుమార్‌లను కనీసం లోపలకు రానివ్వలేదని, జయలలిత మరణించినప్పుడు కూడా దీప అర్ధరాత్రి నుంచి తెల్లవారు జామున 6.30 వరకు వేదనిలయం వద్దే వేచి చూసినా.. కనీసం అమ్మ మృతదేహాన్ని కూడా చూడనివ్వలేదని పన్నీర్ సెల్వం మండిపడ్డారు.