ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలి | Opposition partys shedding crocodile tears, must apologise | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలి

Published Fri, Aug 13 2021 6:17 AM | Last Updated on Fri, Aug 13 2021 6:59 AM

Opposition partys shedding crocodile tears, must apologise - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు మొసలి కన్నీరు మాని పార్లమెంటులో వారి ప్రవర్తనపై దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, ప్రభుత్వం ఎంపీలపై దాడి చేసిందని విపక్షాలు నిరసన ర్యాలీలో విమర్శలు గుప్పించగా దీనికి కౌంటర్‌గా 8 మంది కేంద్ర మంత్రులు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మార్షల్స్‌పై విపక్ష సభ్యులు దురుసుగా ప్రవర్తించారని ప్రత్యారోపణ చేశారు. కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్‌ జోషి, అనురాగ్‌ ఠాకూర్, నఖ్వీ, భూపేంద్ర యాదవ్, అర్జున్‌ మేఘ్వాల్, వి.మురళీధరన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రజాహితంపై వారికి చింతలేదు
అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ ‘దేశ ప్రజలు తమ సమస్యలు పార్లమెంటు సమావేశాల్లో చర్చకు వస్తాయని ఆశించారు. దేశ ప్రజల హితం కానీ, రాజ్యాంగ విలువలపై గానీ వారికి చింత లేదు. విపక్షాలు మొసలి కన్నీరు కార్చడం ఆపి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని పేర్కొన్నారు. ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ ‘పార్లమెంటు సమావేశాల ముందు అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడే విపక్షాలు సభను నడవనివ్వమన్న సంకేతాలు ఇచ్చాయి. సభను నడవనివ్వబోమని చెప్పేశారు. మేం చాలా సందర్భాల్లో వారితో మాట్లాడాం. కనీసం మొదటి రోజు మంత్రి మండలిలోని నూతన సభ్యుల పరిచయ కార్యక్రమాన్ని అనుమతించాలని కోరాం. అందుకు కూడా ఒప్పుకోలేదు.

రెండు సభల్లో బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశాల్లో వారు వారి డిమాండ్లను పెట్టారు. స్వల్పకాలిక చర్చలు జరపాలని కోరారు. ధరల పెరుగుదల, కోవిడ్, వ్యవసాయం తదితర అంశాలపై చర్చకు చైర్మన్‌ అనుమతించారు. పెగసస్‌ వంటి అంశాలను పట్టుబట్టుతూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సభాకార్యకలాపాలకు విఘాతం కలిగించారు. ముఖ్యమైన బిల్లులను కూడా చర్చకు అనుమతించలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇలా ఎన్ని చేశారో రికార్డులు చూడొచ్చు.. ఆనాడు ఏపీ విభజన వంటి ముఖ్యమైన బిల్లులు కూడా గందరగోళంలో ఆమోదింపజేసుకున్నారు’ అని దుయ్యబట్టారు. ‘నాలుగో తేదీన ఆరుగురు సభ్యులను సస్పెండ్‌ చేయగా.. గ్లాసులు పగలగొట్టుకుని లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. అధికారులకు గాయాలయ్యేలా చేశారు.

రాజ్యసభలో టేబుల్‌ ఎక్కి ఆందోళన చేశారు. అది బిల్లుపై చర్చ కూడా కాదు. చర్చకు సిద్ధంగా ఉంటే సభను సోమవారం వరకూ నిర్వహిస్తామని చెప్పాం. కానీ వారు సహకరించకపోగా.. ఇన్సూరెన్స్‌ బిల్లు, ఓబీసీ బిల్లు ఆమోదింపజేసుకుంటే మంగళవారం నాటి పరిణామాల కంటే తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడేమో మహిళా ఎంపీలపై పురుష మార్షల్స్‌ దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని రాహుల్‌ గాంధీ ప్రకటన చేశారు. దేశ ప్రజలు చూస్తున్నారు. వారికి ఏమాత్రం ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేం రాజ్యసభ చైర్మన్‌ను కూడా కోరాం. విపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాం.. ఏపార్టీ అధికారంలో ఉన్నా ఇది పునరావృతం కాకూడదు..’ అని పేర్కొన్నారు.

మార్షల్స్‌పై దాడులకు దిగారు: గోయల్‌
రాజ్యసభలో సభా నాయకుడు పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను మంటగలిపారని మండిపడ్డారు. సభ ఆస్తులను ధ్వంసం చేశారని, మార్షల్స్‌పై దురుసుగా ప్రవర్తించారని, భౌతిక దాడులకు దిగారని, వారి దుష్ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 12 మంది మహిళా మార్షల్స్, 18 మంది పురుష మార్షల్స్‌.. మొత్తం 30 మంది మార్షల్స్‌ మాత్రమే ఉన్నారని వివరించారు. విపక్షాలది కేవలం డ్రామా అని, ఓబీసీ బిల్లు విషయంలో  కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చర్చను సాగనిచ్చారని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఈ మంత్రులంతా రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యని కలిసి సభలో పార్లమెంటరీ సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ దురదృష్టకరమైన రీతిలో ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.  

బయటివారెవరూ లేరు..
ఉభయ పక్షాలు తనతో భేటీ అయిన అనంతరం రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు అధికారులతో సమావేశం నిర్వహించి మంగళవారం నాటి పరిణామాలను మరోసారి ఆరాతీశారు. బయటివారెవరూ సభలోకి రాలేదని, తొలుత 14 మంది మార్షల్స్‌ ఉన్నారని, క్రమంగా సభలో పరిస్థితిని బట్టి మార్షల్స్‌ సంఖ్య 42కు చేరిందని వారు చైర్మన్‌కు నివేదించారు.

క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే!
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చోటు చేసుకున్న సంఘటనలు, సభాకార్యకలాపాలకు కొందరు ఎంపీలు విఘాతం కలిగించిన తీరుపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తను సహించకూడదని, తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో చోటుచేసుకున్న దురదృష్టకరమైన సంఘటనలను సమీక్షించేందుకు గురువారం వీరిద్దరూ సమావేశమయ్యారని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. సభాపతులు పదేపదే చేసిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తూ అత్యున్నత చట్టసభ హుం దాతనాన్ని దిగజార్చేలా వ్యవహరించారని వీరిరువూ అభిప్రాయపడ్డట్లు అధికారులు తెలిపారు. గతంలో జరిగిన సంఘటనల ను, తీసుకున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించాలని, భవిష్యత్తు కార్యాచరణకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయని సభాపతులు అభిప్రాయపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement