రాజ్యసభలో మణిపూర్ అంశాన్ని చర్చించాలని వేడుకుంటున్న విపక్ష సభ్యులు
న్యూఢిల్లీ: పార్లమెంటులో మణిపూర్ ప్రతిష్టంభన వీడకపోగా గురువారం పీటముడి మరింతగా బిగుసుకుంది. ఈ విషయమై విపక్షాలను అనునయించేందుకు గురువారం అధికార బీజేపీ ఒక మెట్టు దిగినా లాభం లేకపోయింది. లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇతర ప్రతిపక్ష నేతలతో కేంద్రం తరఫున రాజ్యసభ నాయకుడు పీయూష్ గోయల్, మరో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అరగంటకు పైగా చర్చలు జరిపారు. కానీ తమ డిమాండ్లపై పట్టు వీడేందుకు విపక్షాలు ససేమిరా అన్నాయి.
మణిపూర్ హింసాకాండపై ప్రధాని ఉభయ సభల్లోనూ ప్రకటన చేయడంతో పాటు పార్లమెంటులో లోతైన చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టాయి. దాంతో చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. 267 నిబంధన కింద ఈ అంశంపై చర్చకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినా, ప్రధాని ప్రకటన డిమాండ్‌కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరాదని పట్టుదలగా ఉంది. అంతగా అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారని చెబుతోంది.
చివరికి కేంద్రం మరింత దిగొచ్చి మణిపూర్‌పై 176 నిబంధన కింద ఆగస్టు 11న రాజ్యసభలో స్వల్ప వ్యవధి చర్చకు సిద్ధమని ప్రతిపాదించింది. విపక్ష ఇండియా కూటమి మాత్రం 267, 176 నిబంధనల్లో దేని కిందా చర్చకు ఒప్పుకునేది లేదంటోంది. ‘‘నిబంధనతో మాకు నిమిత్తం లేదు. ఇరు పక్షాలకూ ఆమోదయోగ్యమైన నిబంధన కింద పూర్తిస్థాయి చర్చ మాత్రం జరిగి తీరాల్సిందే’’ అని డిమాండ్ చేస్తోంది. మణిపూర్‌పై ఏదోలా పార్లమెంటులో చర్చ జరిగి ప్రతిష్టంభనకు తెరపడవచ్చంటున్నారు. తాము ప్రతిపాదించిన మధ్యేమార్గానికి మోదీ సర్కారు అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్టు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment