గాందీజీ విగ్రహం వద్ద విపక్షాల నిరసన దృశ్యం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో మణిపూర్ హింసాకాండ మంటలు కొనసాగుతున్నాయి. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే సమాధానం ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళనలు, నిరసనలతో ఉభయ సభలు స్తంభిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వరుసగా మూడో రోజూ సోమవారం సైతం ఇదే అంశంపై విపక్షాలు ఉభయ సభలను అడ్డుకున్నాయి. దీంతో పలుమార్లు సభలను వాయిదా వేయాల్సి వచి్చంది. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ సస్పెన్షన్ వ్యవహారం రాజ్యసభను మరింత వేడెక్కించింది.
డిమాండ్‌పై వెనక్కి తగ్గని విపక్షాలు
మణిపూర్ ఘటనలపై చర్చించాలని కోరుతూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు లోక్‌సభలో సోమవారం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలో సమాధానం ఇవ్వాలని ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ డిమాండ్ చేశారు. ఆయనకు మద్దతుగా విపక్ష ఎంపీలు తమ స్థానాల్లోంచి లేచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ ఓంబిర్లా స్పందిస్తూ.. దీనిపై సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే కేంద్రం తరఫున ఎవరూ సమాధానమివ్వాలో మీరు ఆదేశించలేరని అన్నారు. ఇదే సమయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నా«థ్ సింగ్ మాట్లాడుతూ.. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోగా మరింత తీవ్రస్వరంతో నినాదాలు చేశారు. ‘ఇండియా ఫర్ మణిపూర్’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. లోక్‌సభలో బీజేపీ ఎంపీలు కూడా ఎదురుదాడికి దిగారు. పశి్చమ బెంగాల్, రాజస్తాన్‌లో మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష ఎంపీల నినాదాల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నినాదాల హోరు ఆగకపోవడంతో కొద్దిసేపటికే సభను మధ్యాహ్నం 12 గంటల దాకా, ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల దాకా.. అనంతరం మంగళవారానికి వాయిదా వేశారు. నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు–2023, నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కమిషన్ బిల్లు–2023, కానిస్టిట్యూషన్(ఎస్సీలు) ఆర్డర్(సవరణ) బిల్లు–2023ని కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
సంజయ్ సింగ్ సస్పెన్షన్
మణిపూర్ హింసపై రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్), కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకూ సభ వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా ఆందోళన కొనసాగించారు. సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్న ‘ఆప్’ ఎంపీ సంజయ్ సింగ్ తీరుపై చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. దీంతో సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేయాలనే తీర్మానాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు.
దీనిని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో వర్షాకాల సమావేశాల్లో సభ జరిగే మిగిలిన దినాలకు సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ‘ఆప్’ ఎంపీని సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. దీంతో సభను చైర్మన్ వాయిదా వేశారు. ఆ తర్వాత అన్ని పారీ్టల సభాపక్ష నేతలతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభ సక్రమంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో సజావుగా చర్చ జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని హోంమంత్రి అమిత్ అన్నారు. ఆయన సోమవారం లోక్‌సభలో మాట్లాడారు. మణిపూర్ అంశంలో నిజాలు బయటకు రావాల్సిందేనని, వాస్తవాలు దేశ ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు.
పార్లమెంట్ వెలుపల నిరసన
మణిపూర్‌లో మహిళలపై అకృత్యాలపై ప్రధాని నరేంద్ర మోదీ సమగ్ర ప్రకటన చేయాలని ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ పార్లమెంట్ ఆవరణలో సోమవారం ఆందోళన చేపట్టింది. ‘మణిపూర్ కోసం భారత్’, ‘భారత్ డిమాండ్ మణిపూర్’ అని రాసి ఉన్న ప్లకార్డులు, బ్యానర్‌లు చేతపట్టుకుని ప్రతిపక్ష ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment