న్యూఢిల్లీ: పెగసస్ నిఘా వ్యవహారం, కొత్త వ్యవసాయ చట్టాలతోపాటు ఇతర అంశాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు తమ నిరసన, నినాదాలను కొనసాగించాయి. లోక్‌సభలో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే ప్రభుత్వం ఆరు బిల్లులను ప్రవేశపెట్టింది. వీటిలో మూడు బిల్లులు ఆమోదం పొందాయి. తమ డిమాండ్లపై చర్చించాలంటూ సభా కార్యకలాపాలకు ప్రతిపక్షాలు అడ్డు తగులుతుండడంతో పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. సభ సజావుగా సాగకున్నా బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదిస్తుండడం పట్ల కాంగ్రెస్ పార్టీ సభ్యులు అధిర్ రంజన్ చౌదరి, మనీష్ తివారీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య నియమాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.
10 నిమిషాల్లోనే బిల్లులా?
లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్(అమెండ్‌మెంట్) బిల్లు–2021, ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(అమెండ్‌మెంట్) బిల్లు–2021, కానిస్టిట్యూషన్(షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (అమెండ్‌మెంట్) బిల్లు–2021, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి(అమెండ్‌మెంట్) బిల్లు–2021, నేషనల్ కమిషనర్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్(అమెండ్‌మెంట్) బిల్లు–2021తోపాటు కానిస్టిట్యూషన్ (127వ సవరణ) బిల్లు–2021ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే బిల్లులను ప్రవేశపెట్టారని ఆర్‌ఎస్‌పీ సభ్యుడు ప్రేమచంద్రన్ విమర్శించారు. ఇలా చేయడాన్ని దోసెలు వేయడంతో పోల్చారు.
లోక్‌సభ సోమవారం ఉదయం ప్రారంభమైన తర్వాత స్పీకర్ బిర్లా క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన వారికి సభ తరపున నివాళులరి్పంచారు. టోక్యో ఒలంపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు ఓంబిర్లా అభినందనలు తెలిపారు. పెగసస్‌పై కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మేఘవాల్ మధ్య వాగ్వాదం జరిగింది. పెగసస్, సాగు చట్టాలపై ప్రతిపక్షాలు పట్టు వీడకుండా ఆందోళనలు కొనసాగిస్తుండడంతో సోమవారం రాజ్యసభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ట్యాకేషన్ చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికంటే కేవలం కొన్ని నిమిషాల ముందు సప్లిమెంటరీ అజెండాను అందజేయడం ఏమిటని కాంగ్రెస్ ఎంపీ ఖర్గే ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు విధానాలను తాము అంగీకరించబోమంటూ కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు.
లోక్‌సభలో.. రాష్ట్రాలకు ‘ఓబీసీ’ అధికారాల పునరుద్ధరణ బిల్లు
ఇతర వెనకబడిన తరగతుల జాబితాను సొంతంగా సిద్ధంచేసే అధికారాలను రాష్ట్రాలకు మళ్లీ కట్టబెట్టేందుకు ఉద్దేశించిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లు–2021ను కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సమాఖ్య స్ఫూర్తిని మరింతగా పెంపొందించేందుకు వీలుగా సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతు(ఎస్‌ఈబీసీ)ల జాబితాలను రాష్ట్రాలు సొంతంగా రూపొందించుకునేందుకుగాను ఆర్టికల్ 342ఏ, తదనుగుణంగా ఆర్టికల్ 338బీ, 366లకు రాజ్యంగ సవరణలు చేయాల్సి ఉందని మంత్రి చెప్పారు. బిల్లును సభలో ప్రవేశపెట్టగానే కొందరు కాంగ్రెస్ సభ్యులు సహా చాలా మంది సభ్యులు ఈ బిల్లుకు తమ పూర్తి మద్దతు తెలిపారు. పెగసస్ అంశంపై వెల్‌లోకి దూసుకెళ్లి సభ కొనసాగుతున్నంతసేపూ నిరసన తెలుపుతున్న సభ్యులు నిరసనలు ఆపి వెనక్కి వచ్చి కూర్చుని బిల్లుకు మద్దతు పలకడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment