న్యూఢిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల యూకేలో చేసిన వ్యాఖ్యల పట్ల సోమవారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. రాహుల్ వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు డిమాండ్ చేయగా, గౌతమ్ అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందేనని కాంగ్రెస్ పునరుద్ఘాటించింది. ఇరు పక్షాల నడుమ వాగ్వాదాలతో ఉభయ సభలు స్తంభించాయి. నినాదాలు, అరుపులు కేకలతో హోరెత్తిపోయాయి. ఎలాంటి కార్యకలాపాలు జరక్కుండానే లోక్‌సభ, రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడ్డాయి.
రాహుల్‌కు కొంతైనా సిగ్గుంటే..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం పునఃప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు లోక్‌సభలో సంతాపం ప్రకటించారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. భారత ప్రజాస్వామ్యంపై ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారని, లండన్‌లో మన దేశ ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని దుయ్యబట్టారు. విదేశీ శక్తులే భారత్‌ను కాపాడాలంటూ రాహుల్ మాట్లాడడం ఏమిటని నిలదీశారు. రాహుల్ వ్యాఖ్యలను లోక్‌సభ మొత్తం ఖండించాలని, ఈ దిశగా చొరవ తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు.
రాహుల్‌ను సభకు రప్పించి, క్షమాపణ చెప్పించాలని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి కొంతైనా సిగ్గుంటే సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉందని, రోజురోజుకూ బలోపేతం అవుతోందని వెల్లడించారు. సభ సజావుగా సాగేలా సభ్యులంతా సహకరించాలని సూచించారు. నినాదాలు ఆపాలని కోరారు. మన ప్రజాస్వామ్యంపై ప్రజలకు గొప్ప విశ్వాసం ఉందన్నారు. సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.
రాజ్యసభలో అదే రగడ
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రాజ్యసభలోనూ అధికార, విపక్ష సభ్యుల మధ్య రగడ జరిగింది. ఎవరూ శాంతించకపోవడంతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను రాజ్యసభ ఖండించాలని డిమాండ్ చేశారు. పీయూష్ గోయల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఖర్గే కోరారు.
రాహుల్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మీడియాతో మా ట్లాడారు. తుక్డే–తుక్డే గ్యాంగ్ తరహాలో మాట్లాడిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలన్నా రు. ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు చేయా లని డిమాండ్ చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని రాహుల్ కించపర్చారని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆక్షేపించారు. పార్లమెంట్‌కు రాహుల్ క్షమాపణ చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment