Attack on democracy
-
విపక్షాల ఐక్యతా రాగం..చేతులు కలిపిన 19 పార్టీలు
న్యూఢిల్లీ: బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం నిరంతర దాడికి గురవుతోందంటూ కాంగ్రెస్‌తో పాటు 19 విపక్ష పార్టీలు మండిపడ్డాయి. గురువారం బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డ అనంతరం పార్లమెంటు ప్రాంగణం నుంచి విజయ్ చౌక్ దాకా ‘తిరంగా మార్చ్’ పేరిట నిరసన ర్యాలీ జరిపాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఆప్, ఎన్సీపీ, శివసేన (యూబీటీ), వామపక్షాలు, ఐయూఎంఎల్, ఆరెస్పీ తదితర పార్టీలు ఇందులో పాల్గొన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో సోనియాగాంధీతో పాటు ఎంపీలంతా త్రివర్ణ పతాకం చేబూని నినాదాలు చేస్తూ సాగారు. తమ ఐక్యతను పటిష్టపరుచుకుంటూ మోదీ సర్కారుపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని వారంతా ప్రకటించడం విశేషం! విపక్షాల ఐక్యతను మరింత ముందుకు తీసుకెళ్లడమే గాక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఉమ్మడిగా పోరాడతామని ఖర్గే ఈ సందర్భంగా ప్రకటించారు. అదానీ ఉదంతం, కులగణన ఎన్నికల్లో విపక్షాలకు ప్రధానాంశాలుగా మారతాయా అని ప్రశ్నించగా అన్ని పార్టీల అధ్యక్షులూ చర్చించుకుని వాటిపై నిర్ణయానికి వస్తారని బదులిచ్చారు. కులగణన తమ ఎజెండాలో అతి ముఖ్యమైన అంశమన్నారు. లోక్‌సభ స్పీకర్ ఇచ్చిన మర్యాదపూర్వక విందును విపక్ష నేతలు సంయుక్తంగా బహిష్కరించారు. తర్వాత కాన్స్టిట్యూషన్ క్లబ్లో 19 పార్టీల నేతలూ సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు! మోదీ సర్కారుది అహంభావపూరిత వైఖరి అంటూ దుయ్యబట్టారు. అదిలాగే కొనసాగితే దేశం పూర్తిస్థాయి నియంతృత్వంలో మగ్గిపోతుందన్నారు. కొంతకాలంగా కాంగ్రెస్‌తో వేదిక పంచుకోవడానికి ఇష్టపడని తృణమూల్, బీఆర్ఎస్, ఆప్, సమాజ్‌వాదీ పార్టీ కూడా ర్యాలీలోనూ, మీడియా సమావేశంలోనూ కలిసి పాల్గొనడం విశేషం! బడ్జెట్ సమావేశాలు ఆసాంతం ప్రభుత్వంపై విపక్షాలు సమైక్యంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మార్చి 13న రెండో విడత సమావేశాలు మొదలైనప్పటి నుంచీ సంయుక్తంగా నిరసనలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నాయి. మాటల్లోనే ప్రజాస్వామ్యం: ఖర్గే రాజ్యాంగం, న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తామంతా పోరాడుతున్నామని ఖర్గే ప్రకటించారు. మోదీ సర్కారు ప్రవచిస్తున్న ప్రజాస్వామ్య స్ఫూర్తి మాటలకే పరిమితమవుతోందని మండిపడ్డారు. ‘‘అదానీ అవినీతిపై బదులివ్వాల్సి వస్తుందనే భయంతో బడ్జెట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోవాలని బీజేపీ ఆశించింది. అందుకు విపక్షాలను బాధ్యులను చేయజూడటం దారుణం. రూ.50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను కేవలం 12 నిమిషాల చర్చతో ఆమోదించడమా? సభల్లో ఎన్నిసార్లు నోటీసులిచ్చినా విపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. ఇలా జరగడం నా 52 ఏళ్ల ప్రజా జీవితంలో తొలిసారి. 19 విపక్షాల్లో 18 పార్టీలు అదానీ అంశంపై కేంద్రాన్ని నిలదీశాయి. ఆయన సంపద కేవలం రెండున్నరేళ్లలో రూ.12 లక్షల కోట్లకు ఎలా పెరిగిందో చెప్పాలని పట్టుబట్టాయి. సభలో బీజేపీదే పూర్తి మెజారిటీ. జేపీసీ వేసినా ఎక్కువ మంది వాళ్లే ఉంటారు. అయినా విచారణకు వెనకాడుతున్నారంటే దాల్ మే కుచ్ కాలా హై’’ అన్నారు. అదానీతో మోదీకి, బీజేపీకి అక్రమ బంధం ఉందని ఆరోపించారు. ‘‘రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడగానే వాయువేగంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కానీ బీజేపీ అమ్రేలీ ఎంపీకి మూడేళ్ల జైలు శిక్ష పడి 16 రోజులైనా ఆయనపై వేటు వేయలేదు’’ అని మండిపడ్డారు. విపక్షాలన్నీ విభేదాలను పక్కన పెట్టి ఒక్కతాటిపైకి వస్తున్నాయి. మా ఐక్యతను ఇప్పుడు దేశమంతా చూస్తోంది. మేం నానాటికీ బలపడుతున్నాం. మ మ్మల్ని విడదీసేందుకు బీజేపీ చేసిన ప్ర యత్నాలు విఫలమయ్యాయి. దీన్నెలా ముందుకు తీసుకెళ్లాలో అంతా కలిసి నిర్ణయించుకుంటాం. విపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహించాలన్నది ప్రశ్న కాదు – కె.కేశవరావు, బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఊరుకుంటామేమో గానీ అదానీపై నిలదీస్తే మాత్రం సహించబోమని బీజేపీ తన ప్రవర్తనతో రుజువు చేసింది. – సంజయ్‌సింగ్, ఆప్ భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో రాహుల్‌గాంధీని చూసి బీజేపీ భయపడుతోంది. అధికార పక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడాన్ని తొలిసారిగా చూశాం – టి.ఆర్.బాలు, డీఎంకే -
భారత వ్యతిరేకి రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ లండన్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత వ్యతిరేక టూల్కిట్లో రాహుల్ శాశ్వత భాగస్వామిగా మారాడని ధ్వజమెత్తారు. భారత్‌కు బద్ధవ్యతిరేకి అయిన జార్జి సోరోస్ భాషలోనే రాహుల్ మాట్లాడాడని మండిపడ్డాడు. మన దేశానికి వ్యతిరేకంగా విదేశీ శక్తులు పెద్ద కుట్ర పన్నుతున్నాయని, ఇందులో కాంగ్రెస్‌తోపాటు సోకాల్డ్ వామపక్ష ఉదారవాదులు కూడా భాగమేనని ఆరోపించారు. దేశాన్ని ద్వేషించే కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ భాషను వాడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు నడ్డా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని విదేశీ శక్తులను కోరిన రాహుల్ గాంధీ దేశ సార్వభౌమత్వంపై దాడి చేశారని, ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్‌లో జోక్యం చేసుకోవాలంటూ అమెరికా, యూరప్ దేశాలను కోరడం కంటే సిగ్గుచేటు మరొకటి ఉండదన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని రాహుల్ ఇంకా అర్థం చేసుకోలేదని, ప్రజలపై ఆయనకు విశ్వాసం లేదని విమర్శించారు. భారత్‌ను ఆర్థికంగా, వ్యూహాత్మకంగా దెబ్బకొట్టడాన్ని విదేశీ కుట్రదారులు పనిగా పెట్టుకున్నారని, రాహుల్ గాంధీ సైతం వారితో చేతులు కలిపాడని దుయ్యబట్టారు. విదేశీ గడ్డపై ఆయన చేసిన పనిని స్వతంత్ర భారతదేశంలో గతంలో ఏ నాయకుడూ చేయలేదని నడ్డా వెల్లడించారు. రాహుల్ ధోరణి దేశంలో ప్రతి ఒక్కరి మనసులను గాయపర్చిందని చెప్పారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులు దేశంలో బలహీన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాయని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడల్లా దేశ వ్యతిరేక ముఠాలు చురుగ్గా మారుతున్నాయని, భారత్‌ను అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా టూల్‌కిట్‌తో ముందుకొస్తున్నాయని జేపీ నడ్డా ఆక్షేపించారు. భారత్‌లో దృఢమైన ప్రజాస్వామ్యం, నిర్ణయాత్మక ప్రభుత్వం ఉన్నాయని, దుష్టశక్తుల ఆటలు సాగవని హెచ్చరించారు. రాహుల్ వ్యాఖ్యలు జాతివ్యతిరేకం కాదు : శశిథరూర్ తమ నేత రాహుల్ గాంధీ బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి జాతి వ్యతిరేకత లేదని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. భారత ప్రజాస్వామ్యంలోకి విదేశీ శక్తుల్ని రాహుల్ ఎందుకు రానిస్తారని ప్రశ్నించారు. శుక్రవారం ఇండియా టుడే సదస్సులో శశిథరూర్ రాహుల్ వ్యాఖ్యలు పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేసేటంత ప్రధానమైనవా ఆలోచిస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. దేశంలో ఎన్నో ప్రజా సమస్యల్ని గాలికొదిలేసిన బీజేపీ రాహుల్ నుంచి క్షమాపణ కోరుతూ రాజకీయం చేయడం విడ్డూరమన్నారు. -
నాలుగో రోజూ ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, అదానీ గ్రూప్ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేస్తున్నాయి. తమ డిమాండ్ల నుంచి అధికార, విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా మాట్లాడిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ క్షమాపణ చెప్పాలని అధికార బీజేపీ ఎంపీలు, అదానీ అంశంపై విచారణ కోసం జేపీసీ ఏర్పాటు చేయాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వరుసగా నాలుగో రోజు గురువారం సైతం స్తంభించాయి. . రాహుల్ గాంధీ రాక లోక్‌సభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే యథావిధిగా అధికార, ప్రతిపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. పరస్పరం వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి ప్రవేశించారు. దీంతో కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే స్పీకర్ బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. లోక్‌సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభలోకి ప్రవేశించారు. ‘లండన్’ వ్యాఖ్యల తర్వాత ఆయన సభకు రావడం ఇదే మొదటిసారి. అధికార బీజేపీ, విపక్ష ఎంపీలు నినాదాలు ఆపలేదు. దంతో స్పీకర్ సభను మరుటి రోజుకు వాయిదా వేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, అరుపులతో రాజ్యసభ స్తంభించింది. క్షమాపణ చెప్పాలి: మంత్రులు భారత ప్రజాస్వామ్యంపై బ్రిటన్‌లో చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషీ డిమాండ్ చేశారు. అంతకంటే ముందు ఆయన తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయాలన్నారు. గతంలో ఎంతోమంది సీనియర్ నాయకులు పార్లమెంట్లో క్షమాపణ చెప్పారని వారు గుర్తుచేశారు. అదానీపై చర్చను ఎగ్టొట్టడానికే: ఖర్గే అదానీపై, పరిపాలనలో వైఫల్యాలపై పార్లమెంట్లో చర్చ జరగకుండా చూడాలన్నదే నరేంద్ర మోదీ ప్రభుత్వ కుతంత్రమని ఖర్గే ధ్వజమెత్తారు. అందుకే పార్లమెంట్ కార్యకలాపాలకు అడ్డు తగులుతోందని ఆరోపించారు. ఆయన గురువారం పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడారు. తాము బుధవారం పార్లమెంట్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయం దాకా శాంతియుతంగా ప్రదర్శన చేపడితే దుర్మార్గంగా అడ్డుకున్నారని ఆక్షేపించారు. ముందు వరుసలో మహిళా కానిస్టేబుళ్లను ఉంచారని అన్నారు. కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నిలదీద్దాం రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చాంబర్లో గురువారం విపక్ష నేతలు సమావేశమమయ్యారు. పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించుకున్నారు. కలిసికట్టుగా ఉంటూ, ప్రజా సమస్యలపై పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌తోపాటు డీఎంకే, ఎన్సీపీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, జేడీయూ, జేఎంఎం, ఎండీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, వీసీకే, ఐయూఎంఎల్ తదితర పార్టీల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఇదిలా ఉండగా, అదానీ అంశంపై చర్చించాలని, ఈ వ్యవహాంరపై విచారణకు జేపీసీ ఏర్పాటు చేయాలని కోరుతూ పలువురు ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో నోటీసులు ఇచ్చారు. -
పార్లమెంట్లో ఆగని రగడ
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో దుమారం కొనసాగుతూనే ఉంది. అధికార, విపక్ష సభ్యుల నినాదాలు, కేకలతో ఉభయసభలు వరుసగా మూడో రోజు బుధవారం సైతం స్తంభించాయి. రాహుల్ క్షమాపణకు బీజేపీ సభ్యులు, అదానీ వ్యవహారంపై జేపీసీకి విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. దాంతో లోక్‌సభ, రాజ్యసభ మళ్లీ వాయిదా పడ్డాయి. ప్రజాస్వామ్యాన్ని అవమానించారు బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) డిమాండ్‌తో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలకు దిగారు. రాహుల్ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు సైతం నినాదాలు ప్రారంభించారు. వెల్‌లోంచి వెళ్లి సభ జరగనివ్వాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు. కార్యకలాపాలకు అడ్డు తగులుతున్న విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను మంత్రి పీయూష్ గోయల్ కోరారు. పార్లమెంట్ సభ్యుడైన ఓ వ్యక్తి విదేశాలకు వెళ్లి ఇదే పార్లమెంట్‌ను దారుణంగా కించపర్చారని రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సభ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడింది. వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష ఎంపీలు నినాదాలు కొనసాగించారు. సభ సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సభ్యులందరిపైనా ఉందని సభాపతి స్థానంలో ఉన్న భర్తృహరి మెహతాబ్ చెప్పారు. సభలో ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలకు తప్ప ప్లకార్డులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గందరగోళం కొనసాగుతుండగానే రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఇంటర్–సర్వీసెస్(కమాండ్, కంట్రోల్, డిసిప్లిన్) బిల్లు–2023ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ సభకు వచ్చి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ మన దేశాన్ని అవమానించారంటూ ప్రవాస భారతీయుల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని వెల్లడించారు. భారత్ సార్వభౌమత్వ దేశమని, మన దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలంటూ ఇతర దేశాలను రాహుల్ కోరడం ఏమిటని ప్రహ్లాద్ జోషీ ఆక్షేపించారు. అనంతరం సభ గురువారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ గందరగోళం లోక్‌సభలో కనిపించిన దృశ్యాలే రాజ్యసభలోనూ పునరావృతమయ్యాయి. లండన్‌లో చేసిన వ్యాఖ్యల పట్ల రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికారపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీలు ఎదురుదాడికి దిగారు. అరుపులు కేకలతో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమైన తర్వాత ఇరుపక్షాల నడుమ వాగ్వాదం కొనసాగింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రసంగించేందుకు ప్రయత్నించగా, బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. రాహుల్ క్షమాపణ చెప్పిన తర్వాతే కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడాలంటూ నినాదాలు చేశారు. సభ్యులంతా శాంతించాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పదేపదే కోరినా ఫలితం లేకుండాపోయింది. సభ ముందుకు సాగే అవకాశాలు లేకపోవడంతో మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ క్షమాపణ ప్రసక్తే లేదు: ఖర్గే రాహుల్ వ్యాఖ్యలపై ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలపై గతంలో ప్రధాని మోదీ విదేశాల్లో చేసిన వ్యాఖ్యలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎదురుదాడికి దిగారు. ‘‘భారత్‌లో పుట్టినందుకు గతంలో మీరంతా సిగ్గుతో తలదించుకునేవారు. అదో పాపంగా భావించారు. జీవిస్తున్నారు అని ప్రధాని హోదాలో చైనాలో మోదీ అన్నారు. రాహుల్ మాటల్లో తప్పేంలేదు. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు’’ అని స్పష్టంచేశారు. ‘ భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రాన్ని అణగదొక్కుతున్నారు. నిజం మాట్లాడితే జైలు పంపుతున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని చంపడం కాదా?’’ అన్నారు. -
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం... దద్దరిల్లిన పార్లమెంట్
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల యూకేలో చేసిన వ్యాఖ్యల పట్ల సోమవారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. రాహుల్ వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు డిమాండ్ చేయగా, గౌతమ్ అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందేనని కాంగ్రెస్ పునరుద్ఘాటించింది. ఇరు పక్షాల నడుమ వాగ్వాదాలతో ఉభయ సభలు స్తంభించాయి. నినాదాలు, అరుపులు కేకలతో హోరెత్తిపోయాయి. ఎలాంటి కార్యకలాపాలు జరక్కుండానే లోక్‌సభ, రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడ్డాయి. రాహుల్‌కు కొంతైనా సిగ్గుంటే.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం పునఃప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు లోక్‌సభలో సంతాపం ప్రకటించారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. భారత ప్రజాస్వామ్యంపై ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారని, లండన్‌లో మన దేశ ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని దుయ్యబట్టారు. విదేశీ శక్తులే భారత్‌ను కాపాడాలంటూ రాహుల్ మాట్లాడడం ఏమిటని నిలదీశారు. రాహుల్ వ్యాఖ్యలను లోక్‌సభ మొత్తం ఖండించాలని, ఈ దిశగా చొరవ తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. రాహుల్‌ను సభకు రప్పించి, క్షమాపణ చెప్పించాలని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి కొంతైనా సిగ్గుంటే సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉందని, రోజురోజుకూ బలోపేతం అవుతోందని వెల్లడించారు. సభ సజావుగా సాగేలా సభ్యులంతా సహకరించాలని సూచించారు. నినాదాలు ఆపాలని కోరారు. మన ప్రజాస్వామ్యంపై ప్రజలకు గొప్ప విశ్వాసం ఉందన్నారు. సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. రాజ్యసభలో అదే రగడ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రాజ్యసభలోనూ అధికార, విపక్ష సభ్యుల మధ్య రగడ జరిగింది. ఎవరూ శాంతించకపోవడంతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను రాజ్యసభ ఖండించాలని డిమాండ్ చేశారు. పీయూష్ గోయల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఖర్గే కోరారు. రాహుల్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మీడియాతో మా ట్లాడారు. తుక్డే–తుక్డే గ్యాంగ్ తరహాలో మాట్లాడిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలన్నా రు. ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు చేయా లని డిమాండ్ చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని రాహుల్ కించపర్చారని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆక్షేపించారు. పార్లమెంట్‌కు రాహుల్ క్షమాపణ చెప్పాలన్నారు. -
ప్రజాస్వామ్యంపై దాడి
వాషింగ్టన్: అమెరికాలో గతంలోలేనంతగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నిలిచిన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆమె ఆదివారం ప్రారంభించారు. ట్రంప్ విధానాలపై ధ్వజమెత్తారు. దేశ ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడి అనంతరం ఇప్పుడు మళ్లీ అమెరికా మార్పు ముంగిట్లోకి వెళ్తోందనీ, ఆ మార్పును ప్రజలు స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు. ‘స్వేచ్ఛా పాత్రికేయంపై దాడి, ఎగతాళి చేసే నాయకులు మనకు ఉన్నప్పుడు, మన ప్రజాస్వామ్య వ్యవస్థలను వారు నీరుగారుస్తున్నప్పడు.. అది మన అమెరికా కాదు’ అంటూ ట్రంప్‌నుద్దేశించి అన్నారు. హిందువుననే విమర్శలు తులసీ గబార్డ్ హిందువునైనందునే తనపై విమర్శలు చేస్తూ తన చిత్తశుద్ధిని శంకిస్తున్నారని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ బరిలో నిలిచిన మహిళ తులసీ గబార్డ్ ఆవేదన వ్యక్తం చేశారు.‘ ప్రధాని మోదీతో నా భేటీని రుజువుగా చూపి నేను హిందూ జాతీయవాదినంటూ విమర్శలు చేస్తున్నారు. మోదీతో అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు ఒబామా, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీసహా ఎందరో భేటీ అయ్యారు. వారినెవ్వరూ ఏమీ అనరు. ఎందుకంటే వాళ్లు హిందువులు కారు. ఇలా చేయడం ద్వంద్వ ప్రమాణాలను పాటించడమే. మత దురభిమానాన్ని ప్రదర్శించడమే’ అని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో తులసీ వ్యాఖ్యానించారు. -
ప్రజాస్వామ్యంపై దాడి
కశ్మీర్ ఉగ్ర ఘాతుకంపై పాక్‌ను దుయ్యబట్టిన ప్రధాని జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో అమర జవాన్లకు నివాళి హజారీబాగ్ (జార్ఖండ్): కశ్మీర్లో శుక్రవారం జరిగిన ఉగ్రవాద దాడుల ద్వారా భారత ప్రజాస్వామ్యంపై నిస్సిగ్గుగా దాడి ప్రయత్నం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా పాకిస్తాన్‌ను దుయ్యబట్టారు. కానీ దేశ భద్రతను కాపాడేందుకు వీర సైనికులు తమ ప్రాణాలనే త్యాగం చేశారని కొనియాడారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హజారీబాగ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమర జవాన్లకు నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన జార్ఖండ్‌వాసి, పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన కల్నల్ సంకల్ప్ కుమార్ శుక్లా సహా ఇతర జవాన్లకు నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. సంకల్ప్ కుమార్ వీర మరణాన్ని రానున్న తరాలు కూడా గుర్తుంచుకుంటాయన్నారు. మరోవైపు సోమవారం శ్రీనగర్‌లో మోదీ ఎన్నికల ప్రచార షెడ్యూల్లో మార్పులేదని, ఆయన ప్రచార సభ యథావిధిగా కొనసాగుతుందని కేంద్ర మంత్రి షానవాజ్ హుస్సేన్ తెలిపారు. కశ్మీర్ లోయలోని షేర్ ఎ కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో జరిగే మోదీ సభ కోసం కశ్మీరీలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజలంతా ఓట్ల ద్వారా పాక్ సాగిస్తున్న దాడులకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాగా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా నమోదవుతుండటంతో ఉగ్రవాదులు నిస్పృహకు లోనై ఈ దాడులకు తెగబడ్డారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు హైదరాబాద్‌లో పేర్కొన్నారు. పాక్ పేర్లతో ఉన్న ఆహార పొట్లాలు లభ్యం యూరి సైనిక క్యాంపుపై దాడి చేసిన ఆరుగురు ఉగ్రవాదులను ఎన్కౌంటర్లో మట్టుబెట్టాక వారి మృతదేహాల వద్ద పాక్ సంస్థల ముద్రలు ఉన్న ఆహార పొట్లాలు లభించాయని సైన్యం శనివారం తెలిపింది. ఈ ఆహార పొట్లాలను సాధారణంగా పాక్ సైన్యం వాడుతూ ఉంటుందని చెప్పింది. ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాల వద్దే ఈ పొట్లాలు లభించాయని వివరించింది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేందుకే ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, భారత్ ఎలాంటి ఉగ్రవాద దాడినైనా తిప్పికొడుతుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నోలో అన్నారు. ముజాహిదీన్లకు కశ్మీర్‌కు వెళ్లే హక్కుందన్న ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అభివృద్ధి కోసం రాజకీయాలు చేయాలి.. హజారీబాగ్: దేశంలో అగ్ర రాష్ట్రంగా ఎదగడానికి జార్ఖండ్‌కు అపరిమితమైన సామర్థ్యం ఉందని మోదీ పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి కుల రాజకీయాలు పక్కనబెట్టి.. అభివృద్ధి కోసం రాజకీయాలు చేయాలని సూచించారు. మూడో విడత అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా శనివారం ఇక్కడ జరిగిన ప్రచార సభలో మాట్లాడుతూ.. ఈ సమయంలో కుల, నిమ్న, అగ్రవర్ణ, మీరు, మేము లాంటి రాజకీయాల్ని విడనాడాలని, జార్ఖండ్ రాష్ట్రం, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అభివృద్ధి రాజకీయాలు చేయాలన్నారు. ఉద్యోగాల కోసం ప్రజలు వలస వెళ్లే దుస్థితి జార్ఖండ్‌కు లేదని, ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం ప్రజల్ని రప్పించే సామర్థ్యం ఈ రాష్ట్రానికి ఉందని అన్నారు. మౌలిక వసతులు అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని మారుస్తానన్నారు. బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తే.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా జార్ఖండ్ అభివృద్ధికి కృషి చేస్తాయని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 14 ఏళ్లలో 9 ప్రభుత్వాలు మారాయని, మూడు పర్యాయాలు రాష్ట్రపతి పాలన విధించారని చెప్పిన మోదీ.. సంకీర్ణ ప్రభుత్వాలతో రాష్ట్రం అభివృద్ధి చెందలేదన్నారు. ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం అవసరం అని దానికోసం మిగిలిన సీట్లకు జరిగే ఎన్నికల్లో బీజేపీ భారీ ఆధిక్యం కట్టబెట్టాలని ప్రజల్ని కోరారు.