ప్రజాస్వామ్యంపై దాడి | Attack on democracy, says Narendra modi | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యంపై దాడి

Published Sun, Dec 7 2014 1:57 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

హాజారీబాగ్ లో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న మోదీ - Sakshi

హాజారీబాగ్ లో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న మోదీ

కశ్మీర్ ఉగ్ర ఘాతుకంపై పాక్‌ను దుయ్యబట్టిన ప్రధాని
జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో అమర జవాన్లకు నివాళి
 
 హజారీబాగ్ (జార్ఖండ్): కశ్మీర్‌లో శుక్రవారం జరిగిన ఉగ్రవాద దాడుల ద్వారా భారత ప్రజాస్వామ్యంపై నిస్సిగ్గుగా దాడి ప్రయత్నం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా పాకిస్తాన్‌ను దుయ్యబట్టారు. కానీ దేశ భద్రతను కాపాడేందుకు వీర సైనికులు తమ ప్రాణాలనే త్యాగం చేశారని కొనియాడారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హజారీబాగ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమర జవాన్లకు నివాళులర్పించారు.
 
 దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన జార్ఖండ్‌వాసి, పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన కల్నల్ సంకల్ప్ కుమార్ శుక్లా సహా ఇతర జవాన్లకు నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. సంకల్ప్ కుమార్ వీర మరణాన్ని రానున్న తరాలు కూడా గుర్తుంచుకుంటాయన్నారు. మరోవైపు సోమవారం శ్రీనగర్‌లో మోదీ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌లో మార్పులేదని, ఆయన ప్రచార సభ యథావిధిగా కొనసాగుతుందని కేంద్ర మంత్రి షానవాజ్ హుస్సేన్ తెలిపారు.
 
 కశ్మీర్ లోయలోని షేర్ ఎ కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో జరిగే మోదీ సభ కోసం కశ్మీరీలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజలంతా ఓట్ల ద్వారా పాక్ సాగిస్తున్న దాడులకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాగా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా నమోదవుతుండటంతో ఉగ్రవాదులు నిస్పృహకు లోనై ఈ దాడులకు తెగబడ్డారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు హైదరాబాద్‌లో పేర్కొన్నారు.
 
 పాక్ పేర్లతో ఉన్న ఆహార పొట్లాలు లభ్యం
 యూరి సైనిక క్యాంపుపై దాడి చేసిన ఆరుగురు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టాక వారి మృతదేహాల వద్ద పాక్ సంస్థల ముద్రలు ఉన్న ఆహార పొట్లాలు లభించాయని సైన్యం శనివారం తెలిపింది. ఈ ఆహార పొట్లాలను సాధారణంగా పాక్ సైన్యం వాడుతూ ఉంటుందని చెప్పింది. ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాల వద్దే ఈ పొట్లాలు లభించాయని వివరించింది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేందుకే ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్ వ్యాఖ్యానించారు.
 
 ఇదిలా ఉండగా,  భారత్ ఎలాంటి ఉగ్రవాద దాడినైనా తిప్పికొడుతుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నోలో అన్నారు. ముజాహిదీన్లకు కశ్మీర్‌కు వెళ్లే హక్కుందన్న ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు.
 
 అభివృద్ధి కోసం రాజకీయాలు చేయాలి..
 హజారీబాగ్: దేశంలో అగ్ర రాష్ట్రంగా ఎదగడానికి జార్ఖండ్‌కు అపరిమితమైన సామర్థ్యం ఉందని మోదీ పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి కుల రాజకీయాలు పక్కనబెట్టి.. అభివృద్ధి కోసం రాజకీయాలు చేయాలని సూచించారు. మూడో విడత అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా శనివారం ఇక్కడ జరిగిన ప్రచార సభలో  మాట్లాడుతూ.. ఈ సమయంలో కుల, నిమ్న, అగ్రవర్ణ, మీరు, మేము లాంటి రాజకీయాల్ని విడనాడాలని, జార్ఖండ్ రాష్ట్రం, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అభివృద్ధి రాజకీయాలు చేయాలన్నారు.
 
 ఉద్యోగాల కోసం ప్రజలు వలస వెళ్లే దుస్థితి జార్ఖండ్‌కు లేదని, ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం ప్రజల్ని రప్పించే సామర్థ్యం ఈ రాష్ట్రానికి ఉందని అన్నారు.  మౌలిక వసతులు అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని మారుస్తానన్నారు. బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తే.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా జార్ఖండ్ అభివృద్ధికి కృషి చేస్తాయని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 14 ఏళ్లలో 9 ప్రభుత్వాలు మారాయని, మూడు పర్యాయాలు రాష్ట్రపతి పాలన విధించారని చెప్పిన మోదీ.. సంకీర్ణ ప్రభుత్వాలతో రాష్ట్రం అభివృద్ధి చెందలేదన్నారు. ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం అవసరం అని దానికోసం మిగిలిన సీట్లకు జరిగే ఎన్నికల్లో బీజేపీ భారీ ఆధిక్యం కట్టబెట్టాలని ప్రజల్ని కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement