విపక్షాల ఐక్యతా రాగం..చేతులు కలిపిన 19 పార్టీలు | Opposition parties take out Tiranga March from Parliament | Sakshi
Sakshi News home page

విపక్షాల ఐక్యతా రాగం..చేతులు కలిపిన 19 పార్టీలు

Published Fri, Apr 7 2023 5:49 AM | Last Updated on Fri, Apr 7 2023 6:57 AM

Opposition parties take out Tiranga March from Parliament - Sakshi

పార్లమెంట్‌ నుంచి విజయ్‌చౌక్‌ దాకా విపక్ష ఎంపీల ర్యాలీ. (ఇన్‌సెట్లో) విపక్ష నేతల ప్రెస్‌మీట్‌

న్యూఢిల్లీ: బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం నిరంతర దాడికి గురవుతోందంటూ కాంగ్రెస్‌తో పాటు 19 విపక్ష పార్టీలు మండిపడ్డాయి. గురువారం బడ్జెట్‌ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డ అనంతరం పార్లమెంటు ప్రాంగణం నుంచి విజయ్‌ చౌక్‌ దాకా ‘తిరంగా మార్చ్‌’ పేరిట నిరసన ర్యాలీ జరిపాయి. కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, డీఎంకే, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఆప్, ఎన్సీపీ, శివసేన (యూబీటీ), వామపక్షాలు, ఐయూఎంఎల్, ఆరెస్పీ తదితర పార్టీలు ఇందులో పాల్గొన్నాయి.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో సోనియాగాంధీతో పాటు ఎంపీలంతా త్రివర్ణ పతాకం చేబూని నినాదాలు చేస్తూ సాగారు. తమ ఐక్యతను పటిష్టపరుచుకుంటూ మోదీ సర్కారుపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని వారంతా ప్రకటించడం విశేషం! విపక్షాల ఐక్యతను మరింత ముందుకు తీసుకెళ్లడమే గాక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఉమ్మడిగా పోరాడతామని ఖర్గే ఈ సందర్భంగా ప్రకటించారు.

అదానీ ఉదంతం, కులగణన ఎన్నికల్లో విపక్షాలకు ప్రధానాంశాలుగా మారతాయా అని ప్రశ్నించగా అన్ని పార్టీల అధ్యక్షులూ చర్చించుకుని వాటిపై నిర్ణయానికి వస్తారని బదులిచ్చారు. కులగణన తమ ఎజెండాలో అతి ముఖ్యమైన అంశమన్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఇచ్చిన మర్యాదపూర్వక విందును విపక్ష నేతలు సంయుక్తంగా బహిష్కరించారు. తర్వాత కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో 19 పార్టీల నేతలూ సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు! మోదీ సర్కారుది అహంభావపూరిత వైఖరి అంటూ దుయ్యబట్టారు.

అదిలాగే కొనసాగితే దేశం పూర్తిస్థాయి నియంతృత్వంలో మగ్గిపోతుందన్నారు. కొంతకాలంగా కాంగ్రెస్‌తో వేదిక పంచుకోవడానికి ఇష్టపడని తృణమూల్, బీఆర్‌ఎస్, ఆప్, సమాజ్‌వాదీ పార్టీ కూడా ర్యాలీలోనూ, మీడియా సమావేశంలోనూ కలిసి పాల్గొనడం విశేషం! బడ్జెట్‌ సమావేశాలు ఆసాంతం ప్రభుత్వంపై విపక్షాలు సమైక్యంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మార్చి 13న రెండో విడత సమావేశాలు మొదలైనప్పటి నుంచీ సంయుక్తంగా నిరసనలు, ర్యాలీలతో            హోరెత్తిస్తున్నాయి.

మాటల్లోనే ప్రజాస్వామ్యం: ఖర్గే  
రాజ్యాంగం, న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తామంతా పోరాడుతున్నామని ఖర్గే ప్రకటించారు. మోదీ సర్కారు ప్రవచిస్తున్న ప్రజాస్వామ్య స్ఫూర్తి మాటలకే పరిమితమవుతోందని మండిపడ్డారు. ‘‘అదానీ అవినీతిపై బదులివ్వాల్సి వస్తుందనే భయంతో బడ్జెట్‌ సమావేశాలు తుడిచిపెట్టుకుపోవాలని బీజేపీ ఆశించింది. అందుకు విపక్షాలను బాధ్యులను చేయజూడటం దారుణం. రూ.50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను కేవలం 12 నిమిషాల చర్చతో ఆమోదించడమా? సభల్లో ఎన్నిసార్లు నోటీసులిచ్చినా విపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు.

ఇలా జరగడం నా 52 ఏళ్ల ప్రజా జీవితంలో తొలిసారి. 19 విపక్షాల్లో 18 పార్టీలు అదానీ అంశంపై కేంద్రాన్ని నిలదీశాయి. ఆయన సంపద కేవలం రెండున్నరేళ్లలో రూ.12 లక్షల కోట్లకు ఎలా పెరిగిందో చెప్పాలని పట్టుబట్టాయి. సభలో బీజేపీదే పూర్తి మెజారిటీ. జేపీసీ వేసినా ఎక్కువ మంది వాళ్లే ఉంటారు. అయినా విచారణకు వెనకాడుతున్నారంటే దాల్‌ మే కుచ్‌ కాలా హై’’ అన్నారు. అదానీతో మోదీకి, బీజేపీకి అక్రమ బంధం ఉందని ఆరోపించారు. ‘‘రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడగానే వాయువేగంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కానీ బీజేపీ అమ్రేలీ ఎంపీకి మూడేళ్ల జైలు శిక్ష పడి 16 రోజులైనా ఆయనపై వేటు వేయలేదు’’ అని మండిపడ్డారు.

విపక్షాలన్నీ విభేదాలను పక్కన పెట్టి ఒక్కతాటిపైకి వస్తున్నాయి. మా ఐక్యతను ఇప్పుడు దేశమంతా చూస్తోంది. మేం నానాటికీ బలపడుతున్నాం. మ మ్మల్ని విడదీసేందుకు బీజేపీ చేసిన ప్ర యత్నాలు విఫలమయ్యాయి. దీన్నెలా ముందుకు తీసుకెళ్లాలో అంతా కలిసి నిర్ణయించుకుంటాం. విపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహించాలన్నది ప్రశ్న కాదు 
– కె.కేశవరావు, బీఆర్‌ఎస్‌

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఊరుకుంటామేమో గానీ అదానీపై నిలదీస్తే మాత్రం సహించబోమని బీజేపీ తన ప్రవర్తనతో రుజువు చేసింది.        
– సంజయ్‌సింగ్, ఆప్‌

భారత్‌ జోడో యాత్ర విజయవంతం కావడంతో రాహుల్‌గాంధీని చూసి బీజేపీ భయపడుతోంది. అధికార పక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడాన్ని తొలిసారిగా చూశాం      
– టి.ఆర్‌.బాలు, డీఎంకే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement