vijay chowk
-
విపక్షాల ఐక్యతా రాగం..చేతులు కలిపిన 19 పార్టీలు
న్యూఢిల్లీ: బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం నిరంతర దాడికి గురవుతోందంటూ కాంగ్రెస్‌తో పాటు 19 విపక్ష పార్టీలు మండిపడ్డాయి. గురువారం బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డ అనంతరం పార్లమెంటు ప్రాంగణం నుంచి విజయ్ చౌక్ దాకా ‘తిరంగా మార్చ్’ పేరిట నిరసన ర్యాలీ జరిపాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఆప్, ఎన్సీపీ, శివసేన (యూబీటీ), వామపక్షాలు, ఐయూఎంఎల్, ఆరెస్పీ తదితర పార్టీలు ఇందులో పాల్గొన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో సోనియాగాంధీతో పాటు ఎంపీలంతా త్రివర్ణ పతాకం చేబూని నినాదాలు చేస్తూ సాగారు. తమ ఐక్యతను పటిష్టపరుచుకుంటూ మోదీ సర్కారుపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని వారంతా ప్రకటించడం విశేషం! విపక్షాల ఐక్యతను మరింత ముందుకు తీసుకెళ్లడమే గాక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఉమ్మడిగా పోరాడతామని ఖర్గే ఈ సందర్భంగా ప్రకటించారు. అదానీ ఉదంతం, కులగణన ఎన్నికల్లో విపక్షాలకు ప్రధానాంశాలుగా మారతాయా అని ప్రశ్నించగా అన్ని పార్టీల అధ్యక్షులూ చర్చించుకుని వాటిపై నిర్ణయానికి వస్తారని బదులిచ్చారు. కులగణన తమ ఎజెండాలో అతి ముఖ్యమైన అంశమన్నారు. లోక్‌సభ స్పీకర్ ఇచ్చిన మర్యాదపూర్వక విందును విపక్ష నేతలు సంయుక్తంగా బహిష్కరించారు. తర్వాత కాన్స్టిట్యూషన్ క్లబ్లో 19 పార్టీల నేతలూ సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు! మోదీ సర్కారుది అహంభావపూరిత వైఖరి అంటూ దుయ్యబట్టారు. అదిలాగే కొనసాగితే దేశం పూర్తిస్థాయి నియంతృత్వంలో మగ్గిపోతుందన్నారు. కొంతకాలంగా కాంగ్రెస్‌తో వేదిక పంచుకోవడానికి ఇష్టపడని తృణమూల్, బీఆర్ఎస్, ఆప్, సమాజ్‌వాదీ పార్టీ కూడా ర్యాలీలోనూ, మీడియా సమావేశంలోనూ కలిసి పాల్గొనడం విశేషం! బడ్జెట్ సమావేశాలు ఆసాంతం ప్రభుత్వంపై విపక్షాలు సమైక్యంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మార్చి 13న రెండో విడత సమావేశాలు మొదలైనప్పటి నుంచీ సంయుక్తంగా నిరసనలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నాయి. మాటల్లోనే ప్రజాస్వామ్యం: ఖర్గే రాజ్యాంగం, న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తామంతా పోరాడుతున్నామని ఖర్గే ప్రకటించారు. మోదీ సర్కారు ప్రవచిస్తున్న ప్రజాస్వామ్య స్ఫూర్తి మాటలకే పరిమితమవుతోందని మండిపడ్డారు. ‘‘అదానీ అవినీతిపై బదులివ్వాల్సి వస్తుందనే భయంతో బడ్జెట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోవాలని బీజేపీ ఆశించింది. అందుకు విపక్షాలను బాధ్యులను చేయజూడటం దారుణం. రూ.50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను కేవలం 12 నిమిషాల చర్చతో ఆమోదించడమా? సభల్లో ఎన్నిసార్లు నోటీసులిచ్చినా విపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. ఇలా జరగడం నా 52 ఏళ్ల ప్రజా జీవితంలో తొలిసారి. 19 విపక్షాల్లో 18 పార్టీలు అదానీ అంశంపై కేంద్రాన్ని నిలదీశాయి. ఆయన సంపద కేవలం రెండున్నరేళ్లలో రూ.12 లక్షల కోట్లకు ఎలా పెరిగిందో చెప్పాలని పట్టుబట్టాయి. సభలో బీజేపీదే పూర్తి మెజారిటీ. జేపీసీ వేసినా ఎక్కువ మంది వాళ్లే ఉంటారు. అయినా విచారణకు వెనకాడుతున్నారంటే దాల్ మే కుచ్ కాలా హై’’ అన్నారు. అదానీతో మోదీకి, బీజేపీకి అక్రమ బంధం ఉందని ఆరోపించారు. ‘‘రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడగానే వాయువేగంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కానీ బీజేపీ అమ్రేలీ ఎంపీకి మూడేళ్ల జైలు శిక్ష పడి 16 రోజులైనా ఆయనపై వేటు వేయలేదు’’ అని మండిపడ్డారు. విపక్షాలన్నీ విభేదాలను పక్కన పెట్టి ఒక్కతాటిపైకి వస్తున్నాయి. మా ఐక్యతను ఇప్పుడు దేశమంతా చూస్తోంది. మేం నానాటికీ బలపడుతున్నాం. మ మ్మల్ని విడదీసేందుకు బీజేపీ చేసిన ప్ర యత్నాలు విఫలమయ్యాయి. దీన్నెలా ముందుకు తీసుకెళ్లాలో అంతా కలిసి నిర్ణయించుకుంటాం. విపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహించాలన్నది ప్రశ్న కాదు – కె.కేశవరావు, బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఊరుకుంటామేమో గానీ అదానీపై నిలదీస్తే మాత్రం సహించబోమని బీజేపీ తన ప్రవర్తనతో రుజువు చేసింది. – సంజయ్‌సింగ్, ఆప్ భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో రాహుల్‌గాంధీని చూసి బీజేపీ భయపడుతోంది. అధికార పక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడాన్ని తొలిసారిగా చూశాం – టి.ఆర్.బాలు, డీఎంకే -
Mann ki Baat 2023: వారి జీవితాలు స్ఫూర్తిదాయకం
న్యూఢిల్లీ: ఈ ఏడాది పద్మ అవార్డులకు ఎంపికైన వారి జీవితాలు, వారు సాధించిన ఘనత గురించి ప్రజలందరూ తెలుసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 2023 పద్మ అవార్డుల్ని పీపుల్స్ పద్మగా అభివర్ణించారు. సామాన్యుల్లో అసామాన్యులుగా ఎదిగిన వారిని గుర్తించి గౌరవిస్తున్నట్టు చెప్పారు. కొత్త ఏడాదిలో తొలిసారిగా ప్రధాని ఆదివారం ఆకాశవాణి మన్‌కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. గిరిజనులు, వారి అభ్యున్నతికి కృషి చేసిన వారినే అత్యధికంగా పద్మ అవార్డులతో సత్కరిస్తున్నట్టు వెల్లడించారు. ‘‘ పద్మ పురస్కారాలు పొందినవారి జీవితాలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. గిరిజన భాషలైన టోటో, హో, కూయి వంటి వాటిపై అవిరళ కృషి చేసిన వారు, ఆదివాసీల సంగీత పరికరాలు వాయించడంలో నిష్ణాతులకి ఈ సారి పద్మ పురస్కారాలు వరించాయి.. నగర జీవితాలకి , ఆదివాసీ జీవితాలకు ఎంతో భేదం ఉంటుంది. నిత్య జీవితంలో ఎన్నో సవాళ్లుంటాయన్నారు. అయినప్పటికీ తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి గిరిజనులు ఎంతో పోరాటం చేస్తుంటారు’’ అని ప్రధాని కొనియాడారు. పెరుగుతున్న దేశీయ పేటెంట్ ఫైలింగ్స్ ఈ దశాబ్దం సాంకేతిక రంగంలో దేశీయ టెక్నాలజీస్ వాడకం పెరిగి ‘‘టెకేడ్’’గా మారాలన్న భారత్ కలను ఆవిష్కర్తలు, వాటికి వచ్చే పేటెంట్ హక్కులు నెరవేరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. విదేశాలతో పోల్చి చూస్తే దేశీయంగా పేటెంట్ ఫైలింగ్స్ బాగా పెరిగాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ ఫైలింగ్‌లో భారత్ ఏడో స్థానంలో ఉంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్లలో అయిదో స్థానంలో ఉందని ప్రధాని వెల్లడిచారు. గత అయిదేళ్లలో భారత్ పేటెంట్ రిజిస్ట్రేషన్లు 50శాతం పెరిగాయని, ప్రపంచ ఆవిష్కరణల సూచిలో మన స్థానం 40కి ఎగబాకిందన్నారు. 2015 నాటికి 80 కంటే తక్కువ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. ఇండియన్ ఇనిస్టి్యూట్ ఆఫ్ సైన్సెస్ 2022లో 145 పేటెంట్లను దాఖలు చేసి రికార్డు సృష్టిస్తుందన్నారు. భారత్ ‘‘టెకేడ్‘‘కలని ఆవిష్కర్తలే నెరవేరుస్తారని ప్రధాని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మన్‌కీ బాత్‌లో తెలుగువారి ప్రస్తావన మన్‌కీబాత్‌లో ఇద్దరు తెలుగు వారి గురించి మోదీ ప్రస్తావించారు. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ నడిపే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కె.వి.రామసుబ్బారెడ్డి, తెలంగాణకు చెందిన ఇంజనీర్ విజయ్ గురించి మాట్లాడారు. ‘‘నంద్యాల జిల్లాకు చెందిన కె.వి.రామసుబ్బారెడ్డి చిరు ధాన్యాలు పండించడం కోసం మంచి జీతం వచ్చే ఉద్యోగం మానేశారు. తల్లి చేసే చిరు ధాన్యాల వంటకం రుచి చూసి గ్రామంలో ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించారు వాటి ప్రయోజనాలను అందరికీ వివరిస్తున్నారు’’ అని కొనియాడారు. నమో యాప్‌లో ఇ–వేస్ట్ గురించి రాసిన తెలంగాణకు చెందిన ఇంజనీర్ విజయ్ గురించి ప్రస్తావించిన ప్రధాని మొబైల్, ల్యాప్‌టాప్, టాబ్లెట్లు నిరుపయోగమైనప్పుడు ఎలా పారేయాలో వివరించారు. -
ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ముగిసినా ఢిల్లీలో రాజకీయ వేడి తగ్గలేదు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కిందంటూ, రాజ్యసభలో భౌతికంగా దాడులకు దిగిందంటూ నిరసన వ్యక్తం చేస్తూ గురువారం విపక్షాలు ర్యాలీగా వచ్చి విజయ్‌చౌక్‌లో ధర్నా నిర్వహించాయి. ముందుగా గురువారం ఉదయం పార్లమెంట్లో రాజ్యసభలో ప్రతిపక్షనేత ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, సమాజ్‌వాదీ, సీపీఎం, సీపీఐ, డీఎంకే తదితర పార్టీల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పార్లమెంట్ నుంచి విజయ్‌చౌక్‌కు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష ఎంపీలంతా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రజల గొంతుకను నొక్కేశారని నినదిస్తూ విజయ్ చౌక్‌కు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. మార్షల్స్‌లా బయటి వ్యక్తులొచ్చారు: శివసేన శివసేన పక్షనేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ ‘ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలను పార్లమెంటులో వెల్లడించేందుకు అవకాశం రాలేదు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల జరిగిన సంఘటన ప్రజాస్వామ్యానికి చేటు. పాకిస్తాన్ సరిహద్దు వద్ద నిలబడినట్లు అనిపించింది..’ అని విమర్శిచారు. బయటి వ్యక్తులు మార్షల్స్ యూనిఫారమ్ ధరించి మహిళలను కొట్టడానికి వచ్చారని ఆరోపించారు. అధికార పార్టీయే కారణం: డీఎంకే డీఎంకే రాజ్యసభ పక్ష నేత శివ మాట్లాడుతూ ‘ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తెచ్చిన ఇన్సూరెన్స్ బిల్లును లక్షలాది మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీనిని సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ బిల్లును బలవంతంగా ఆమోదించుకుంది. దీనిపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ఇద్దరు మహిళా ఎంపీలు దాడికి గురయ్యారు. ఈ నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్షాలు ఐక్యంగా ఉద్యమిస్తున్నాయి. పార్లమెంట్ సజావుగా జరగకపోవడానికి అధికార పార్టీనే కారణం‘ అని విమర్శించారు. ఉపరాష్ట్రపతితో భేటీ.. విజయ్ చౌక్‌లో నిరసన అనంతరం విపక్షాలు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుతో సమావేశమయ్యాయి. ఆగస్టు 11న రాజ్యసభలో భారీ సంఖ్యలో మార్షల్స్ కాని వారిని మోహరించారని ఫిర్యాదు చేశారు. సమావేశాలు సజావుగా సాగేలా, విపక్షాలు ప్రజా సమస్యలపై తమ వాణి వినిపించేలా చూడాలని కోరారు. జనరల్ ఇన్సూరెన్స్ బిల్లును కేంద్రం తెచ్చిన తీరును నివేదించారు. ఈ సమావేశం అనంతరం 15 పార్టీల ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. ‘పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టాలు తప్పించింది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అగౌరవ పరుస్తుంది. ప్రారంభంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో సంయుక్తంగా ప్రతిపక్షాలు ముఖ్యమైన అంశాలపై చర్చించాలని ప్రతిపాదించాయి. పెగసస్ గూఢచార్యం, రైతుల ఆందోళనలు, ధరలు పెరుగుదల, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై చర్చించాలని కోరాం.. చర్చ కోసం పట్టుపట్టిన ప్రతిపక్షాల డిమాండ్లను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రస్తుత ప్రభుత్వానికి పార్లమెంటరీ జవాబుదారీతనంపై నమ్మకం లేదు. పెగసస్‌పై చర్చ నుంచి పారిపోతోంది. ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రతిపక్ష పార్టీలతో చర్చించాల్సింది. కానీ ప్రభుత్వం అహంకారపూరితంగా నిర్లక్ష్యంగా ఉంది. ప్రతిష్టంభనకు పూర్తిగా బాధ్యత ప్రభుత్వమే వహించాలి’ అని పేర్కొన్నాయి. ‘ప్రభుత్వ నిరంకుశ వైఖరిని, అప్రజాస్వామిక చర్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడికి వ్యతిరేకంగా మా పోరాటాన్ని కొనసాగించడానికి, జాతీయ ప్రాముఖ్యత అంశాలు, ప్రజా సమస్యలపై ఆందోళన చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం..’ అని పేర్కొన్నాయి. -
టెర్మినల్ పేరు మార్పుపై ఉద్యమిస్తాం: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ నాయకులంతా ఒక్కొక్కరూ ఇతర పార్టీల్లోకి వెళుతుండడంతో, ఇక్కడి సెటిలర్లలో కొత్త ఊపు తెచ్చేందుకే చంద్రబాబు కుట్రపూరితంగా శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టించారని కాంగ్రెస్ ఎంపీ వి.హన్మంతరావు ఆరోపించారు. గురువారం ఆయన విజయ్‌చౌక్‌లో మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ విమానాశ్రయానికి రెండు పేర్లు లేవని, కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోక పోతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లా స్థాయిలో ఉద్యమాలు రూపొందిస్తామని చెప్పారు. -
ఏపీకి ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి: బాల్క సుమన్
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘చంద్రబాబు... మీకు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే ఏపీలోని 4 విమానాశ్రయాలకు ఆయన పేరు పెట్టుకో. ప్రేమ మరీ ఎక్కువైతే ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌గా పేరు పెట్టుకో’’ అని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ సలహా ఇచ్చారు. విజయ్‌చౌక్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. శంషాబాద్ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టి తెలంగాణపై ఆధిపత్యాన్ని కొనసాగించవద్దన్నారు. దీనిపై సమాధానం చెప్పాల్సి వస్తుందని మంత్రి అశోక్‌గజపతి రాజు సభలకు హాజరవకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. టెర్మినల్ పేరు మార్పిడిలో బాబు కుట్రలపై ప్రధాని మోదీని కలసి వివరించనున్నట్టు చెప్పారు.