ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతున్న ప్రధాని మోదీ, మంత్రులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది పద్మ అవార్డులకు ఎంపికైన వారి జీవితాలు, వారు సాధించిన ఘనత గురించి ప్రజలందరూ తెలుసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 2023 పద్మ అవార్డుల్ని పీపుల్స్ పద్మగా అభివర్ణించారు. సామాన్యుల్లో అసామాన్యులుగా ఎదిగిన వారిని గుర్తించి గౌరవిస్తున్నట్టు చెప్పారు. కొత్త ఏడాదిలో తొలిసారిగా ప్రధాని ఆదివారం ఆకాశవాణి మన్‌కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. గిరిజనులు, వారి అభ్యున్నతికి కృషి చేసిన వారినే అత్యధికంగా పద్మ అవార్డులతో సత్కరిస్తున్నట్టు వెల్లడించారు.
‘‘ పద్మ పురస్కారాలు పొందినవారి జీవితాలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. గిరిజన భాషలైన టోటో, హో, కూయి వంటి వాటిపై అవిరళ కృషి చేసిన వారు, ఆదివాసీల సంగీత పరికరాలు వాయించడంలో నిష్ణాతులకి ఈ సారి పద్మ పురస్కారాలు వరించాయి.. నగర జీవితాలకి , ఆదివాసీ జీవితాలకు ఎంతో భేదం ఉంటుంది. నిత్య జీవితంలో ఎన్నో సవాళ్లుంటాయన్నారు. అయినప్పటికీ తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి గిరిజనులు ఎంతో పోరాటం చేస్తుంటారు’’ అని ప్రధాని కొనియాడారు.
పెరుగుతున్న దేశీయ పేటెంట్ ఫైలింగ్స్
ఈ దశాబ్దం సాంకేతిక రంగంలో దేశీయ టెక్నాలజీస్ వాడకం పెరిగి ‘‘టెకేడ్’’గా మారాలన్న భారత్ కలను ఆవిష్కర్తలు, వాటికి వచ్చే పేటెంట్ హక్కులు నెరవేరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. విదేశాలతో పోల్చి చూస్తే దేశీయంగా పేటెంట్ ఫైలింగ్స్ బాగా పెరిగాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ ఫైలింగ్‌లో భారత్ ఏడో స్థానంలో ఉంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్లలో అయిదో స్థానంలో ఉందని ప్రధాని వెల్లడిచారు. గత అయిదేళ్లలో భారత్ పేటెంట్ రిజిస్ట్రేషన్లు 50శాతం పెరిగాయని, ప్రపంచ ఆవిష్కరణల సూచిలో మన స్థానం 40కి ఎగబాకిందన్నారు. 2015 నాటికి 80 కంటే తక్కువ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. ఇండియన్ ఇనిస్టి్యూట్ ఆఫ్ సైన్సెస్ 2022లో 145 పేటెంట్‌లను దాఖలు చేసి రికార్డు సృష్టిస్తుందన్నారు. భారత్ ‘‘టెకేడ్‘‘కలని ఆవిష్కర్తలే నెరవేరుస్తారని ప్రధాని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
మన్‌కీ బాత్‌లో తెలుగువారి ప్రస్తావన
మన్‌కీబాత్‌లో ఇద్దరు తెలుగు వారి గురించి మోదీ ప్రస్తావించారు. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ నడిపే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కె.వి.రామసుబ్బారెడ్డి, తెలంగాణకు చెందిన ఇంజనీర్ విజయ్ గురించి మాట్లాడారు. ‘‘నంద్యాల జిల్లాకు చెందిన కె.వి.రామసుబ్బారెడ్డి చిరు ధాన్యాలు పండించడం కోసం మంచి జీతం వచ్చే ఉద్యోగం మానేశారు. తల్లి చేసే చిరు ధాన్యాల వంటకం రుచి చూసి గ్రామంలో ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించారు వాటి ప్రయోజనాలను అందరికీ వివరిస్తున్నారు’’ అని కొనియాడారు. నమో యాప్‌లో ఇ–వేస్ట్ గురించి రాసిన తెలంగాణకు చెందిన ఇంజనీర్ విజయ్ గురించి ప్రస్తావించిన ప్రధాని మొబైల్, ల్యాప్‌టాప్, టాబ్లెట్‌లు నిరుపయోగమైనప్పుడు ఎలా పారేయాలో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment