ఎన్‌సీసీ ర్యాలీలో ఓ క్యాడెట్‌కు బహుమతి అందజేస్తున్న మోదీ
న్యూఢిల్లీ: దేశాన్ని నడిపిస్తోంది నారీ శక్తేనని.. భారత్‌లో చోటుచేసుకుంటున్న సానుకూల మార్పుల్లో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసిం చారు. మనోబలముంటే సాధించలేనిదేదీ లేదని మహిళలు నిరూపిస్తున్నారని.. వివిధ రంగాల్లో వీరి ప్రగతే ఇందుకు ఉదాహరణ అన్నారు.
ఈ ఏడాది తొలి ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి మోదీ రేడియోలో ప్రసంగించా రు. వైదిక యుగం నుంచీ భారత మహిళలు కుటుంబం, సమాజాన్ని ఏకం చేయడంలో కీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు. పద్మ అవార్డుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం వల్లే సామాన్యులకు, ప్రజాసేవ చేస్తున్న వారికి గుర్తింపు దక్కిందన్నారు. నిస్వార్థంగా సేవచేస్తున్న వారున్న సమాజంలో ఉండటం మన అదృష్టమన్నారు. ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించుకుంటూ ముందుకెళ్లడమే భారత సంస్కృతి గొప్పదనమన్నారు.
ముందుండి నడుపుతున్న మహిళలు
‘నారీశక్తి కుటుంబాన్ని, సమాజాన్ని ఏకం చేస్తుంది. వైదిక కాలం నుంచీ ఇది నిరూపితమైంది. మహిళలే మనకు స్ఫూర్తి. దేశానికి కొత్త వెలుగులు తెచ్చేదీ వారే’ అని గార్గి, మైత్రేయి, మీరాబాయి, అహల్యాబాయి హోల్కర్, రాణి లక్ష్మీబాయి తదితరుల పేర్లను ప్రస్తావించారు. ‘ఫిబ్రవరి 1.. నేటితరం యువతకు స్ఫూర్తిగా నిలిచిన వ్యోమగామి కల్పనా చావ్లా వర్ధంతి. ఆమె మనతో లేకపోవటం బాధాకరం. ఆమె జీవితం, సాధించిన విజయాలు ప్రపంచంలోని యువతులకు, ప్రత్యేకంగా భారతీయులకు ఆదర్శం.
నారీశక్తికి పరిమితుల్లేవని కల్పనా చావ్లా నిరూపించారు. భారత మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ.. తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. దేశం గర్వపడేలా చేస్తున్నారు’ అని మోదీ ప్రశంసించారు. ప్రాచీన భారత సమాజంలోనూ మహిళలు సాధించిన విజయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయన్నారు. 10 మంది కుమారులతో కలిగే పుణ్యం.. ఒక కూతురితో సమానమని పేర్కొన్నారు. ఇదే భారత సమాజం మహిళలకు ఇచ్చే గౌరవమన్నారు.
ఓ పౌరుడు మహిళాశక్తి గురించి ‘మైగవ్’ యాప్‌కు పంపిన లేఖను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సుఖోయ్–30 యుద్ధ విమానంలో ప్రయాణించడాన్ని ప్రస్తావిస్తూ.. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్లడంతోపాటు ముందుండి నడిపిస్తున్నారనే విషయం అర్థం చేసుకోవాలన్నారు.రిపబ్లిక్‌డే ఉత్సవాల్లో మహిళా బీఎస్‌ఎఫ్ జవాన్లు చేసిన విన్యాసాలు స్వదేశీ, విదేశీ అతిథులను ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న మహిళలతో (ఆయా రంగాల్లో మొదటి స్థానంలో ఉన్న మహిళలతో ఇటీవలే ఈ సమావేశం జరిగింది) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమావేశమవటాన్ని మోదీ అభినందించారు. ఛత్తీస్‌గఢ్‌లోని మా వో ప్రాబల్య ప్రాంతాల్లో ఆదివాసీ మహిళలు ఈ–రిక్షాలు నడపటాన్ని ప్రస్తావించారు.
సిఫారసుల్లేవ్..
పద్మ అవార్డు విజేతల ఎంపికలో అనుసరించిన పారదర్శక విధానం వల్లే సామాన్యులకు సరైన గౌరవం దక్కిందని మోదీ పేర్కొన్నారు. పురస్కారాన్ని అందుకోనున్న వారంతా పేర్లతో కాకుండా వారు చేస్తున్న సేవల ద్వారా జాబితాలో చోటు సంపాదించారన్నారు. ‘నగరాల్లో నివసించని వారు.. రోజూ పేపర్లు, టీవీల్లో కనిపించని వారు ఈసారి పద్మ అవార్డు లు అందుకోబోతున్నారు. దీనికి కారణం ఆన్‌లైన్ నామినేషన్ ప్రక్రియ ద్వారా పారదర్శకత పెరగటమే. అందుకే పద్మ అవార్డుల ఎంపికలో సానుకూల మార్పు వచ్చింది’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘విజేతలను చూస్తే గర్వం కలుగుతుంది. ఇలాంటి వ్యక్తులు మన సమాజంలో ఉండటం అదృష్టం. ఇలాంటి వారు సిఫారసుల్లేకుండానే గుర్తింపు పొందటం గొప్ప విషయం’ అని చెప్పారు.
అవినీతిపై ‘యువ’పోరాటం
యువత సహకరించాలి: ఎన్‌సీసీ క్యాడెట్ల ర్యాలీలో మోదీ
న్యూఢిల్లీ: అవినీతిపై అవిశ్రాంత పోరు కొనసాగిస్తున్న తమ ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని మోదీ దేశ యువతను కోరారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో అవినీతి పరులెవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు జైళ్లలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆదివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఎన్‌సీసీ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ‘అవినీతి వ్యతిరేక కార్యక్రమాల ద్వారా ధనికులు, సమాజంలో గొప్ప పేరున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని ప్రజలు భావించేవారు.
డబ్బున్నవాళ్లను వదిలేస్తారనే భావనా ఉండేది. కానీ ఇప్పుడలా లేదు. తప్పు చేసిన ముగ్గురు మాజీ సీఎంలు జైలు కెళ్లటమే ఇందుకు ఉదాహరణ. అవినీతి చెదలను అంతం చేయడం ద్వారానే పేదలకు మేలు జరుగుతుంది’ అని ఎన్‌సీసీ క్యాడెట్లకు తెలిపారు. బిహార్ మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా, హరియాణా మాజీ సీఎం ఓపీ చౌతాలా అవినీతి ఆరోపణలపై జైలు కెళ్లిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు.
లీకేజీ అరికట్టడం ద్వారానే..:
భారత యువత అవినీతిని ఎప్పుడూ ప్రోత్సహించలేదన్న మోదీ.. నల్లధనం, అవినీతిపై పోరాటం దీర్ఘకాలం జరగాలన్నారు. డిజిటల్ లావాదేవీల ద్వారా అవినీతిని తగ్గించొచ్చని.. ‘భీమ్’ యాప్ ద్వారా డిజిటల్ లావాదేవీలు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించడంలో ఎన్‌సీసీ క్యాడెట్లు, యువకులు సాయం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న లీకేజీని అరికట్టడం ద్వారా అసలైన లబ్ధిదారులకు మేలు చేకూర్చడం తద్వారా దేశాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.
ఉన్నతస్థాయికి ఎన్‌సీసీ:
2023లో 75 ఏళ్లు పూర్తిచేసుకోనున్న ఎన్‌సీసీని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని మోదీ పిలుపునిచ్చారు. బాల్యంలో తను కూడా ఎన్‌సీసీ క్యాడెట్‌గా ఉన్నానని.. క్యాంప్‌ల ద్వారా స్ఫూర్తి పొందానని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో ఎన్‌సీసీ పనితీరుపై సమీక్ష జరుపుకుని ముందుకెళ్లాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment