ఆదివారం మిర్జాపూర్ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న నరేంద్ర మోదీ
మిర్జాపూర్: రైతులు, వారి సమస్యల విషయంలో కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ మొసలికన్నీరు కారుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వీరు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని, నీటిపారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించి అన్నదాతకు దుర్భరమైన పరిస్థితులను సృష్టించారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ సమీపంలో బాణ్‌సాగర్ కెనాల్ ప్రాజెక్టును ప్రారంభించడంతోపాటు, మిర్జాపూర్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన (మొత్తంగా రూ.4వేల కోట్ల అభివృద్ధి పనులకు) చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పుడు రైతుల సమస్యలపై మొసలికన్నీరు కారుస్తూ.. రాజకీయాలు చేస్తున్న వారంతా అధికారంలో ఉన్నప్పుడు సరైన కనీస మద్దతు ధర ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు. కపటప్రేమను నటిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల రైతుల ఆదాయం రెట్టింపయ్యే రోజులు మరెంతో దూరంలో లేవన్నారు.
కాంగ్రెస్ హయాంలో దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయిన విషయాన్ని మోదీ గుర్తు చేస్తూ.. ‘ఈ బాణ్‌సాగర్ ప్రాజెక్టు ఒకటే కాదు.. రైతు సంక్షేమానికి సంబంధించిన ఎన్నో ప్రాజెక్టులను ఆపడం, పెండింగ్‌లో పెట్టడం, పక్కదారి పట్టించడం వంటి ఎన్నో పనులు చేశారు. ఎప్పుడూ రైతుల సమస్యలపై దృష్టిపెట్టలేదు. వారు చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే.. ఇంత కీలకమైన ప్రాజెక్టు ఎందుకు అటకెక్కింది?’ అని విమర్శించారు.
40 ఏళ్ల క్రితమే చేసుంటే..!
‘వ్యవసాయం, రైతుల పేరుతో గత ప్రభుత్వాలు ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేయడమో, కావాలని ఆలస్యం చేయడమో చేశారు. అసలు వీరు రైతుల గురించి కనీసం కూడా ఆలోచించలేదు. అందుకే ఇన్ని దశాబ్దాలుగా రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రూ.3,500 కోట్ల బాణ్‌సాగర్ ప్రాజెక్టు వల్ల మిర్జాపూర్, అలహాబాద్ ప్రాంతాలతో సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్షన్నర హెక్టార్లలో పంటసాగవుతుంది. 40 ఏళ్ల క్రితమే ఫ్రేమ్‌వర్క్ సిద్ధమైన ఈ ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తయి ఉంటే.. దశాబ్దాల క్రితం నుంచే ఎన్నో రైతు కుటుంబాలు ఆనందంగా ఉండేవి’ అని ప్రధాని పేర్కొన్నారు.
యోగి నేతృత్వంలో యూపీ ప్రభుత్వం పూర్వాంచల్‌లో అభివృద్ధిని వేగవంతం చేస్తోందని ప్రశంసించారు. రైతులకు మేలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కనీస మద్దతు ధరను పెంచిందన్నారు. ‘గతంలో కూడా ఎమ్మెస్పీలను ప్రకటించారు. పత్రికలు, చానెళ్లలో ఫొటోలు వేసుకుని భారీగా ప్రచారం చేసుకున్నారు. పని చేశామని గొప్పగా చెప్పుకున్నారు. కానీ రైతుల వద్దనుంచి కొనుగోళ్లు చేయలేదు. దీంతో రైతుల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదు’ అని మోదీ విమర్శించారు.
మేక్రాన్‌కూ నచ్చింది!
వింధ్యా, భగీరథి పర్వతాల మధ్య ఉన్న ఈ ప్రాంతం చాలా పవిత్రమైనదని.. మొన్నటి మార్చి నెలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ వచ్చినపుడు ఈ ప్రాంత విశిష్టత, వింధ్యావాసినీ మాత ప్రాశస్త్యం తెలుసుకుని ఆశ్చర్యపోయారని కూడా మోదీ పేర్కొన్నారు.
నేడు పశ్చిమబెంగాల్‌కు ప్రధాని
పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో సోమవారం జరగనున్న రైతు సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment