సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. నేటి(సెప్టెంబర్ 23) నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 3 వరకు ఉపసంహరణ జరగనుంది. అక్టోబర్ 21న పోలింగ్ నిర్వహించి.. 24వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ మేరకు అధికారులు హుజూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు.
హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చెయ్యడం తో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. హుజూర్ నగర్ కు పీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ కావటంతో కాంగ్రెస్ ,టీఆర్‌ఎస్ ఇరు పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. నల్గొండ ఎంపీ స్థానం పోగొట్టుకున్న టీఆర్‌ఎస్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు బరిలోకి ఉత్తమ్ సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతిని దింపనుంది. ఇక రాష్ట్రంలో పట్టుసాదించడం కోసం తహ తహలాడుతున్న బీజేపీ గట్టి అభ్యర్థిని వెతికే పనిలో పడింది.
Comments
Please login to add a commentAdd a comment