
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారం బాగా వేడెక్కింది. తొలిసారి విజయం సాధించి ఈ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయాలని చూస్తున్న అధికార టీఆర్‌ఎస్.. కాంగ్రెస్, బీజేపీలను ఉమ్మడిగా టార్గెట్ చేస్తోంది. ప్రచార పర్వం మరో వారం రోజుల్లో ముగియనుండగా.. ఆ పార్టీ నేతలు పూర్తిగా ఈ రెండు పార్టీల రహస్య మైత్రిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని వారి ప్రచార శైలి, ప్రసంగాలు, ప్రకటనలు తేటతెల్లం చేస్తున్నాయి.
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) ప్రకటనలు కానీ, ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జి.జగదీశ్‌రెడ్డి వరసగా చేస్తున్న ప్రచార ప్రసంగాలు దీనికి అద్దం పడుతున్నాయి. 2018 ముందస్తు ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో కోల్పోయిన ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఆ పార్టీకి చెం దిన ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నా యకులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
గత ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసిన బీజేపీకి కేవలం 15వందల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా, ఈ సారి కూడా ఆ పార్టీ పోటీ చేయడం కేవలం పరోక్షంగా కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చేందుకే అన్న అంశాన్ని ప్రజల్లోగా బాగా తీసుకువెళ్లేందుకు టీఆర్‌ఎస్ ప్రాధాన్యం ఇస్తోంది. జాతీయ స్థాయిలో బద్ద శత్రువులుగా ఉండే ఈ రెండు పార్టీలు ఇక్కడ మాత్రం ఒక్కటయ్యాయని మంత్రి జగదీశ్‌రెడ్డి సందర్భం వచ్చిన ప్రతీ సారి ప్రసంగాల్లో పేర్కొంటున్నారు. మరో వారం రోజులే ప్రచారానికి గడువు మిగిలి ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలూ జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి.
గెలుపు ధీమాలో పార్టీలు..
మరో వైపు హుజూర్‌నగర్‌లో పోటీ చేసిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలతో పాటు.. పోటీలో ఉన్న ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు తమదే అన్న ధీమాలో ఉన్నారు. కాగా, ప్రధాన పోటీ మాత్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేక చతికిల పడిన టీడీపీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితర నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు.
మరోవైపు బీజేపీ కూడా ఈ సారి ఎలాగైనా తమ ఓటు శాతాన్ని పెంచుకోవాలని, దానిని పార్టీ విస్తరణకు ఉపయోగించుకోవాలన్న పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ ఇప్పటికే ఈ స్థానం నుంచి మూడు పర్యాయాలు విజయం సాధించింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్‌రెడ్డి నల్లగొండ ఎంపీగా గెలుపొందడంతో ఖాళీ అయిన ఈ స్థానంతో ఉత్తమ్ భార్య పద్మావతిని కాంగ్రెస్ బరిలోకి దింపింది. కాంగ్రెస్‌కు హ్యాట్రిక్ విజయాలు అందించిన ఈ నియోజకవర్గం ఇప్పుడు కూడా తమ వెంటే ఉంటుందన్న ధీమా కాంగ్రెస్‌ది.
ఇప్పటికి మూడు పర్యాయాలు హుజూర్‌నగర్‌లో పోటీ చేసిన టీఆర్‌ఎస్ 2014, 2018 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో ఓడిపోయినా.. ఆ తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పంచాయతీలు, మండలాలు, జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని బలం పెంచుకుంది. మరో వైపు వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి జరిగిన చేరికలు, 2014 ఎన్నికల్లో దాదాపు 30వేల ఓట్లు సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం వంటి అనుకూల అంశాలపైనా టీఆర్‌ఎస్ నమ్మకం పెట్టుకుంది.
పార్టీ నాయకత్వం విడతల వారీగా చేయిస్తున్న అంతర్గత సర్వేల ద్వారా మండలాలు, గ్రామాల వారీగా, కులాలు, వయస్సుల వారీగా ఎక్కడ ఎలాంటి పట్టు ఉందో అంచనాకు వస్తూ.. దాని ప్రకారమే ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఏ పార్టీకి ఆ పార్టీ తమ గెలుపుపై ధీమాతో పనిచేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment