సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు అందుతున్న కౌంటింగ్ సరళిని బట్టి చూస్తే 20వేలకు పైచిలుకు మెజారిటీతో గులాబీ అభ్యర్థి శైనంపూడి సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ జెండా పాతడంతో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ భవన్‌లో సంబరాలు జరుగుతున్నాయి. హుజూర్‌నగర్‌లో గులాబీ శ్రేణులు గులాల్ చల్లుకుంటూ ఆనందోత్సాహల్లో మునిగితేలారు.
తీవ్ర ఉత్కంఠను రేపిన హుజూర్..
హుజూర్‌నగర్ ఉప ఎన్నికను రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీచేసి గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. తనకు కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో మరోసారి గెలుపు ఖాయమన్న ధీమాతో ఉత్తమ్.. తన సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన సైదిరెడ్డిని మరోసారి టీఆర్‌ఎస్ బరిలోకి దింపింది. బీజేపీ, టీడీపీ వంటి పార్టీలు బరిలో నిలిచినా.. పెద్దగా ప్రభావం చూపలేదు. టీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. ఇరుపార్టీల అగ్రనేతలు పెద్దసంఖ్యలో మోహరించి.. భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ సమ్మె జరగడం, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉండటంతో ఆ ప్రభావం హుజూర్‌నగర్ ఉప ఎన్నికపై పడుతుందేమోనన్న ఆందోళన గులాబీ శ్రేణుల్లో కనిపించింది.
అయితే, ఈసారి హుజూర్ నగర్ ప్రజలు గులాబీ అభివృద్ధి మంత్రానికి ఓటేశారు. మూడుసార్లు గెలిపించినప్పటికీ ఉత్తమ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, గులాబీ గెలుపుతోనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమంటూ సైదిరెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ ప్రచారం ఫలించినట్టు ఉప ఎన్నిక ఫలితాల్లో స్పష్టమవుతోంది. ఇక్కడ అంచనాలకు మించి కారు జోరుగా దూసుకుపోతుండటంతో ప్రతిపక్ష పార్టీలు బొక్కాబోర్లా పడ్డాయి. తెలంగాణలో తామే ప్రధాన ప్రతిపక్షమంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీకి డిపాజిట్ దక్కని పరిస్థితి కనిపిస్తోంది. అటు, తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ ఉనికి కోసం హుజూర్‌నగర్‌లో పోటీచేసినా ఘోరమైన భంగపాటు తప్పలేదు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.. టీపీసీసీ చీఫ్ నియోజకవర్గం అయిన హుజూర్‌నగర్ పూర్తిస్థాయిలో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టినట్టు కనిపిస్తోంది. హస్తం పార్టీకి గట్టి పట్టున్న మండలాల్లోనూ గులాబీకి ఆధిక్యం దక్కడం ఇక్కడ టీఆర్‌ఎస్ జోరును చాటుతోంది.
బెట్టింగ్‌రాయుళ్ల జోరు
రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితంపై జోరుగా బెట్టింగులు జరిగాయి. ఈ ఉప ఎన్నిక ఫలితం ఎటువైపు మొగ్గు చూపుతుందన్న దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున పందాలు కాశారు. వేయి నుంచి లక్షల రూపాయల వరకు పందాలు సాగాయి. ఎగ్జిట్‌పోల్ ఫలితాలతోపాటు పోలింగ్ సరళిలోనూ టీఆర్‌ఎస్‌కు సానుకూలత ఉండటంతో ఆ పార్టీకి వ్యతిరేకంగా పందాలు కాసిన వారికి భారీ ఆఫర్లు ఊరించాయి. ఏ పార్టీ గెలుస్తుందనే దానితోపాటు ఆయా పార్టీలకు వచ్చే మెజార్టీల మీద కూడా బెట్టింగులు నడిచాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌కు ఎంత మెజార్టీ వస్తుందనే దానిపైనే పెద్ద ఎత్తున పందాలు సాగాయి.
టీఆర్‌ఎస్ గెలుస్తుందని 100 రూపాయలు బెట్టింగ్ చేస్తే 75 రూపాయలే ఇస్తామని, టీఆర్‌ఎస్‌కు 10వేల మెజార్టీ వస్తుందంటే రూపాయికి రూపాయిన్నర, 20వేల మెజార్టీ వస్తుందని పందెం కాస్తే రూపాయికి రెండు రూపాయలు ఇస్తామనే స్థాయిలో బుకీలు, స్థానిక బెట్టింగ్ రాయుళ్లు ఆఫర్లు ఇచ్చినట్టు తెలిసింది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా బెట్టింగ్‌చేసిన వాళ్లు పెద్ద ఎత్తున నష్టపోయినట్టు సమాచారం అందుతోంది. ఇక, టీఆర్‌ఎస్ గెలుపు, మెజారిటీలపై బెట్టింగ్ కాసినవాళ్లు లాభపడినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోనూ, ఆ నియోజకవర్గానికి సరిహద్దుగా ఉన్న జిల్లాల్లోనూ బెట్టింగులు సాగాయి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ హుజూర్‌నగర్ ఫలితంపై పందాలు జోరుగా సాగాయి.
Comments
Please login to add a commentAdd a comment