సాక్షి, హుజూర్‌నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ గడప గడపకు తిరిగి ఓట్లడిగామని టీఆర్‌ఎస్ హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ఇంచార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక అయి పోగానే ఉత్తమ్ పీసీసీ పోస్ట్ ఊడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. రేవంత్, కోమటిరెడ్డి పీసీసీ పదవి కోసం రోడ్ల మీద పడి కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం రాజేశ్వర్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి హుజూర్‌నగర్ ప్రజలను రెచ్చగొట్టేలా, అవమానించేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుడైన సైదిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని హుజూర్‌నగర్ ప్రజలంతా మనసారా కోరుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ బండ ప్రకాశ్, ప్రభుత్వ విప్ బోడకంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, హుజూర్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి పాల్గొన్నారు.
ఉత్తమ్ ముక్కు నేలకు రాయాలి..
‘ఇది టీఆర్‌ఎస్ అభివృద్ధికి అభివృద్ధి నిరోధక ఉత్తమ్ కుటుంబానికి వచ్చిన ఉప ఎన్నిక. ఒక్క అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపిస్తా. ప్రజలంతా గమనిస్తున్నరు. ఉత్తమ్ అహంకారానికి బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నరు. పద్మావతి రెడ్డికి ఘోర పరాజయం తప్పదు. హుజూర్‌నగర్ అభివృద్ధి కోసమే ఈ ఎన్నిక వచ్చింది. టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు హుజూర్‌నగర్ ప్రజలంతా సిద్ధంగా ఉన్నరు. ఓటమి భయంతో ఉత్తమ్ కాంగ్రెస్ లీడర్లందరినీ ఇక్కడకు రప్పించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిండు. నా పై ఉత్తమ్ చేసిన ఆరోపణలు నిరూపించాలి. లేదంటే ఉత్తమ్ భేషరతుగా క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలి’అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment