ఉప పోరు హోరు | Huzurnagar Bypoll : Tough Fight Between Congress And TRS | Sakshi
Sakshi News home page

హుజూర్‌నగర్‌ ఉప పోరు హోరు

Published Wed, Sep 25 2019 2:15 AM | Last Updated on Wed, Sep 25 2019 8:33 AM

Huzurnagar Bypoll : Tough Fight Between Congress And TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక... ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాలను కుదిపే స్తోంది. అధికార, ప్రతిపక్షాలకు అసలైన పరీ క్షగా మారింది. దీంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మ కంగా తీసుకుంటున్నాయి. హుజూర్‌నగర్‌లో గెలవడం ద్వారా ప్రజామోదం తమకే ఉం దని చెప్పడంతోపాటు తమ పాల నపై విపక్షాల ఆరోపణలన్నింటికీ చెక్‌ పెట్టాలనే ఆలోచనలో టీఆర్‌ఎస్‌ ఉంది. మరోవైపు సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవ డం ద్వారా టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాన్ని ఇవ్వడంతోపాటు రాష్ట్రంలో బలపడ దామనుకుంటున్న బీజేపీని వెనక్కు నెట్ట వచ్చని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈనేపథ్యంలో భవిష్యత్‌ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతుందనే అంచనా నడుమ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఎవరి లెక్కలు వారివే...
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో గెలుస్తామనే భావనతో ఇరు పార్టీలూ ఉన్నా అధికార పార్టీకి ఉప ఎన్నికలో కలసి వచ్చే సంప్రదాయం టీఆర్‌ఎస్‌కు అను కూలిస్తుందని రాజకీయ వర్గాలం టున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కేసీఆర్‌ చరిష్మా, గత ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగా సైదిరెడ్డిపై ఉండే సానుభూతి, ఎన్నికల ప్రచార వ్యూహాలు గెలిపిస్తాయని గులాబీ శిబిరం ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే అంతర్గతంగా ఆ పార్టీలో కొంత సమన్వయ లోపం కనిపి స్తోంది. ఇక కాంగ్రెస్‌ విషయానికి వస్తే ఎమ్మెల్యేగా ఉత్తమ్‌ చేసిన అభివృద్ధి, నియోజకవర్గంలో ఉన్న సంప్ర దాయ ఓటు బ్యాంకు ఆ పార్టీకి ప్రధాన బలాలుగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు లేకపోయినా ఆ పార్టీ నేతలపై అధికార పార్టీ చేసే ఒత్తిడి, క్షేత్రస్థాయి నేతల్లో పార్టీ అధికారంలో లేదనే భావన కొంత ప్రతికూల ప్రభావం చూపవచ్చని అంచనా.

అభివృద్ధే ప్రజల ఎజెండా...
రాజకీయ పార్టీల ఆలోచనలు ఎలా ఉన్నా హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ప్రజల్లో మాత్రం అభివృద్ధే ఎజెండాగా కనిపిస్తోంది. ఏ పార్టీ అభ్యర్థికి ఓటేయాలన్న దానిపై ఇక్కడి ప్రజలు అభివృద్ధి కోణంలోనే విశ్లేషణలు చేసుకుంటుండటం గమనార్హం. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందనే భావన కొంతమేర ప్రజల్లో వ్యక్తమవుతోంది. దీనికితోడు రైతుబంధు, పింఛన్ల పెంపు, మిషన్‌ భగీరథతోపాటు ఇతర సంక్షేమ పథకాలను చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటేయవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఉత్తమ్‌ చేసిన అభివృద్ధి ఈ వాదనను కొంత నీరుగారుస్తోందని చెప్పక తప్పదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు, సబ్‌స్టేషన్లు, లిఫ్టులు, పేదలకు ఇళ్ల విషయంలో అభివృద్ధి జరిగిందనే భావన ఇప్పటికీ నియోజకవర్గ ప్రజల్లో నిలిచిపోయింది. దీనికితోడు గత ఐదేళ్లుగా టీఆర్‌ఎస్‌ హాయాంలో చెప్పుకోదగిన అభివృద్ధి పనులేవీ జరగలేదనే అభిప్రాయం కూడా ప్రజలపక్షాన వినిపిస్తోంది. ఎంపీగా ఉత్తమ్‌ ఉన్నందున ఎమ్మెల్యేగా ఆయన సతీమణిని గెలిపిస్తే నియోజకవర్గానికి భారీగా నిధులు వస్తాయనే వాదన కూడా వినిపిస్తోంది. ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు ఖరారైన నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతిరెడ్డి ఈ నెల 30న భారీ ఎత్తున నామినేషన్‌ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి ఈ నెల 26 లేదా 28 తేదీల్లో సుముహూర్తం చూసుకొని నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారం కూడా నియోజకవర్గంలో అప్పుడే వేడెక్కింది. ఇరు పార్టీలు ప్రచార సభలు నిర్వహిస్తూ ఇతర పార్టీల కార్యకర్తలను పెద్ద ఎత్తున పార్టీలోకి చేర్చుకుంటున్నాయి. ఇక సోషల్‌ మీడియా వేదికగా ఇరు పార్టీలు, ఆయా పార్టీల అభ్యర్థులపై ఆరోపణలు, ప్రత్యారోపణలు దుమ్మురేపుతున్నాయి. 

ఇతర పార్టీలేమంటాయో?
ప్రధాన పక్షాలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లే కాకుండా నియోజకవర్గంలో టీడీపీ, సీపీఎం, సీపీఐలకు కూడా కొంత పట్టు ఉంది. బీజేపీ, టీజేఎస్‌కు సంస్థాగతంగా పట్టు లేనప్పటికీ కశ్మీర్‌ అంశంతోపాటు ఇటీవల తెరపైకి వచ్చినట్లుగా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నామన్న సంకేతాలు కూడా ఆ పార్టీకి కొన్ని ఓట్లు రాలుస్తాయని రాజకీయ విశ్లేషకులంటున్నారు. టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కాంగ్రెస్‌కు మద్దతిచ్చే లైన్‌లోనే ఉండగా, గత ఎన్నికల్లో 2 వేల పైచిలుకు ఓట్లు తెచ్చుకున్న సీపీఎం మాత్రం ఇంకా డైలమాలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. మొత్తంమీద ఈ పార్టీల వైఖరి, ఆయా పార్టీలకు వచ్చే ఓట్లు కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావితం చూపే అవకాశం లేకపోలేదు.

గత ఎన్నికలను పరిశీలిస్తే....!
2009లో తొలిసారి హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత విద్యుత్‌ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80,835 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌కు 51,641 ఓట్లు వచ్చాయి. 2014లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఉత్తమ్‌కు 79,879 ఓట్లు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకరమ్మకు 45,955 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి దాదాపు 30 వేల ఓట్లు రాగా టీడీపీకి కూడా 25 వేల ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బరిలోకి దిగలేదు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కు 92,996 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో ఉన్న శానంపూడి సైదిరెడ్డికి 85,530 ఓట్లు పోలయ్యాయి. దాదాపు 7,400 ఓట్ల మెజారిటీతో ఉత్తమ్‌ గెలుపొందారు.

ఈ ఎన్నికల తర్వాత ఉత్తమ్‌ నల్లగొండ ఎంపీగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పోలయిన ఓట్లను పరిశీలిస్తే హుజూర్‌నగర్‌లో వరుసగా నాలుగోసారి కూడా ఉత్తమ్‌కే మెజారిటీ లభించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కు హుజూర్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో 88,138 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేంరెడ్డి నర్సింహారెడ్డికి 75,145 ఓట్లు పోలయ్యాయి. అంటే 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకన్నా దాదాపు 5 వేలు ఎక్కువగా 12,993 ఓట్ల మెజారిటీ రావడం గమనార్హం. మరి ఈసారి జరిగే ఉప ఎన్నికలో ఉత్తమ్‌ సతీమణి పద్మావతి విజయం సాధిస్తారా? అనూహ్యంగా అధికార టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం కడతారా అన్నది అక్టోబర్‌ 24న తేలనుంది. 

పద్మావతికే కాంగ్రెస్‌ టికెట్‌ 
సాక్షి, న్యూఢిల్లీ:  హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గా పద్మావతిరెడ్డి బరి లో నిలవనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాఆమె అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారని పార్టీ ప్రధానకార్యదర్శి ముకుల్‌ వాస్నిక్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.   

బీజేపీ అభ్యర్థిగా శ్రీకళారెడ్డి?
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా శ్రీకళారెడ్డిని పోటీలో దింపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న రామకృష్ణ, జైపాల్‌రెడ్డి, రవీంద్రనాయక్, రాంమోహన్‌రెడ్డి, రామారా వు, రవీందర్, శ్రీకళారెడ్డి, భాగ్యరెడ్డి తదితరు ల బలాబలాలపై పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అ«ధ్యక్షతన జరిగిన కోర్‌కమిటీ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. రెండురోజుల్లో పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని లక్ష్మణ్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement