నిరుద్యోగ నిరసన దీక్షలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో శివసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్న కారణంగా కొంత సంయమనం పాటించాల్సి వస్తోంది. నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉన్నట్టయితే సీఎం కేసీఆర్ గుండెల్లో నిద్రపోయేవాడిని. ఆయన పడుకున్నా కళ్లు తెరిచి నిద్రపోయేలా, గుండెల్లో గునపం దింపేలా ఉద్యమించేవాడిని’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్‌లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘నిరుద్యోగ నిరసన దీక్ష’జరిగింది. దీక్షలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తదితరులకు రేవంత్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. తర్వాత రేవంత్ మాట్లాడుతూ.. ‘నాడు రాష్ట్ర సాధన ఉద్యమంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వంద లాది మంది పేదోళ్ల బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు రాక, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని భరించలేక ఆ బిడ్డలే చనిపోతున్నారు’అని ఆవేదన వ్యక్తం చేశారు. 1.9 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఏమైందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడని నిలదీశారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఒక్క చెప్పుకోదగ్గ నోటిఫికేషన్‌ను కేసీఆర్ ఇవ్వలేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు భృతి కింద రూ.3,016 ఇస్తా నని చెప్పి ఆ హామీని పట్టించుకోకుండా నిరుద్యోగ యువత పొట్టకొడుతున్నారని విమర్శించారు.
తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 12 నెలల్లో అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ చెప్పారు. గోల్కొండ కోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం, ప్రగతి భవన్‌ను అంబేద్కర్ భవన్‌గా మారుస్తూ తొలి సంతకం చేయడం ఖాయమని చెప్పారు. శివసేనారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించాలని, లేదంటే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని చెప్పారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, టీపీసీసీ పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి, యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు మల్లు రవి, అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment