హుజూర్‌నగర్ ఉప ఎన్నికను రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీచేసి గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. తనకు కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో మరోసారి గెలుపు ఖాయమన్న ధీమాతో ఉత్తమ్.. తన సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన సైదిరెడ్డిని మరోసారి టీఆర్‌ఎస్ బరిలోకి దింపింది. బీజేపీ, టీడీపీ వంటి పార్టీలు బరిలో నిలిచినా.. పెద్దగా ప్రభావం చూపలేదు. టీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. ఇరుపార్టీల అగ్రనేతలు పెద్దసంఖ్యలో మోహరించి.. భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ సమ్మె జరగడం, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉండటంతో ఆ ప్రభావం హుజూర్‌నగర్ ఉప ఎన్నికపై పడుతుందేమోనన్న ఆందోళన గులాబీ శ్రేణుల్లో కనిపించింది.