
సాక్షి, హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్‌ఎస్ ఎన్నికల వ్యూహం, ప్రచార ప్రణాళికను ఖరారు చేసింది. పార్టీ హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రులు జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ సమక్షంలో పార్టీ ఇన్‌చార్జిలు గురువారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యా రు. క్షేత్ర స్థాయిలో ప్రచార వ్యూహం.. సీఎం కేసీఆర్, కేటీఆర్ పాల్గొనే రోడ్ షోలు, ప్రచార సభలపై సమావేశంలో చర్చించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఇన్‌చార్జిలుగా వ్యవహరించే పార్టీ నేతల తో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సమావేశమై.. ఎన్నికల వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. ఇన్‌చార్జిల నియామకంలో కొన్ని మార్పుచేర్పులు చేయాలనే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సూచన మేరకు ఉప ఎన్నిక ఇన్‌చార్జిలు మరోమారు సమావేశమయ్యారు. మండలాలు, మున్సి పాలిటీల వారీగా నిర్ణయించిన ఇన్‌చార్జిల జాబితా లో గురువారం మార్పులు చేశారు. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు లేని మంత్రులు, ఎమ్మెల్యేలను నూతనంగా ఇన్‌చార్జిల జాబితాలో చేర్చడంతో.. ఉప ఎన్నిక ఇన్‌చార్జిల సంఖ్య 60కి చేరింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలను హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారం, సమన్వయ బాధ్యతలకు దూరంగా ఉంచా లని తొలుత నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయభాస్కర్‌తో పాటు ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, రవీంద్రకుమార్ తదితరులను ఇన్‌చార్జిల జాబితాలో చేర్చారు.
సామాజికవర్గాల వారీగా బాధ్యతలు..
హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని ఓటర్లను చేరువయ్యే క్రమంలో సామాజికవర్గాల వారీగా మద్దతు కూడగట్టుకోవాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. నియోజకవర్గంలోని ఓ బలమైన సామాజికవర్గం ఓటర్లను దృష్టిలో పెట్టుకుని మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్‌కు బాధ్యతలు అప్పగించారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశానికి హాజరైన వీరికి.. మండలాల వారీగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
కేసీఆర్ సభలు..
ఉప ఎన్నికల టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిలుగా బాధ్యతలు స్వీకరించిన నేతలు.. శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారు. నెలాఖరులోగా పార్టీ ఇన్‌చార్జీలతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో మరోమారు సమావేశమయ్యే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ పాల్గొనే ఎన్నికల ప్రచార బహిరంగ సభకు సంబంధించి త్వరలో తేదీ ఖరారు అవుతుందని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.