హుజూర్‌నగర్‌లో ప్రచార జోరు పెంచిన ప్రధాన పార్టీలు | The Main Parties Been Campaigning In Huzurnagar | Sakshi
Sakshi News home page

హుజూర్‌నగర్‌లో ప్రచార జోరు పెంచిన ప్రధాన పార్టీలు

Published Thu, Oct 10 2019 10:42 AM | Last Updated on Thu, Oct 10 2019 10:42 AM

The Main Parties Been Campaigning In Huzurnagar - Sakshi

సాక్షి, సూర్యాపేట: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల సమరంలో ప్రచారం హోరెత్తుతోంది. దసరా రోజు కూడా ప్రధాన రాజకీయ పార్టీలు మండలాల్లో జోరుగా ప్రచారం చేశాయి. పోలింగ్‌కు ఇక పది రోజుల సమయమే ఉండడంతో ఆయా పార్టీ అగ్రనేతలను ప్రచారానికి దింపే షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నాయి. ఈ నెల 11 నుంచి 13 వరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షోలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. అలాగే 18న సీఎం కేసీఆర్‌ హుజూర్‌నగర్‌లో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ నుంచి ఏఐసీసీ నేతలు, బీజేపీ నుంచి ఆపార్టీ జాతీయ నేతలు ప్రచారానికి రానున్నట్లు తెలిసింది.  

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తెలంగాణ జనసమితి, టీఆర్‌ఎస్‌కు సీపీఐ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు మద్దతిచ్చాయి. అలాగే సీపీఎం అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించడంతో  తెలంగాణ ప్రజా పార్టీ అభ్యర్థి దేశగాని సాంబశివగౌడ్‌కు ఆపార్టీ మద్దతు తెలిపింది. ఇక బీజేపీ, టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. మొత్తం 28 మంది పోటీలో ఉంటే 13 మంది పార్టీల అభ్యర్థులు కాగా 15 మంది ఇండిపెండెంట్లు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు కొంత మంది ఇండిపెండెంట్లు కూడా ఈ ఎన్నికల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నెల 21న పోలింగ్‌ కావడంతో ప్రచారం ఈ నెల 19న సాయంత్రంతో ముగియనుంది. ‘మేము అదిచేస్తాం.. ఇది చేస్తాం’ అంటూ అభ్యర్థుల ప్రచా రం, కళా బృందాల సందడితో ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గంలోని పల్లెలు, పట్టణాలు మార్మోగుతున్నాయి.  

మళ్లీ వస్తున్న గులాబీ బాస్‌లు.. 
పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈనెల 4న హుజుర్‌నగర్‌లో రోడ్‌ షో నిర్వహించారు. ఈ కార్యక్రమం భారీగా విజయవంతం అయిందని, గెలుపు తమదేనని టీఆర్‌ఎస్‌ కేడర్‌ ధీమాగా ఉంది. ఈనెల 11 నుంచి 13 వరకు మూ డు రోజులు నియోజకవర్గంలోని అన్ని మం డాల్లో కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహిం చనున్నారు. 11న సాయంత్రం 4 గంటలకు పాలకవీడు మం డలం జాన్‌పహాడ్, 5 గంటలకు నేరేడుచర్ల మం డలం, పట్టణం, 12న సాయంత్రం 5 గంటలకు చింతలపాలెం, 6 గంటలకు మేళ్లచెరువు, 13న సాయంత్రం 4 గంటలకు మఠంపల్లి, 6 గంటలకు గరిడేపల్లి మండలాల్లో రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో చివరిగా సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ హుజూర్‌నగర్‌లో పెట్టేం దుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేటీఆర్‌ రోడ్‌ షోలు, కేసీఆర్‌ సభలతో పార్టీ కేడర్‌ జోష్‌తో ఎన్నికలకు సమాయత్తం కానుందని... నేతలు అభిప్రాయం వ్యక్తంచేశారు.  

జోరుగా కాంగ్రెస్‌ నేతల ప్రచారం.. 
తమ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారాన్ని దూకుడుగా చేస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి పద్మావతి రోజుకు రెండు మండలాల్లో ప్రచారం చేస్తున్నారు. ఉదయం నుంచే ఇరువురు నేతలు ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దసరా పండుగకు ముందు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేరేడుచర్ల మండలం, బుధవారం గరిడేపల్లి మండలంలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి ప్రచారం చేశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్,  పలు జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఇప్పటి వరకు ప్రచారంలో పొల్గొన్నారు. వీరితో పాటు ఏఐసీసీ నుంచి ముఖ్య నేతలు ఈ వారం రోజులు హుజూర్‌నగర్‌లోనే ఉండి ప్రచారం చేయనున్నట్లు తెలిసింది. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్య నేతలతో పాటు ఏఐసీసీ నేతలను ఆహ్వానించి భారీ బహిరంగ సభ పెట్టనన్నట్లు సమాచారం. గత నెల 30న నామినేషన్‌ వేసిన సందర్భంగా హుజూర్‌నగర్‌లో పెట్టిన సభ సక్సెస్‌ అయిందని, మరో సభతో తమ సత్తా ఏంటో చూపిస్తామని కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు.  

బీజేపీ..టీడీపీ.. ఇండిపెండెంట్లు సై.. 
ఈ ఎన్నికల్లో బీజేపీ,టీడీపీ, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ప్రచారాన్ని కదంతొక్కిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఇప్పటి వరకు ప్రచారంలో పొల్గొన్నారు. ప్రచారం ముగిసే లోపు బహిరంగ సభ పెడతామని, ఈ సభకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రానునున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. అలాగే టీడీపీ అభ్యర్థి తరఫున పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్‌ ఎల్‌.రమణ ప్రచారం చేశారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులు తీన్మార్‌ మల్లన్న, దేశగాని సాంబశివగౌడ్‌లు రోజుకో మండలంలో ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రచార రథాలు ఏర్పాటు చేసుకొని జోరుగా ప్రచారం చేసుకుంటూ  ప్రధాన పార్టీల అభ్యర్థులను హడెలెత్తిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో పా టు.. బీజేపీ,టీడీపీ, ఇండిపెండెంట్లు నువ్వా.. నేనా అన్నట్లుగా ప్రచారంలో మరింత దూకుడు పెంచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement