
సూర్యాపేట : హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున అభ్యర్థిని నిలుపుతామని సీసీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హుజూర్‌నగర్‌లో శుక్రవారం సీపీఎం విస్తృత స్థాయి కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమ్మినేనితో పాటు, జాతీయ కమిటీ సభ్యులు సీతారాములు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. తమకు మద్దతిచ్చే అంశంపై సీపీఐ, తెలంగాణ జనసమితి, టీడీపీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.
కలిసివచ్చే పార్టీలతో కలిసి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలన విధానాలకు వ్యతిరేకంగా తమ ఎన్నికల ప్రచారం సాగిస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మతోన్మాదాన్ని పోషిస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక మాంద్యానికి మోదీ పాలనే కారణమని విమర్శించారు. అసెంబ్లీలో వామపక్షాలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని.. ప్రశ్నించే గొంతుక లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ కూడా జనసమితి, టీడీపీ, సీపీఐ మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తోంది.