టీఆర్‌ఎస్‌కు మద్దతు వెనక్కి.. | CPI Withdraw Support To TRS In Huzurnagar Bypoll | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు మద్దతు వెనక్కి..

Published Tue, Oct 15 2019 2:47 AM | Last Updated on Tue, Oct 15 2019 2:47 AM

CPI Withdraw Support To TRS In Huzurnagar Bypoll - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు ప్రకటిం చిన మద్దతును సీపీఐ ఉపసంహరించుకుంది. ఎవరికి మద్దతివ్వాలనే విషయంపై పార్టీ హుజూర్‌ నగర్‌ నియోజకవర్గ కమిటీని సంప్రదించి రెండు రోజుల్లో ప్రకటించాలని నిర్ణయించింది. సోమ వారం మఖ్దూం భవన్‌లో పార్టీ సీనియర్‌ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, కె.నారాయణ సమక్షంలో తొలుత రాష్ట్ర కార్యదర్శి వర్గం, ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఉపసంహరణ నిర్ణయంపై సమావేశం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించాలని మొదట తీసుకున్న నిర్ణయం వల్లే పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని సురవరం అభిప్రాయపడ్డారు. ఇద్దరు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్య నేపథ్యంలో మద్దతు ఉపసంహరణ నిర్ణయం సరైనదేనని పేర్కొన్నట్టు సమాచారం. ఆర్టీసీ కార్మికులు 10 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా, అన్యాయంగా ఉందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు.

సమ్మె హక్కును నిరాకరించి, కార్మిక సంఘాలతో చర్చించకుండా 48 వేల మందిని డిస్మిస్‌ చేసి, సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైందన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు పూనుకుని, కొత్త రిక్రూట్‌మెంట్‌ ప్రకటించి ఘర్షణ వాతావరణం కల్పించడాన్ని మానుకోవాలని సీపీఐ కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కార్మికులు ఆత్మహత్యలకు దిగుతున్నా, పరిష్కారానికి బదులు ప్రభుత్వం మరింత విద్వేషపూరితంగా వ్యవహరిస్తుండటంతో కార్మిక, శ్రామికవర్గ పార్టీగా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఉపసంహరించినట్టు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement