నేటి ఏసీ బస్.. నాటి డబుల్ డెక్కర్ బస్
ప్రజారవాణాలో అతి ముఖ్యమైన ఆర్టీసీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. నిజాం రైల్వేస్‌లో భాగంగా ‘రోడ్ ట్రాన్స్‌పోర్టు డివిజన్’ (ఆర్టీడీ) పేరుతో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో 1932లో ప్రగతి చక్రం ప్రస్థానం ప్రారంభమైంది. 22 బస్సులు, 166 మంది సిబ్బందితో తొలుత పరుగులు పెట్టింది. ఆ తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. ప్రజా రవాణా రంగంలోనే అతి పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. అయితే ఆర్టీసీ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం వివిధ సందర్భాల్లో సమ్మెకు దిగిన సందర్భాలున్నాయి. కానీ ఈసారి చేస్తున్న సమ్మె... ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్దదిగా మారనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కార్మికులు 27 రోజులు సమ్మె చేయగా... ఇప్పుడు చేపట్టిన సమ్మెకు ఇప్పటికే 25 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం
సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీసీ...ఒక సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ప్రజా రవాణా సంస్థ. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న ఆర్టీసీలో కార్మికులు చేపట్టిన సమ్మె 25వ రోజుకు చేరుకుంది. ఇరువై ఐదు రోజులు గడిచినప్పటికీ అనిశ్చితి తొలగిపోవడంలేదు. దీంతో ఇప్పటి వరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెలలో ఇదే అతిపెద్ద సమ్మెగా మారుతోంది. ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన కాలంలో రోడ్డు రవాణా విభాగం (ఆర్టీడీ)గా నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేస్‌లో ఒక విభాగంగా మొదలైంది. అంచెలంచెలుగా ఎదిగింది. ప్రజా రవాణా రంగంలోనే అతి పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. నిజానికి ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ కాలంలోనే రైల్వే రంగానికి బలమైన పునాదులు ఏర్పడ్డాయి. ఉస్మాన్ అలీఖాన్ సమయంలో రవాణా రంగం బాగా విస్తరించుకుంది. రైల్వే, ఆర్టీసీ, విమానయాన సేవలతో నిజాం రవాణా వ్యవస్థ సుసంపన్నమైంది.
గౌలిగూడ బస్‌స్టేషన్
ఇదే అతి పెద్ద సమ్మె...
♦ ఆర్టీసీలో తరచుగా సమ్మెలు జరుగుతూనే ఉన్నాయి. తమ డిమాండ్‌ల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు చివరి అస్త్రంగా సమ్మెను సంధిస్తున్నాయి. జీతాల పెంపు, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ బకాయిల చెల్లింపు, ప్రైవేట్ బస్సుల అక్రమ రవాణాను అరికట్టడం, రన్నింగ్ టైమ్ పెంచడం వంటి డిమాండ్‌ల సాధన కోసం కార్మికులు ఇప్పటి వరకు అనేక సార్లు సమ్మెకు దిగారు.
♦ సమస్యల పరిష్కారం కోసం 2000 సంవత్సరంలో కార్మికులు 14 రోజుల పాటు సమ్మె చేశారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమయ్యాయి. అప్పట్లో సమ్మె జనజీవితంపైన ప్రభావం చూపింది. ప్రైవేట్ రవాణా సదుపాయాలు తక్కువగా ఉండడం, ఎక్కువ మంది ప్రయాణికులు ఆర్టీసీపైనే ఆధారపడడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
♦ మోటారు వాహన పన్ను రద్దుతో పాటు, ఆర్టీసీ అభివృద్ధికి నిధుల కేటాయింపు, తదితర డిమాండ్‌లతో 2003లో మరోసారి కార్మికులు సమ్మెకు దిగారు. అప్పట్లో సమ్మె ఉధృతంగా సాగింది. 24 రోజుల పాటు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల సమ్మెను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నించింది. చివరకు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
♦ ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న రోజుల్లో సకల జనుల సమ్మెలో భాగంగా 2011 అక్టోబర్ నెలలో కార్మికులు 27 రోజుల పాటు సమ్మె చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కార్మికులు ముందంజలో నిలిచారు. సర్వీసులన్నీ స్తంభించాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
♦ కానీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెలలో మాత్రం ప్రస్తుతంకొనసాగుతున్నదే అతి పెద్ద సమ్మెగా నిలిచింది. ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితిలో ఇప్పటికే 25వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన ఈ సమ్మెకు కనుచూపు మేరలో పరిష్కారం కనిపించడం లేదు.
♦ ఈ సమ్మెతో నగరంలో ప్రజారవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రైవేట్ సిబ్బంది సహాయంతో పాక్షికంగా బస్సులు నడుపుతునప్పటికీ ప్రజలకు పూర్తిస్థాయిలో రవాణా సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
♦ మరోవైపు సమ్మె కారణంగా ఆర్టీసీ సైతం కోట్లాది రూపాయల నష్టాన్ని చవి చూస్తోంది. సాధారణ రోజుల్లో 3750 బస్సులతో, 42 వేల ట్రిప్పులు నడిచే సిటీ బస్సుల్లో ప్రతి రోజు 32 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం 1000 నుంచి 1500 బస్సులు మాత్రం రోడ్డెక్కుతున్నాయి.
నిజాం కాలం నాటి బస్ టికెట్
ఇదీ చరిత్ర......
బ్రిటీష్ పాలిత ప్రాంతాలకు ధీటుగా హైదరాబాద్ స్టేట్‌లో రవాణా సదుపాయాలు విస్తరించుకున్నాయి. విశాలమైన రహదారుల నిర్మాణం జరిగింది. హైదరాబాద్ నగరంలో అప్పటి వరకు కేవలం సంపన్నవర్గాలకు మాత్రమే పరిమితమైన మోటారు వాహన సదుపాయం క్రమంగా సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్–హైదరాబాద్ నగరాల మధ్య రవాణా సదుపాయాలు పెరిగాయి. ఆ రోజుల్లో ఇదే ప్రధానమైన మార్గం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి హుస్సేన్‌సాగర్ చెరువు కట్ట మీదుగా ఆబిడ్స్, కోఠీ మార్గంలో బస్సులు తిరిగేవి. 1879లో ఆవిర్భవించిన నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే సంస్థ తొలిసారిగా సికింద్రాబాద్ నుంచి వాడి వరకు రైల్వే సేవలను ప్రారంభించింది. ఈ నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేస్‌లో ఒక విభాగంగానే 1932లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ’నిజాం స్టేట్ రైల్వేస్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ డివిజన్’ను ఏర్పాటు చేశారు.ఇలా హైదరాబాద్ రాజ్యంలో రోడ్డు రవాణా వ్యవస్థ ప్రారంభమైంది. 22 బస్సులు, 166 మంది సిబ్బందితో ఆర్టీసీ ప్రస్థానం మొదలైంది.ఈ బస్సులను స్కాట్లాండ్ ఆటోమొబైల్ సంస్థ అల్బైనో తయారు చేసింది. అప్పటి వరకు ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో ఈ బస్సులను రూపొందించారు.
1932లో తొలిసారి బస్సుల ప్రారంభం...
అమ్మ ప్రేమకు గుర్తుగా...
నిజాం కాలంలో బస్సు నంబర్ ప్లేట్‌పై హైదరాబాద్ స్టేట్‌ను సూచించేలా హెచ్‌వై తరువాత ’జడ్’ ఉండేది. ఉదాహరణకు ’హెచ్‌వై జడ్ 223.’ అనే నెంబర్‌తో బస్సులు కనిపించేవి. ఉస్మాన్ అలీఖాన్ తన తల్లి మీద ప్రేమతో ఆర్టీసీ బస్సల నెంబర్‌ప్లేట్‌లపైన ’జడ్’ అనే అక్షరాన్ని చేర్చారు. మొదట ఆయన తన తల్లి అమాత్ జహరున్నీసా బేగం పేరు మీద రోడ్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌ను ప్రారంభించాలనుకున్నారు. కానీ, ప్రభుత్వ సంస్థకు ఓ వ్యక్తి పేరు పెట్టడం తగదని మంత్రులు సూచించడంతో బస్సు నెంబర్‌లలో తన తల్లిపేరు కలిసి వచ్చేలా ఆమె పేరులోని ’జడ్’ (జహరున్నీసా) అనే అల్ఫాబెటిక్‌ను చేర్చారు. ఈ సంప్రదాయం అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ ప్రారంభమైన 1958 నుంచి కూడా బస్సుల రిజిస్ట్రేషన్‌లపై ’జడ్’ అనే అక్షరం వచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 2014లో ఆర్టీసీ విభజన తర్వాత కూడా ఈ సంప్రదాయం స్థిరంగా ఉంది. ఆర్టీఏలో పోలీసు వాహనాలకు ’ పీ’ సిరీస్‌తో, రవాణా వాహనాలకు ’టీ’ సీరిస్ నెంబర్లతో, ఆర్టీసీ బస్సులకు ’జడ్’ సిరీస్‌తో నంబర్లతో
రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment