ఆర్టీసీ సమ్మె: సొంత విధుల్లోకి ప్రైవేట్‌ డ్రైవర్లు | Private Drivers Going Back There own Work From TSRTC | Sakshi
Sakshi News home page

బస్సు దొరక్క!

Published Tue, Oct 22 2019 10:29 AM | Last Updated on Wed, Oct 30 2019 1:39 PM

Private Drivers Going Back There own Work From TSRTC - Sakshi

సుదీర్ఘ సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలలకుబయలుదేరిన విద్యార్థులు తొలిరోజే చుక్కలు చూశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సరిపడా బస్సులు లేకపోవడంతో విద్యాసంస్థలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి స్టాపుల్లో నిరీక్షించినా బస్సులు రాకపోవడంతో ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు. ఒకట్రెండు బస్సులు వస్తే అందులో కిక్కిరిసి ప్రమాదరక స్థితిలో ప్రయాణించారు. ప్రధానంగా నగర శివార్లలోని కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, అధ్యాపకులుఅవస్థలు పడ్డారు. అదనపు సర్వీసులు నడపాలని గ్రేటర్‌ ఆర్టీసీ భావించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మిగతా రోజులతో పోలిస్తే సర్వీసుల సంఖ్య మరింత తగ్గింది. తాత్కాలిక సిబ్బందితో ఇప్పటి వరకు 1300 బస్సులు నడపగా... అదికాస్త 1087కుపడిపోయింది. టెంపరరీ డ్రైవర్లు సొంత విధుల్లోకి వెళ్లడంతోఈ పరిస్థితి తలెత్తింది. విద్యాసంస్థల పునఃప్రారంభం సందర్భంగా‘సాక్షి’ సోమవారం విజిట్‌ నిర్వహించింది.  

సాక్షి,సిటీబ్యూరో: ఆర్టీసీ సమ్మె కష్టాలు సోమవారం విద్యార్థులను చుట్టుముట్టాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు తగినన్ని బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణ ప్రయాణికులు సైతం గంటల తరబడి బస్టాపుల్లో పడిగాపులు కాశారు. శివార్లలోని ఇంజినీరింగ్, ఒకేషనల్‌ కళాశాలలకు వెళ్లే విద్యార్థులు చేసేది లేక ఆటోలు, ఇతర ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు. చాలా మంది బైకులపై  త్రిబుల్‌ రైడింగ్‌ చేశారు. ఉదయం 7 నుంచి  9 గంటల మధ్య విద్యార్థులు, ఉద్యోగులు వాహనాలు దొరక్క నరకం చూశారు. తిరిగిన ఒకటి, రెండు బస్సుల్లోనూ కిక్కిరిసి వెళ్లారు. దసరా సెలవుల్లో సమ్మె ప్రారంభం కావడంతో ప్రభుత్వం వారం రోజుల పాటు సెలవులను పొడిగించిన సంగతి  తెలిసిందే. విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించేందుకు, ప్రైవేట్‌  సిబ్బంది సహాయంతో పూర్తిస్థాయిలో ఆర్టీసీ బస్సులను నడిపేందుకు అనువుగా ఈ సెలవులను పొడిగించారు. కానీ  విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైన సోమవారం నాటికి ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ 1087 బస్సులను మాత్రమే రోడ్డెక్కించగలిగింది. మరో 375 అద్దె బస్సులు ఉన్నప్పటికీ వాటిపై నియంత్రణ కొరవడింది. అవి ఏ రూట్‌లో తిరిగాయి.. ప్రయాణికులకు ఎలాంటి సేవలందజేశారనే అంశంపై స్పష్టత లేదు. నగరంలో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా కనీసం 2000 బస్సులను నడిపాలి. ఆర్టీసీ ప్రణాళిక రూపొందించినప్పటికీ ఆ స్థాయిలో నడపలేకపోయారు. తాత్కాలిక డ్రైవర్లలో చాలామంది తిరిగి తమ సొంత విధుల్లోకి వెళ్లిపోయారు. బస్సులు నడిపేవారు లేక  ఘట్కేసర్, బోగారం, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్, కీసర, బాచుపల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, గండిమైసమ్మ, తదితర ప్రాంతాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలలకు వెళ్లే సుమారు 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రయాణ గండం తప్పలేదు. 

మెట్రో బస్సులు నడపలేరు
ప్రస్తుతం పనిచేస్తున్న డ్రైవర్లు కేవలం అశోక్‌ లేలాండ్‌కు చెందిన ఆర్డినరీ బస్సులను మాత్రమే నడుపగలుగుతున్నారు. ఆర్టీసీలో ఉన్న 160 మార్కోపోలో లోఫ్లోర్‌ నాన్‌ ఏసీ, మరో 90 వోల్వో ఏసీ, మరో 6 మల్టి యాక్సిల్‌ బస్సులు, 40 రాజధాని ఏసీ బస్సులు, 246 మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నడపాలంటే ప్రత్యేక శిక్షణ పొందినవారు అవసరం. ఆర్టీసీలో అనుభవం ఉన్నవారికే ఈ బస్సులను అప్పగిస్తారు. ప్రస్తుతం తాత్కాలికంగా విధుల్లో చేరుతున్న వాళ్లంతా లారీలు, ట్రాక్టర్లు నడిపిన వాళ్లే కావడంతో ఈ బస్సులను వారికి అప్పగించడం లేదు.  

వెంటాడుతున్న డ్రైవర్ల కొరత
ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో మొత్తం 3,775 బస్సులు తిరుగుతుంటాయి. 19,500 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. వీరిలో 7.5 వేల మంది డ్రైవర్లు, మరో 7 వేల మంది కండక్టర్లు ఉన్నారు. 17 రోజులుగా సిబ్బంది మొత్తం సమ్మెలో ఉండడంతో కేవలం డిపోమేనేజర్లు విధులు నిర్వహిస్తున్నారు. అయితే, తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లతో బస్సులు నడుస్తున్నాయి. కండక్టర్లుగా పని చేసేందుకు చాలా మంది సుముఖంగా ఉన్నప్పటికీ డ్రైవర్లు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. మరోవైపు స్కూల్‌ బస్సులు, కాలేజీ బస్సులు నడిపే డ్రైవర్లే ఇప్పటి దాకా బస్సులు నడిపారు. కానీ విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో వారంతా తిరిగి తమ విధులకు వెళ్లారు. దీంతో ప్రైవేట్‌ సిబ్బంది సహాయంతో నడిపే బస్సుల సంఖ్య 1300 నుంచి 1087కు పడిపోయింది.   

నో టిమ్స్‌..టికెట్‌
ప్రైవేట్‌ సిబ్బంది దోపిడీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బస్సుల్లో ప్రింటెడ్‌ టిక్కెట్‌ల జారీని ప్రవేశపెట్టనున్నట్లు రవాణాశాఖ ప్రకటించింది. అలాగే టిమ్స్‌ యంత్రాల ద్వారా టిక్కెట్‌లను అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ సదుపాయం రాలేదు. మరోవైపు సొంత ప్రింటింగ్‌ప్రెస్‌ లేకపోవడం వల్ల ప్రింటెడ్‌ టిక్కెట్‌ల కోసం ఇతర ముద్రణ సంస్థలపై ఆధార పడాల్సి వస్తుంది. మియాపూర్‌ బస్‌బాడీ యూనిట్‌లో ఉన్న ప్రింటింగ్‌ ప్రెస్‌ను గతంలోనే మూసేశారు. దీంతో ఆర్టీసీలో టిక్కెట్ల జారీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశంపై  అనిశ్చితి నెలకొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement