సాక్షి, హుజూర్‌నగర్: రాష్ట్ర రాజకీయాల్లో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారం అధికార, ప్రతిపక్ష పార్టీలకు మధ్య హోరాహోరీగా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో పార్టీలు ప్రచార జోరును పెంచాయి. అయితే భారీ వర్షం కారణంగా సీఎం కేసీఆర్ బహిరంగసభ రద్దు కావటంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో నిరాశ వ్యక్తం అవుతోంది. కేసీఆర్ సభతో హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలు, ఓటర్లలో కొత్త జోష్ తేవాలని భావించిన టీఆర్‌ఎస్ నేతలు సభ రద్దుతో నిరుత్సహపడ్డారు. ముఖ్యమంత్రి సభ రద్దైనప్పటికీ ప్రచార జోరును ప్రతి పక్షాలకు దీటుగా కొనసాగించాలనే వ్యూహంతో టీఆర్‌ఎస్ నేతలు సమావేశం అయ్యారు. సభ రద్దు అయిందని ప్రకటించిన వెంటనే మంత్రి జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి, జిల్లా ఎమ్యెల్యేలంతా ప్రత్యేకంగా భేటీ ఆయ్యారు. తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపారు.
మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ సభ రద్దు కావటంతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తోంది. సీఎం సభ అనగానే కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకింత కలవరపాటు నెలకొంది. నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ ఎలాంటి హామీలు ఇస్తారో.. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఎటువంటి ప్రకటన చేసి ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపుతారోనని అనుకున్నారు. కానీ, సభ రద్దు కావటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎంసభ రద్దు కావటం టీఆర్‌ఎస్ పార్టీకి, శ్రేణులకు ఎదురుదెబ్బ అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment