దేశానికి చోదకశక్తి మనమే! | Telangana: KTR Lays Foundation Stone For IT Hub In Nalgonda | Sakshi
Sakshi News home page

దేశానికి చోదకశక్తి మనమే!

Published Sat, Jan 1 2022 1:43 AM | Last Updated on Sat, Jan 1 2022 1:43 AM

Telangana: KTR Lays Foundation Stone For IT Hub In Nalgonda - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అన్నిరంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా నిలిచే నాలుగో రాష్ట్రం మనదేనని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో సమ్మిళిత అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. శుక్రవారం నల్లగొండలో ఐటీ హబ్, సమీకృత వెజ్‌–నాన్‌వెజ్‌ మార్కెట్‌లకు మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డిలతో కలిసి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లా డారు. అన్ని ప్రాంతాలను, అన్ని రంగాలను సమా నంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకెళ్తోందని కేటీఆర్‌ చెప్పారు. గత 65 ఏళ్ల పాలించిన నాయకులు నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ను పెంచి పోషించారని.. టీఆర్‌ఎస్‌ సర్కారు గత ఆరేళ్లలోనే ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టిందని చెప్పారు.

నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్‌ కాలేజీలు, యాదాద్రి జిల్లాలో ఎయిమ్స్‌ను, పవర్‌ ప్లాంట్‌ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే తెచ్చిందన్నారు. నల్లగొం డలో ఐటీ హబ్‌ ఏడాదిన్నరలో పూర్తవుతుందని, 1,600 మందికి ఉపాధి కల్పించేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఏడాదిన్నరలోగా నల్లగొండ ముఖచిత్రం మార్చుతామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నల్లగొండ పట్టణ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని.. రూ.100 కోట్లు ప్రకటించగా ఇప్పటికే రూ.30 కోట్లు విడుదల చేశామని తెలిపారు.

ఇన్ని ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు: ప్రశాంత్‌రెడ్డి 
రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వలేదంటూ దొంగదీక్షలు చేస్తున్నవారు.. వారి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ సర్కారు ఐటీ కంపెనీలు, పరిశ్రమలను ప్రోత్సహించి.. 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాలను కల్పించిందని, 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. 

నల్లగొండ బాధలు తీర్చారు: జగదీశ్‌రెడ్డి 
గతంలో ఐ అంటే, టీ అంటే అర్థం తెలియనోళ్లు ఐటీ శాఖ మంత్రులుగా పనిచేశారని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆర్‌కు ఉన్న అనుభవం, దూరదృష్టితో ఐటీ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఇన్నాళ్లు ఫ్లోరోసిస్‌తో బాధపడ్డ నల్లగొండ జిల్లా కష్టాలను సీఎం కేసీఆర్‌ తీర్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎంసీ కోటిరెడ్డి, ఎమెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, అధికారులు పాల్గొన్నారు. 

పట్టణంలో మంత్రుల పాదయాత్ర 
సమావేశం అనంతరం మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి నల్లగొండ పట్టణంలో పాదయాత్ర చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి క్లాక్‌ టవర్, డీఈవో కార్యాలయం, దేవరకొండ రోడ్డు వెంట నడుస్తూ.. స్థానిక సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. కాగా.. ఇటీవల తండ్రిని కోల్పోయిన తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌ను మంత్రులు పరామర్శించారు. 

కేటీఆర్‌ కాన్వాయ్‌ అడ్డగింత 
చిట్యాల, నల్లగొండ టూటౌన్‌: నల్లగొండ పర్యటనకు వెళ్తున్న మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ను రెండు చోట్ల బీజేపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. చిట్యాల వద్ద బీజేపీ పట్టణాధ్యక్షుడు కూరెళ్ల శ్రీను ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని రోడ్డుపైకి రాగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇక నల్లగొండ పట్టణంలో కేటీఆర్‌ కాన్వాయ్‌ను ఏబీవీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 


నల్లగొండ పాలిటెక్నిక్‌ కాలేజీలో జరిగిన సభకు హాజరైన జనం. (ఇన్‌సెట్‌లో) ప్రసంగిస్తున్న కేటీఆర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement