సాక్షి, హైదరాబాద్ : హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండాపోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు సమాచారం. పోలింగ్ అనంతరం విడుదైన ఎగ్జిట్ పోల్స్ టీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌దే విజయమని ఆరా సర్వే సంస్థ ప్రకటించింది. టీఆర్‌ఎస్‌కు 50.48 శాతం, కాంగ్రెస్‌కు 39.95శాతం, ఇతరులకు 9.57శాతం విజయవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. హుజూర్‌నగర్‌లోని అన్ని మండలాల్లో టీఆర్‌ఎస్‌కే ఆధిక్యమని తమ సర్వేలో తేలినట్టు ఆరా తెలిపింది. టీఆర్‌ఎస్ 15 వేల మెజారిటీతో విజయం సాధిస్తుందని నాగన్న సర్వే ప్రకటించింది. టీఆర్‌ఎస్ 52-52 శాతం, కాంగ్రెస్ 42-45శాతం, బీజేపీ 4-6 విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ప్రకటించిది.
భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్ : కేటీఆర్
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్ గెలవబోతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ విజయం కోసం కృషిచేసిన కార్యకర్తలకు, నాయకులకు ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘పార్టీ విజయం కోసం గత నెల రోజులుగా కష్టపడిన కార్యకర్తలకు, టీఆర్‌ఎస్ నాయకులకు ధన్యవాదాలు. పార్టీ విజయం కోసం ఎంతో కృషి చేశారు. నాకు అందిన సమాచారం మేరకు టీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో గెలవబోతోంది. భారీ మెజారిటీతో సైదిరెడ్డి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాగా, హుజూర్‌నగర్ శాసనసభ స్థానానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన భార్య పద్మావతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగగా.. అధికార టీఆర్‌ఎస్ పార్టీ సైదిరెడ్డిని తమ అభ్యర్థిగా నిలబెట్టింది. బీజేపీ కోటా రామారావుకు బీఫాం ఇచ్చి బరిలో నిలిపింది. ఉప ఎన్నిక ఫలితాన్ని అక్టోబరు 24న ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment